Powered By Blogger

8 జూన్, 2014

ఒక స్వప్నం...

ఒక స్వప్నం...

సాయంసంధ్యా గీతంలో నేను లీనమైనప్పుడు
సప్తస్వరాల కౌగిలిలో నేనే వాయులీనమైనపుడు 
శృతిలయల జతులతో నేను రమిస్తున్నప్పుడు...
నా మనసులో అలజడి రేపింది... ఓ ప్రణయ మంజరి

సంధ్యాగీతాల వాయులీనాల శృతులు దాటి
ఆ మంజీర నాదానికి మది పరవశించింది...
మేఘమాల పంపిన ముత్యాల జల్లుల్లో
తడిసి ముద్దవుతున్న ఆ ప్రణయ మంజరి
తన్మయ రూప లావణ్యాన్ని వర్ణించేందుకు
అక్షరాలు పోటీపడుతూ యుద్ధం చేశాయి...
ఆ యుద్ధంలో ఎన్నో అక్షరాలు నేలకొరిగాయి... 
చివరికి మిగిలిన కొన్ని అక్షరాలు రాజీపడి...
పదాబృందాలై... ఆ ప్రణయ లాహిరిని 
కవితా వనంలో... కవన ఝరిలో బంధించాయి

అలజడి జడివానలా చుట్టిముట్టింది నన్ను
కవన వనంలో అక్షర బంధితమైన ఆ జవ్వని
నన్ను చూసి... చిరునవ్వు కానుకిచ్చింది..
ఆ నవ్వు నుంచి జారిన కోటి గులాబీ రేకులు
నా తనువుని కౌగిట్లో ముంచి.. ఉక్కిరిబిక్కిరి చేశాయి

నా అందాన్ని బంధించిన ఈ అక్షరాలను 
ఓడిస్తే... నేను నీ సొంతం...అంది.. 
ఆ లలిత జనిత సౌందర్య నాయిక....

సమ్మోహనాక్షరాల కావ్య మాలికలేవో
నా చుట్టూ పరిభ్రమించాయి...
కోరి వచ్చిన కాంతను అక్షర గంధాలతో
కట్టిపడేయవోయీ... అని మనసుతో అన్నాయి..

ఆ కావ్యనాయికను వర్ణించ అక్షర సాధ్యమా...
సృష్టిలోని పూలరేకులన్నీ ఒక రేకుగా మారి
పారిజాత పూల కొమ్మకు ఒక పూవై పూసినా
ఆమె నగుమోముకి సాటిరావే...అమెని ఏమని వర్ణించను... అని దిగాలు

కోటి సుగంధాల లావణ్యాలను రంగరించినా
ఆమె అధరాల మధురం ముందు దిగదిడుపే...
ఆమె నడుము నయగారాన్ని చూసి 
సన్నజాజి పూల లతలు కూడా చిన్నబోతే
ఆమెను నేనేమని వర్ణించగలను...?

వంద శృంగార నైషధాలు పలికించే
ఆ కనుల సోయగాన్ని ఎలా వివరించను ?
సుమాల తాకిడికే కందిపోతున్న
పరువాల కోమలాన్ని ఏ అక్షరంతో బంధించను ?
మాటమాటకు ముత్యాల పోగులు పడుతుంటే
ఆమెను ఏ మాటతో మురిపించగలను..?

ఇక... ఇది ఒక కలగా అనుకుని
నిరాశగా... వెనుదిరిగాను....
కానీ... కళ్ల ముందు ఆ కావ్యనాయకి..
ఆమెను బంధించిన అక్షరాలు
నా ముందు మోకరిల్లాయి...
ఇంతకన్నా ఎవరు వర్ణించగలరు.. అన్నాయి..

దూరంగా... సాయం సంధ్య వెన్నెలను పంపింది
చందమామ నీడలో... చిరుగాలి సవ్వడికి...
నిచ్చెలి కురులు అలలు అలలుగా తాకుతుంటే..
ఆ తెరల మాటున తన ఆధరగంధం 
నా మేను సింధూరమైంది....

తూరుపు సింధూరంతో కనుల కొలనులో
మధుర స్వప్నం చెదిరిపోయింది...
సుమధుర జ్ఞాపకం మిగిలిపోయింది...
అంతా ఒక స్వప్నం....

 


 


 

 

 




 





28 మార్చి, 2014

నేను... ప్ర్రియమైన శత్రువుని




అవును నేను ప్రియమైన శత్రువుని

నిహారికల్లో నిగూఢంగా దాగిన
మంచుతునకల్లా తాకిన
భావవల్లరుల ప్రేమికుడిని
ఆ తలపులు దోచే ప్రియమైన శత్రువుని

రంగుల ఊహల్లో తడిసి
వర్ణరేఖాచిత్రాల్లో ఒదిగి
హరివిల్లుని జల్లుగా కురిపించిన
కుంచెతో స్నేహించే ప్రియమైన శత్రువుని

కనుల నుంచి జారిన
కన్నిటిని మొత్తం దోచి
కలల వలలు విసిరి
కనికట్టు చేసే ప్రియమైన శత్రువుని

మౌనమేఘాలను కరిగించి
అధరాల మధ్య గొడవ పెట్టి
మాటల మంత్రాలు జల్లి
మాయ చేసే ప్రియమైన శత్రువుని

శశిరేఖల్లో చీకటిని పరిహసించి
శిశిరాన్ని వసంతంతో కప్పేసి
ఆ ఆనందం అందరికీ పంచేయాలన్న
అత్యాశ ఈ ప్రియమైన శత్రువుకి

జాబిలినీ తీయగా మోసం చేసి..
వెన్నెల పువ్వులు దొంగిలించి
అందమైన నవ్వులకు బహుమతి
ఇవ్వాలన్న కోరిక ఈ ప్రియమైన శత్రువుది


 


15 మార్చి, 2014

మౌనవీణ





మాటలు మీటే ఆ మానస వీణ
మూగబోయింది ఎందుకో....
చిలకపలుకుల ఆ జాణ
నిశ్శబ్దాన్ని చేరదీసింది ఎందుకో....

మేఘమాల వర్షించాలనుకుంది
చిరుజల్లుగా చేరాలనుకుంది
ఆమె తుళ్లింత చూడాలనుకుంది
ఆ లావణ్యంతో జతకడదామనుకుంది
కానీ... ఆ మేఘామాలను మౌనం కమ్మేసింది


కాలి మువ్వలు అలికిడి మానేశాయి

ఆమె మాటకు, కాలి మువ్వకు రోజూ పోటీ
ఘల్లుఘల్లుమని ఆ మువ్వ
తుళ్లిపడే నవ్వుతో ఈ సిరిమువ్వ
కానీ... ఆ మువ్వల సవ్వడిని మౌనం మింగేసింది

రోజూ పిల్లతెమ్మెర ఎదురు చూసేది
ఆమెను ఆలింగనంలో ముంచేది
ఆమె మాటనే పాటగా మార్చేది...
ఈసారి మాట లేదు.. తెమ్మెర పాటా లేదు
ఆ మౌనం చూసి చిరుగాలులు భాష్పాలయ్యాయి...

ఆమె మాటలాడితే రోజూ ఆటలే...
ఆ అధారాల లతల జతలకు...
ఆమె నవ్వితే ఇక కేరింతలే
ఆ పెదవులకు పండగే....
ఇప్పడంతా మౌనమే.... ఆధరవిలాపమే...

ఆ మౌనంలోనూ ఎన్నో మాటలు మదిని అడిగితే చెప్తున్నాయి
మనసు అలిసిందో...
మాట సొలసిందో... ఏమో
కానీ... మౌనంలోనూ ఆమె మాట వినిపిస్తోంది....
ఆమె మౌనమూ ముచ్చట్లు  చెబుతోంది... 








1 మార్చి, 2014

ఓ... అంతులేని అన్వేషణ





ఓ మగువ.... నీ మనసు లోతుని
అన్వేషిస్తున్న బాటసారిని....

నా ప్రయాణంలో ఎన్ని ఓటములో
అన్నే గెలుపులు, మలుపులు

తరుణి మనసు ఓ అంతులేని కథ
ఎన్నిసార్లు ఓడినా అదో తీయని వ్యధ
 
పొగమంచు మేలి ముసుగులో
ఓ మనసా పలకరిస్తావు...

దరిచేరి మసుగు తీసే లోపే కరిగి
నేనొక మాయనని వెక్కిరిస్తావు...

సముద్రాన్ని దాచుకున్నావు...
ఒక్క అలనైనా తాకనీయవు...

ఆకాశంలో సగం నేనేనంటావు
శూన్యం తప్ప ఇంకేదీ కనపడనీయవు

అగాధం అంచున ఉంటానంటావు....
ఆ అగాధానికి అంతేలేదని నువ్వే చెప్తావు....

చిక్కుముడుల చిత్రాన్ని నేనంటావు...
విప్పిన కొద్దీ కొత్త ముడిని చిత్రిస్తూనే ఉంటావు...
 
మనసు పొరలు మరుల తరువంటావు
ఆ పొరల చెరలో కన్నీటి చుక్కనీ నేనే అంటావు

కలల వలలో చిక్కుతావని అంటే...
కనులు మూసుకున్నాను....

ఆ కలల వల నాపైనే విసిరి...
కలత నిదురవై వెళ్లిపోయావు...

ఎట్టకేలకు....
మససు వాకిట నిలబడి తలుపు తడితే...
లక్షప్రశ్నల నిలువెత్తు శిల్పమై మాయమయ్యావు...

అంతులేని కథని అన్వేషిస్తూ....
అంతం తెలియని దూరం ప్రయాణిస్తూ...
చిక్కుప్రశ్నలకు బదులు వెదుకుతూ...
నా... అన్వేషణ సాగుతూనే ఉంది...

వీడని చిక్కుముడి కోసం ఆరాటమెందుకని...
నా పిచ్చి మనసుని చూసి జాలిపడి ..
ఆ మనసు... ఓ నవ్వు నవ్వి....
పొగ మంచు మేలి ముసుగులో కరిగిపోయింది... 

 



22 ఫిబ్రవరి, 2014

రెండు గులాబీల ఆత్మకథలు....






దూరంగా రెండు గులాబీలు పడున్నాయి
ఆ గులాబీలు మాటాడుకుంటున్నాయి...
ఒక గులాబీ అడిగింది.. ఇంకో గులాబీని
ఏం ఇక్కడ పడున్నావని....
నా కథెందుకులే ముందు నీ కథ చెప్పు అంది...

ఏం చెప్పను.. ఎలా చెప్పను...
ప్రేమికుల గుర్తులం కదా... నలిగిపోతున్నాం
పోనీ నిజమైన ప్రేమా అంటే కాదే..
ఆ దేవదాసులు, లైలామజ్ఞూల...
ప్రేమ సౌందర్యం చూసినవాళ్లం కదా..
ఇప్పటి ప్రేమను చూస్తే కన్నీళ్లొస్తున్నాయి...
స్వచ్ఛత లేని మనసుల మాలిన్యం కంపు
ఆ కంపుని కప్పేందుకు గులాబీ కావాలి
అవసరాల కౌగిళ్లకు ప్రేమ పేరు పెట్టారు
ఆ కౌగిళ్ల మధ్య మాధుర్యం కాదున్నది
శారీరక అవసరం... ప్రేమంటారా దాన్ని
అందుకు మనమా రాయబారులం...
ఛీఛీ.. వెధవ బతుకు.....
అవసరం తీరాక... కోరిక చల్లారాక...
మరో ప్రేమ కోసం వెదుకులాట...
ఆ క్రమంలో ఓ జంట చేతుల్లో నలిగిపోయాను...
కనీసం... ఆ మురికి కాలవలోనైన పడేయొచ్చుగా
మాలిన్య మనసుల కంపుకన్నా...
గరళమేం కాదు.... ఆ మురికికాలువ..
ప్రేమ పేరుతో నన్ను వంచిస్తున్నారు
ప్రేమ లేని చోట గులాబి ఎలా గుబాళిస్తుంది.
ఇలా వారి చేతుల్లో నలిగి నిట్టూరుస్తూ
ఇలా నడిరోడ్డున పడ్డాను... ప్రేమవిలాప చిహ్నంగా
మరి నీ కథేంటి.... రెండో గులాబీనడిగింది.

ఇంతసేపు రోధిస్తూ కూర్చున్నాను...
నా కన్నా దురదృష్టవంతురాలు లేదని
కానీ... నీ కథ విన్నాక అర్థమైంది...
నేను అదృష్టవంతురాలిని
ఒక అందమైన ప్రేమలేఖలో ఒదిగాను నేను
ఆ లేఖలో అక్షరం అక్షరం నాకు గుర్తే..
వసంతంలో వెన్నెల వాన కురిసినట్టు
అవి అక్షరాలు కావు... స్వచ్ఛమైన ప్రేమ తునకలు
అలాంటి లేఖలు ఎన్నో...
అదిగో దూరంగా విలపిస్తున్నాడే
ఆతను రాసిన లేఖలే అవన్నీ....
ఆ కన్నీటి ధారకు పులకిస్తుంది ఆ సమాధి
ఆ సమాధిలో అతని ప్రేయసి జ్ఞాపకాలు
ఆమె ప్రతి పుట్టిన రోజుకి ప్రేమలేఖలు
ఆ ప్రేమలేఖల్లో నేను... నా గుబాళింపులు
ఆ రోజంతా ఆ సమాధే అతని లోకం
ఇది ప్రేమ కాదు... పిచ్చి అనుకున్నాను 
శవాలదిబ్బపై ఇంత అందగత్తెనైన నన్ను
బహుమతిగా పెడతాడా అని మండిపడ్డాను
కోపంతో ఇదిగో ఇలా లేఖ నుంచి జారిపోయాను
కానీ... నీ కథ విన్నాక ఇప్పుడు విలపిస్తున్నాను
ఆ స్వచ్ఛమైన ప్రేమకు రాయబారిగా లేనే అని..
ఈ ప్రేమికుడి కన్నీటి ధారల్లో తడిసి ముద్దై...
ఆ సందేశాన్ని తన ప్రేయసికి పంపలేకపోయానే అని....

మొదటి గులాబీ రెండో గులాబీతో....
నా ముళ్లు నాకే గుచ్చుకున్నాయి
నా మనసు అనాకారి ప్రేమను చూసి
నిర్జీవమైంది... నిరాకరమైంది...
కానీ... నువ్వు... 
అమరమైన ప్రేమకథలో...
చెదిరిపోని కన్నీటి జ్ఞాపకానివి
స్వచ్ఛమైన మనసుల గుబాళింపువి...

 





 
  

8 ఫిబ్రవరి, 2014

కసాయి కళ్లు...




ఆ కసాయి కళ్లు చూస్తున్నాయి
ఆ కళ్లకు మరో రెండు జతల కళ్లు తోడయ్యాయి
ఆ కళ్లలో సంస్కారం లేదు, సభ్యత లేదు
అవి మంచిని ఏనాడు చూసిన కళ్లు కావు

ఆ కసాయి కళ్లు...
భావోద్వేగాలకు ఏనాడు చెమర్చలేదు
అసలా మాటే వాటికి తెలీదు
తాగొచ్చి తండ్రి తల్లిని కొడితే చూసిన కళ్లవి
నాగరిక సమాజంలో ఆనాగరిక ఆనవాళ్లవి

విద్యని వెక్కిరించిన సంస్కార హీన కళ్లవి
మద్యం మత్తు కైపులో ఎర్రబడిన కళ్లవి
నీలి చిత్రాల ఉన్మాద క్రీడ ఇష్టం ఆ కళ్లకి
ఆడపిల్లలంటే ఆటబొమ్మలు ఆ కసాయి కళ్లకి

ఆ కసాయి కళ్లు మత్తుగా చూస్తున్నాయి
చీకటిలో కలిసిపోయి వెంబడిస్తున్నాయి
వెంబడిస్తున్నారని పాపం ఆ అబలకి తెలీదు
దట్టమైన అడవి కాదది... జనారణ్య నగరం
అక్కడా మృగాలుంటాయని తెలియదు... పాపం.

అకస్మాత్తుగా ఆ కళ్లు ఆమెను చుట్టుముట్టాయి
ఆ కళ్లు వికృతంగా నవ్వాయి
భయం నీడలో తోడేళ్ల ఊలల్లా ఆ నవ్వులు
తప్పించుకునే పెనుగులాటలో ఓడిపోయింది... ఆమె

ఆ చీకటి నుంచి మరో చీకటిలోకి
బతిమాలింది, ఏడ్చింది, కాళ్లు పట్టుకుంది
తల్లిని, చెల్లినీ గుర్తుచేసింది...
నిస్సహాయ స్థితిలో మానసికంగా నిర్జీవమైంది

కనికరం లేని ఆ కసాయి కళ్లకు తల్లా, చెల్లా
కామోన్మాదంలో వాళ్లనూ చెరిచే రాక్షసులు.
ఆ కళ్లకి ఆమె కన్నీళ్లు కనిపించలేదు...
పెనుగులాటలో నగ్నంగా మారిన శరీరం తప్ప...

కుక్కలు శవాన్ని పీక్కు తిన్నట్టు...
నరమాంస భక్షకుల్లా ఆమెపై రుధిర క్రీడ  
ఓ కంట ఆమె కన్నీటి ధార. అది కన్నీరో... రుధరమో
వికటాట్టహాసాల మధ్య నలిగిపోతూనే ఉంది

ఒకరు, ఆపై మరొకరు, ఇద్దరు, ముగ్గురు
అత్యాచారవికృతానికి ఆ చీకటి సాక్ష్యం
ఆ రాక్షసకాండను చూసి మృత్యువే భయపడింది
ఆమెను తన కౌగిలిలోకి తీసుకుని ఓదార్చింది
అవును... ఆమె మరణించింది.....

ఉన్మాదుల శవక్రీడ ముగిసింది
ఆ కసాయి కళ్లలో పైశాచిక ఆనందం
మళ్లీ ఆ కళ్లు చీకటిలో కలిసిపోయాయి..
ఆమె కంటి నుంచి రుధరధార ఆగలేదు

అది అర్ధరాత్రి కాదు, అమావాస్యా కాదు 
సమాజం ఇంకా నిద్రపోనూ లేదు...
భద్రత లేని నడిరోడ్లు ఉన్మాదుల రహదార్లు
బలహీనుల ఆక్రందనలతో నిండిన శ్మశానాలు















6 ఫిబ్రవరి, 2014

ప్రియమైన జవరాలికి... మనసులో మాట




తొందరగా రా ప్రియా...
ప్రపంచమంతా చుట్టూ ఉంది
కానీ... నువ్వు లేనిది.. ప్రపంచమే కాదు
ప్రతి క్షణం ఒంటరితనం గుచ్చుతోంది...

నువ్వు లేని ఒక్క క్షణం
శూన్యంలో ఒక శతాబ్దం
అగాధంలో ఒక యుగం
ఆ క్షణాన్ని తుంచేస్తూ వచ్చేయవా....

రాత్రి ఆకాశం వైపు చూస్తున్నా...
నిండు పౌర్ణమి ఆ రోజు
కానీ... అది నాకు అమావాస్యలా ఉంది
నువ్వు లేవుగా... అందుకేనేమో

గాలిలో అస్పష్టంగా నీ రూపం
పరిగెత్తుకుంటూ వెళ్లా కౌగిలి కోసం
ఏదీ... పిచ్చీ.. అని వెక్కిరించిందా రూపం
నాలో వాయులీనమై... విరహాగ్ని రేపింది

దగ్గరుంటే కసుర్లు, విసుర్లూ
కాస్త దూరం పెరిగినా గుండె బరువు
ఎడబాటు చెప్పింది నాలో నేను లేనని
ఉన్నదంతా నువ్వేనని... అందుకే రా...

నా జ్ఞాపకాల దొంతరల్లో... నీవే
ఎన్ని చిలిపి తగవులు...
ఎన్ని వలపు అలకలు.
ఎన్నని చెప్పను... అదో ప్రేమకావ్యం

ఏడడుగులు, మూడు ముళ్లతో
ఇంత ప్రేమ బంధనమా...
నాలో సగభాగమంటారు గానీ... కాదు
నాలో నీవు, నీలో నేను... మొత్తం మనమే

నీ ఊసులు, చిరునవ్వులు....
కలలో లీలగా నను తాకితే...
నిజమనుకుని కనులు తెరిచా...
నిదుర రానంది చెలీ... నీవు లేనిది

ఆ దూర తీరాన నీవున్నావు..
కానీ, నీ మనసు సందేశం అందింది
నా మనసులో మాటే నీదని...
వీరహ వీణపై వేదన పలుకుతోందని

మరి జాగేలా చెలి...
ఎద తలుపులు తెరిచే ఉంచాను..
వలపు వాకిట నిరీక్షిస్తున్నాను
నీ రాక కోసం... ప్రేమతో...

                                                      















.