Powered By Blogger

29 నవంబర్, 2013

అలిగితివా... సఖి.. చెలీ...




కాస్త జాగు చేశాను... అంతలోనే అలక
ముఖము తిప్పుకుంటే గుండెకోత
నల్లంచు ఎర్రచీర చిరచిర మిరపలా
చిటపటలాడుతోంది కోపంగా...
చిగురాకు రవిక తహతహలో
దాగున్న వలపు రమ్మందిలే ప్రేమగా..

ముచ్చటగా పారాణి అద్దావు
జడగంటలు విసిరి కవ్విస్తున్నావు
నడుమ నడుమొకటి.. చంపేస్తున్నావు
రవ్వల గాజుల సవ్వడి పిలుపందిస్తున్నావు
దరిచేరితే ముఖము తిప్పావు...
అలకల చిలకల మూగనోము పట్టావు

అలిగిన చెలికి బుంగమూతే అందం
నా దానవని వస్తే ఏమిటీ రాద్దాంతం
లేరా ఆవల పదహారు వేల మంది...
కాదని ఈ చెలి కోసం వస్తే... ఇదేం విరహం

నా వేణువులో నీవు కావా వాయులీనం
నా హృదిలో నీవే కదా వలపు సుగంధం
అలసిసొలసి వచ్చితినే చెలి కోసం
సేద తీర్చరాదే.. రాధామనోహరం

అలకలో దాగున్న ఆందమే అందం
ఆ ఆందాన్ని పట్టి వేస్తానే బంధం
అద్దంలో చిక్కిందే నీ అందం..
ఓ బింబమా... చెప్పవే నీవైనా
అలక మానమని నీ సఖిని..
ఆలస్యమున కరిగిన ఒక్కో క్షణముకు
ఒక్కో ప్రణయ గాన లహరి ఈ నగుమోముకు


నిరీక్షణలో చెలి పడిన బాధ
తెలిసిందిలే ఆ మనసు వ్యధ
కానీ.. బింబము మాటున గమనించితినే
క్రీగంట చాటున చిలిపి ఆటపట్టు...
సొట్టబుగ్గలో కొంటెనవ్వు..  
ఇక బింకమాపవే.. మాధవుడే వచ్చాడు
మనసు కోరాడు... మదినిండా ప్రేమతో...



27 నవంబర్, 2013

ఆ చివరి కన్నీటి చుక్క...



ఆమె కంట కన్నీరు తడి
ఆమెవరో నాకు తెలీదు
అడిగే పరిచయమూ లేదు
కానీ... ఆ కన్నీరు అడగమంటోంది
కొన్నిటికి పరిచయాలక్కర్లేదంది
ఓదార్చే హృదయానికి హద్దులు లేవంది

ఆమె, నేను.. మధ్యలో పదడుగుల దూరం
బయట భోరున వర్షం
ఎవరికెవరో ఈ జీవితంలో
ఓ చిన్న చెట్టు నీడలో మేమిద్దరం
అంత వర్షంలో తడిసినా
నీటికి, కన్నీటికి తేడా తెలుస్తోంది

అటు తిరిగి ఆమె
ఆమె వైపు తిరిగి నేను...
కష్టం తెలుసుకోవా అని వేదనగా...
జాలిగా చూస్తూ బాధతో
ఆ వర్షంలో కలిసిపోయింది కన్నీరు...
నా అసమర్ధతను తిట్టుకుంటూ

రుధిర ధారా ప్రవాహంలా
ఆ కంట కన్నీరు కట్టలు తెంచుకుంటోంది
ఏదో తీరని కష్టమే కలిగింది
నాలో నేను ఏవేవో ఊహించుకున్నాను
వాటితో ఆమె ఏదో ఒక కష్టానికి
సరిపోతుంది అని సరిపెట్టుకున్నాను

నేల జారుతున్న కన్నీటి చుక్కలు
నా వైపు కోపంగా చూస్తూ శిధిలమయ్యాయి
జాలిలేదా అని ప్రశ్నిస్తూ కసురుకున్నాయి
ఒక్క మాట  అడిగితే ఏమైందని విన్నవించాయి
గుండెలోని బాధ చెప్పుకుంటేనే కదా
ఈ కన్నీటి బరువు తగ్గేది.. అని గుర్తుచేశాయి

నా మనసు దిటవు చేసుకున్నాను
పదడుగుల దూరాన్ని సగం చేశాను
ఏమైందీ.. అని మనసడిగింది
నా గొంతు మాత్రం పెగల్లేదు
వర్షం తగ్గింది.. ఆమె వెళ్లిపోియింది

సుదూరంగా ఆమె కనుమరుగైంది
కానీ... తన బాధాతప్త హృదయ రాయబారిగా
చివరి కన్నీటి చుక్క నా వైపే దీనంగా చూస్తూ
బాధ పంచుకోలేని జీవితం..
ఒక జీవితమేనా అని ప్రశ్నిస్తూ
జడివానలో కలిసిపోయింది...

(పై చిత్రం చూసి ఆ  చివరి కన్నీటి చుక్క భావాన్ని రాయలనిపించింది)


యువతా మేలుకో, ఓటు హక్కు వినియోగించుకో...


నిన్న యువత-ఓటు హక్కుపై మా ప్రతిధ్వని ప్రత్యేక చర్చ...

నిన్న మా ప్రతిధ్వని ప్రత్యేక చర్చా కార్యక్రమం ఈనాడులో...
http://eenadu.net/news/newsitem.aspx?item=panel&no=12

నిన్న ప్రతిధ్వని ప్రత్యేక చర్చ నిర్వహించాం. ఉదయం 11.30 నుంచి ఒంటి గంటవరకు ఈటీవీ-2లో
యువత  ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటేనే సమాజం మారుతుందన్న అంశంపై
చేశాం. దానికి సంబంధించిన ఈనాడు కవరేజ్ ఇది.
సతీష్ కొత్తూరి, ఈటీవీ-2 ప్రతిధ్వని లీడ్