Powered By Blogger

29 నవంబర్, 2013

అలిగితివా... సఖి.. చెలీ...




కాస్త జాగు చేశాను... అంతలోనే అలక
ముఖము తిప్పుకుంటే గుండెకోత
నల్లంచు ఎర్రచీర చిరచిర మిరపలా
చిటపటలాడుతోంది కోపంగా...
చిగురాకు రవిక తహతహలో
దాగున్న వలపు రమ్మందిలే ప్రేమగా..

ముచ్చటగా పారాణి అద్దావు
జడగంటలు విసిరి కవ్విస్తున్నావు
నడుమ నడుమొకటి.. చంపేస్తున్నావు
రవ్వల గాజుల సవ్వడి పిలుపందిస్తున్నావు
దరిచేరితే ముఖము తిప్పావు...
అలకల చిలకల మూగనోము పట్టావు

అలిగిన చెలికి బుంగమూతే అందం
నా దానవని వస్తే ఏమిటీ రాద్దాంతం
లేరా ఆవల పదహారు వేల మంది...
కాదని ఈ చెలి కోసం వస్తే... ఇదేం విరహం

నా వేణువులో నీవు కావా వాయులీనం
నా హృదిలో నీవే కదా వలపు సుగంధం
అలసిసొలసి వచ్చితినే చెలి కోసం
సేద తీర్చరాదే.. రాధామనోహరం

అలకలో దాగున్న ఆందమే అందం
ఆ ఆందాన్ని పట్టి వేస్తానే బంధం
అద్దంలో చిక్కిందే నీ అందం..
ఓ బింబమా... చెప్పవే నీవైనా
అలక మానమని నీ సఖిని..
ఆలస్యమున కరిగిన ఒక్కో క్షణముకు
ఒక్కో ప్రణయ గాన లహరి ఈ నగుమోముకు


నిరీక్షణలో చెలి పడిన బాధ
తెలిసిందిలే ఆ మనసు వ్యధ
కానీ.. బింబము మాటున గమనించితినే
క్రీగంట చాటున చిలిపి ఆటపట్టు...
సొట్టబుగ్గలో కొంటెనవ్వు..  
ఇక బింకమాపవే.. మాధవుడే వచ్చాడు
మనసు కోరాడు... మదినిండా ప్రేమతో...



4 కామెంట్‌లు: