Powered By Blogger

22 డిసెంబర్, 2016

గంధము పుయ్యరుగా...




మహనీయుడు త్యాగరాజు ఎన్నో గొప్ప కీర్తనలు రాశారు. వాటిలో ప్రతీ ఇంటా వినిపించే కీర్తన గంధము పూయరుగా.. మన ఇంట్లో అన్ని శుభకార్యాల్లో మంగళ హారతిగా పాడడం ఆనవాయితి. ఏ మాత్రం పాడగలిగినా.. ఈ కీర్తనను అందరూ ఆలపించవచ్చు. అంతే కాదు. ఇందులో పదాల్లో స్వచ్ఛమైన  తెలుగు దాగుంది. ఉదాహరణకు.. మాలిమి అంటే వాత్సల్యం, ప్రేమ. 'మాలిమితో గోపాల బాలురతో నాల మేపిన విశాలనయనునికి' అంటే ప్రేమతో పశువులు కాసుకునే గోపాలకులతో ఆడుకున్నావు, వారితో కలిసి 'ఆల' అంటే ఆవులు మేపావు.. నీ అంత గొప్ప వ్యక్తిత్వం ఎవరికైనా ఉంటుందా అంటూ విశాలమైన కళ్లున్నవాడా అని పొగిడారు త్యాగరాజు. శ్రీ కృష్ణుడిని  ఇంత అందంగా వర్ణించిన కీర్తన మరోటి లేదనిపిస్తుంది నాకైతే. 'అందమైన యదునందనుపై కుందరదన లిరవొందగ పరిమళ' అంటాడు త్యాగరాజు. యదునందనుడు  అందమైన వాడు... అలాంటి అందాల కృష్ణుడికి కుందరదన అంటే  మల్లెమొగ్గల్లాంటి తెల్లని పలు  వరుసలతో మెరిసేవాడని అర్థం. అలా వళ్లంతా పూల పరిమళాల  మెరుపులు వచ్చేలా ఆయనకు గంధం పూయండంటాడు. ఎంత అద్భుతమైన వర్ణన. ఇలాంటి మంచి తెలుగుపదాలెన్నో ఉన్నాయి ఇందులో. పిల్లలకు నేర్పిస్తే.. వారిలో గాన మాధుర్యంతో పాటు... మంచి తెలుగు పదాలు తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. అందుకే కీర్తనతో పాటు అందరికీ తెలియాలని సాహిత్యం కూడా అందించాం. ఈ కీర్తనను ఆదరిస్తున్న స్నేహితులు, పెద్దలందరికీ ధన్యవాదాలు. పున్నాగ వరాళి రాగంలో ఈ కీర్తనను స్వరపరిచారు త్యాగరాజు. ఆ రాగంలో శాస్త్రీయంగా గానం చేసి... జనబాహుళ్యంలోకి మరింతగా తీసుకొచ్చిన మరో మహానుభావుడు. కేరళకు చెందిన వాగ్గేయకారుడు రామవర్మ. ఈ వీడియోలో పాట వినడమే  కాదు... నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారు పాడేలా కూడా text వేశాం. అందరూ పాడుకునేలా... సరళమైన స్వరాలతో కీర్తన రూపొందించాం. ఈ కీర్తనను  చూడండి ఓ సారి....