దూరంగా రెండు గులాబీలు పడున్నాయి
ఆ గులాబీలు మాటాడుకుంటున్నాయి...
ఒక గులాబీ అడిగింది.. ఇంకో గులాబీని
ఏం ఇక్కడ పడున్నావని....
నా కథెందుకులే ముందు నీ కథ చెప్పు అంది...
ఏం చెప్పను.. ఎలా చెప్పను...
ప్రేమికుల గుర్తులం కదా... నలిగిపోతున్నాం
పోనీ నిజమైన ప్రేమా అంటే కాదే..
ఆ దేవదాసులు, లైలామజ్ఞూల...
ప్రేమ సౌందర్యం చూసినవాళ్లం కదా..
ఇప్పటి ప్రేమను చూస్తే కన్నీళ్లొస్తున్నాయి...
స్వచ్ఛత లేని మనసుల మాలిన్యం కంపు
ఆ కంపుని కప్పేందుకు గులాబీ కావాలి
అవసరాల కౌగిళ్లకు ప్రేమ పేరు పెట్టారు
ఆ కౌగిళ్ల మధ్య మాధుర్యం కాదున్నది
శారీరక అవసరం... ప్రేమంటారా దాన్ని
అందుకు మనమా రాయబారులం...
ఛీఛీ.. వెధవ బతుకు.....
అవసరం తీరాక... కోరిక చల్లారాక...
మరో ప్రేమ కోసం వెదుకులాట...
ఆ క్రమంలో ఓ జంట చేతుల్లో నలిగిపోయాను...
కనీసం... ఆ మురికి కాలవలోనైన పడేయొచ్చుగా
మాలిన్య మనసుల కంపుకన్నా...
గరళమేం కాదు.... ఆ మురికికాలువ..
ప్రేమ పేరుతో నన్ను వంచిస్తున్నారు
ప్రేమ లేని చోట గులాబి ఎలా గుబాళిస్తుంది.
ఇలా వారి చేతుల్లో నలిగి నిట్టూరుస్తూ
ఇలా నడిరోడ్డున పడ్డాను... ప్రేమవిలాప చిహ్నంగా
మరి నీ కథేంటి.... రెండో గులాబీనడిగింది.
ఇంతసేపు రోధిస్తూ కూర్చున్నాను...
నా కన్నా దురదృష్టవంతురాలు లేదని
కానీ... నీ కథ విన్నాక అర్థమైంది...
నేను అదృష్టవంతురాలిని
ఒక అందమైన ప్రేమలేఖలో ఒదిగాను నేను
ఆ లేఖలో అక్షరం అక్షరం నాకు గుర్తే..
వసంతంలో వెన్నెల వాన కురిసినట్టు
అవి అక్షరాలు కావు... స్వచ్ఛమైన ప్రేమ తునకలు
అలాంటి లేఖలు ఎన్నో...
అదిగో దూరంగా విలపిస్తున్నాడే
ఆతను రాసిన లేఖలే అవన్నీ....
ఆ కన్నీటి ధారకు పులకిస్తుంది ఆ సమాధి
ఆ సమాధిలో అతని ప్రేయసి జ్ఞాపకాలు
ఆమె ప్రతి పుట్టిన రోజుకి ప్రేమలేఖలు
ఆ ప్రేమలేఖల్లో నేను... నా గుబాళింపులు
ఆ రోజంతా ఆ సమాధే అతని లోకం
ఇది ప్రేమ కాదు... పిచ్చి అనుకున్నాను
శవాలదిబ్బపై ఇంత అందగత్తెనైన నన్ను
బహుమతిగా పెడతాడా అని మండిపడ్డాను
కోపంతో ఇదిగో ఇలా లేఖ నుంచి జారిపోయాను
కానీ... నీ కథ విన్నాక ఇప్పుడు విలపిస్తున్నాను
ఆ స్వచ్ఛమైన ప్రేమకు రాయబారిగా లేనే అని..
ఈ ప్రేమికుడి కన్నీటి ధారల్లో తడిసి ముద్దై...
ఆ సందేశాన్ని తన ప్రేయసికి పంపలేకపోయానే అని....
మొదటి గులాబీ రెండో గులాబీతో....
నా ముళ్లు నాకే గుచ్చుకున్నాయి
నా మనసు అనాకారి ప్రేమను చూసి
నిర్జీవమైంది... నిరాకరమైంది...
కానీ... నువ్వు...
అమరమైన ప్రేమకథలో...
చెదిరిపోని కన్నీటి జ్ఞాపకానివి
స్వచ్ఛమైన మనసుల గుబాళింపువి...