ఆ కసాయి కళ్లు చూస్తున్నాయి
ఆ కళ్లకు మరో రెండు జతల కళ్లు తోడయ్యాయి
ఆ కళ్లలో సంస్కారం లేదు, సభ్యత లేదు
అవి మంచిని ఏనాడు చూసిన కళ్లు కావు
ఆ కసాయి కళ్లు...
భావోద్వేగాలకు ఏనాడు చెమర్చలేదు
అసలా మాటే వాటికి తెలీదు
తాగొచ్చి తండ్రి తల్లిని కొడితే చూసిన కళ్లవి
నాగరిక సమాజంలో ఆనాగరిక ఆనవాళ్లవి
విద్యని వెక్కిరించిన సంస్కార హీన కళ్లవి
మద్యం మత్తు కైపులో ఎర్రబడిన కళ్లవి
నీలి చిత్రాల ఉన్మాద క్రీడ ఇష్టం ఆ కళ్లకి
ఆడపిల్లలంటే ఆటబొమ్మలు ఆ కసాయి కళ్లకి
ఆ కసాయి కళ్లు మత్తుగా చూస్తున్నాయి
చీకటిలో కలిసిపోయి వెంబడిస్తున్నాయి
వెంబడిస్తున్నారని పాపం ఆ అబలకి తెలీదు
దట్టమైన అడవి కాదది... జనారణ్య నగరం
అక్కడా మృగాలుంటాయని తెలియదు... పాపం.
అకస్మాత్తుగా ఆ కళ్లు ఆమెను చుట్టుముట్టాయి
ఆ కళ్లు వికృతంగా నవ్వాయి
భయం నీడలో తోడేళ్ల ఊలల్లా ఆ నవ్వులు
తప్పించుకునే పెనుగులాటలో ఓడిపోయింది... ఆమె
ఆ చీకటి నుంచి మరో చీకటిలోకి
బతిమాలింది, ఏడ్చింది, కాళ్లు పట్టుకుంది
తల్లిని, చెల్లినీ గుర్తుచేసింది...
నిస్సహాయ స్థితిలో మానసికంగా నిర్జీవమైంది
కనికరం లేని ఆ కసాయి కళ్లకు తల్లా, చెల్లా
కామోన్మాదంలో వాళ్లనూ చెరిచే రాక్షసులు.
ఆ కళ్లకి ఆమె కన్నీళ్లు కనిపించలేదు...
పెనుగులాటలో నగ్నంగా మారిన శరీరం తప్ప...
కుక్కలు శవాన్ని పీక్కు తిన్నట్టు...
నరమాంస భక్షకుల్లా ఆమెపై రుధిర క్రీడ
ఓ కంట ఆమె కన్నీటి ధార. అది కన్నీరో... రుధరమో
వికటాట్టహాసాల మధ్య నలిగిపోతూనే ఉంది
ఒకరు, ఆపై మరొకరు, ఇద్దరు, ముగ్గురు
అత్యాచారవికృతానికి ఆ చీకటి సాక్ష్యం
ఆ రాక్షసకాండను చూసి మృత్యువే భయపడింది
ఆమెను తన కౌగిలిలోకి తీసుకుని ఓదార్చింది
అవును... ఆమె మరణించింది.....
ఉన్మాదుల శవక్రీడ ముగిసింది
ఆ కసాయి కళ్లలో పైశాచిక ఆనందం
మళ్లీ ఆ కళ్లు చీకటిలో కలిసిపోయాయి..
ఆమె కంటి నుంచి రుధరధార ఆగలేదు
అది అర్ధరాత్రి కాదు, అమావాస్యా కాదు
సమాజం ఇంకా నిద్రపోనూ లేదు...
భద్రత లేని నడిరోడ్లు ఉన్మాదుల రహదార్లు
బలహీనుల ఆక్రందనలతో నిండిన శ్మశానాలు