కలం కదులుతోంది...
చురకత్తిల చురచురమని
సిరా ఉరకలై బిలబిలమని
స్వేచ్ఛా విహంగాలతో...
కదం తొక్కుతోంది...
నా కలం కదులుతోంది...
చీకటి తెరలను తరుముతు...
అజ్ఞానం అంతు చూస్తూ..
అగాధాన్ని పెకలిస్తూ...
గగనాన్ని నేలకు తెస్తూ...
ఈ కలం కదులుతోంది....
శిధిలమైన చచ్చు మెదళ్ల....
మొద్దు నిద్ర తట్టిలేపి...
అక్షర పునాది వేసి..
ఆలోచనల గోడ కట్టి....
నా కలం కదులుతోంది...
కన్నీటిని ఒడిసి పట్టి....
వ్యధా జీవనాన్ని తట్టి...
ఉన్మాదాన్ని చితక్కొట్టి...
అరాచకాన్ని తరిమికొట్టి....
ఈ కలం కదులుతోంది...
ఆశకు ఆయువు పోస్తూ...
కలలకు రూపం ఇస్తూ...
ధైర్యాన్ని నూరిపో్స్తూ...
నైరాశ్యాన్ని నమిలేస్తూ...
నా కలం కదులుతోంది...
ఆక్షర సేద్యానికి నాగలి పట్టి
నిరక్షరాస్యత కలుపు తీసి
నాగరికతకు నీరు పట్టి...
సంస్కారాల పంట పండించి....
ఈ కలం కదులుతూనే ఉంది
ఈ సిరా చిలుకుతూనే ఉంది...
నిబిడాంధకారాల అహంకారాన్ని
వెలుగుల కరతాళ ధ్వనులతో...
తరిమి.. తరిమి... కొట్టి...
నవయవ్వన ఉషోదయాల..
చైతన్య కిరణాలను పంచేవరకు...
నా కలం కదులుతూనే ఉంటుంది
ఈ సిరా చిలుకుతూనే ఉంటుంది