Powered By Blogger

18 సెప్టెంబర్, 2012

లక్క ఇంటి కథ ఇదీ...

పాండవుల అడ్డుతొలగించుకునేందుకు సుయోధనుడు
కుట్రపన్నుతాడు. రాజసూయ యాగంతో రాజ్యం మొత్తాన్ని
అప్పటికే ధర్మరాజు ఓ తాటి మీదకు తెస్తాడు.
పాండవులు హస్తినలో ఉంటే.. ఇక తను జీవితాంతం
ఓ యువరాజుగానే మిగిలిపోతాను అనుకుంటాడు
సుయోధనడు. అప్పుడు తండ్రి దగ్గరకు వెళ్లి
పాండవుల నుంచి రాజ్యం తీసుకుని తనకిమ్మని
అడగుతాడు.. అలుగుతాడు.
మితిమీరిన పుత్రవాత్సల్యం.. వారు చేసేవి దుర్మార్గాలని
తెలిసినా ఒప్పుకొనే దృతరాష్ట్రుడు... పాండవులను
వారణావతం వెళ్లి కొన్నాళ్లు ఆహ్లాదంగా గడిపి రమ్మని
పంపిస్తాడు. అప్పటికి పాండవుల వయసులు కూడా
వ్యాసుడు స్పష్టంగా చెప్పాడు. ధర్మజుడికి 29, భీముడికి 28
అర్జునుడికి 27, నకులసహదేవులకు 26, 26.
ఇదే అదనుగా సుయోధనుడు.. పురోచనుడు అనే నమ్మకస్తుడిని
ప్రలోభ పెట్టి... లక్క, నెయ్యిలు అధికంగా కలిపిన సున్నంతో
వారాణావతంలో పాండవులు నివసించేందుకు ఒక ఇల్లు
కట్టమని పురమాయిస్తాడు. అలాగే ఇల్లు కట్టి పురోచనుడు.. పాండవులకు
ఇస్తాడు. అందులోనో ఓ బోయ యువతిని వారి సపర్యలకు నియమిస్తాడు. ఆమెకు ఐదుగురు కొడుకులు. అందరూ ఆ ఇంట్లో ఉంటారు. కుట్ర విదురిడికి తెలిసిపోతుంది.ఆ ఇంటి వాసన బట్టి ధర్మజుడికీ అనుమానం
వస్తుంది. కానీ.. సమయం వచ్చినపుడు చూద్దామని ఊరుకుంటాడు.
కానీ కుట్రతెలుసుకున్న విదురుడు పాండవులను రక్షించాలని
ఒక నమ్మకస్తుడైన ఖనకుడిని నియమిస్తాడు (ఖనకుడు అంటే
బావులు సొరంగాలు తవ్వే వాడు అని). అతనికి విషయం చెప్పి.. మూడో కంటికి
తెలియకుండా... పాండవులను గట్టున పడేయమని చెప్తాడు. ఖనకుడు
రహస్యంగా పాండవులను కలిసి.. విదురుడు చెప్పిన విషయం తెలియబరుస్తాడు.
లక్క ఇంటి మధ్యలో పెద్ద సొరంగం తవ్వేందుకు ధర్మరాజుని అనుమతి
అడుగుతాడు.  ఆ సొరంగం వారి అక్కడి నుంచి మరో ప్రాంతానికి
తీసుకువెళ్తుందనమాట. మాట ప్రకారం.. ఖనకుడు రాత్రిళ్లు
రహస్యంగా ఆ పని ప్రారంభిస్తాడు.
ధుర్యోధనుడు తాను ఏ ముహూర్తానికైతే లక్క ఇంటిని తగులబెడదామని
అనుకున్నాడో.. ఆ సమయాన్ని కూడా ఖనకుడు చెప్తాడు. అదే సమయానికి
భీముడు ముందు పురోచనుడు (లక్క ఇల్లు నిర్మించిన సుయోధన వేగు)
ఉన్న ఇంటిన తగులబెడతాడు. ఆ తర్వాత లక్క ఇంటినీ తానే తగులబెడతాడు.
ఖనకుడు నిర్మించిన సొరంగ మార్గం ద్వారా.. అందరూ బయటపడతారు. కానీ..
పురోచనుడు నియమించిన బోయ సేవిక, ఆమె కుమారు ఆ ఇంట్లోనే కాలి
బూడిదవుతారు. మర్నాడు... బూడిదైన ఇంట్లో శవాలు చూసిన ప్రజలు
చనిపోయింది పాండవులే అనుకుంటారు. ఖనకుడు కూడా వారిలో కలిసి
బూడిద తొలగిస్తున్నట్టు నటించి.. ఆ బూడిదతో సొరంగం కనపడకుండా
కప్పేస్తాడు. ఇదీ అసలు కథ. కానీ.. నేనెంతో ఇష్టపడి చూసిన మేధావులు తీసిన
శ్రీ కృష్ణ పాండవీయంలో సొరంగం తవ్వింది... భీముడనే చూపించారు.
శ్రీ కృష్ణుడే కుట్రను పాండవులకు చెప్పినట్టుగా తీశారు. అద్భుతమైన
పాట కూడా పెట్టారు (మత్తు వదలరా నిద్దుర). మాయలు, మర్మాలు
చూపించారు. భారతంలో ఎక్కడా మాయలు మర్మాలు లేవు. శ్రీ కృష్ణుడు
కూడా తను నారాయణ అంశని రెండు చోట్లే చూపిస్తాడు. ఈ కథంతా ఎందుకంటే
భారతంలో శ్రీకృష్ణుడి ప్రవేశం... వారణావతంలో.. లక్క ఇంటిలో కాదు. అని చెప్పేందుకు ఈ కథ రాస్తున్నాను.
భారతంలో శ్రీకృష్ణుడి పాత్ర మరెప్పుడు ప్రవేశిస్తుందో. మరో సారి చెప్తాను.
అయితే కమర్షిలైజ్ చేయడం కోసం.. అలా చేసిన తప్పేం లేదు. గానీ
ఇప్పటికే రామాయణ, భారతాలను వక్రీకరించి.. పెడర్ధాలు తీస్తున్న
కుహనా చరిత్రకారులు తయరైయ్యారు. అందుకే అసలు విషయాలు
తెలియచేయాలని ఈ ప్రయత్నం. ఎవరినీ తప్పు పట్టడం కాదు.




17 సెప్టెంబర్, 2012

ఇదీ అసలు భారతం...

నా స్నేహితుల్లో ఒకతనికి ఒక సందేహం వచ్చింది. ఒరేయ్... మహాభారతంలో
శ్రీకృష్ణుడు పాండవులు ఎప్పుడు మొట్టమొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు.
అని అడిగాడు. తత్తరపోడం నా వంతైంది. చిన్నప్పుడు భారతంలో ఘట్టాలైతే
చదివాను గాని.. నిజానికి వాడి ప్రశ్నకు సమాధానం గుర్తుకు  రాలేదు.
కాదు.. తెలీదు అంటే నిజాయితీగా ఉంటుంది.
వాడికి సందేహం తీర్చడానికని కాదుగాని.. నాకే తెలుసుకోవాలని
అనిపించింది. ఎవరినో పండితులను అడగటం ఎందుకని...
వ్యాస సంహిత, నన్నయతిక్కనఎర్రాప్రెగడ అనువాదితమైన
భారతం చదవడం మొదలుపెట్టాను. ధ్రోణపర్వం వరకు వచ్చేశాను.
అయితే.. చదువుతుంటే చాలా షాక్ అవుతూ వచ్చాను.
చిన్నప్పుడు సినిమాల్లో భారతం ఎంత వక్రీకరణకు గురైందో,
ఏరకంగా దర్శక, మహామహులైన కథారచయిత కలవాలాలకు
తునాతునాకలైందో... అర్థమైంది. ఎంత సుందరమైనది భారతం.
చాలా విషయాలు పంచుకోవాలి. నేను రాసే విషయాల్లో ఏమైనా
తప్పులుంటే.. వెంటనే ఖండించగలరు. రేపటి నుంచి కొన్ని భారత
వాస్తవాలు పంచుకుంటాను.