రంగుల అలవా, చిలిపి కలవా
కుంచెకు చిక్కిన అల్లరివా
వర్ణాలకే వర్ణన నేర్పిన కొంటెవా
పల్లెపడుచుదనాల ఎంకివావయసు గుండెకోతవా...ఎవరు నీవు... ?
వసంతానికి లంగాఓణి వేసినట్టు
వెన్నెలంతా ఓ చోట పోతపోసినట్టు...
చిగురు లేతదనమంతా రంగరించినట్టు...
పాదారేళ్ల ప్రాయం చినబోయేట్టు..
అందానికే అసూయ పుట్టేట్టు... ఎవరు నీవు...?
కలలో చిక్కిన చిన్నదానివా...
ఉలితో చెక్కిన శిల్పసౌందర్యానివా...
వాకిలిలో ఓరకంట దాగిన బిడియానివా...
అల్లరి కథలు చెప్పే మల్లెల పరిమళానివా...
రంగుల బందిఖానాలో చిక్కిన సోయగమా.. ఎవరు నీవు ?
ప్రణయ గీతాల పల్లవివో...
వలపు రాగాల సరిగమవో...
కవనకేళిలో పదాల పడికట్టువో...
ఎద నర్తనశాలలో నాట్య భంగిమవో..
మందహాస మంజరివో.. ఎవరివో నీవు ?
ప్రాణం లేని శూన్యం కూడా
జాబిలి కోసం ఆరాటపడింది...
తన కౌగిలిలోనే బంధించి వదలనంది...
ప్రాణమున్న మనసే ఇది...
ఈ జాబిలి కోసం... ఆరాటం వద్దన్నా వినదే...
కానీ... అందని వర్ణలిఖితఖండ కావ్యానివి... ఎవరో నీవు ?
( ప్రముఖ తమిళ చిత్రకారుడు ఇళయరాజా వేసిన ఓ పల్లెపడుచు కాన్వాస్ చిత్రమిది)