Powered By Blogger

21 జులై, 2012

ఆనాటి వానచినుకులు

వంశీది ఒక కథ ఆ మధ్య చదివాను. పేరు గుర్తులేదు గానీ..
ఆనాటి వానచినుకులు అనే కథాసంకలనంలోనిదది.
ఎందుకో ఉదయం వాన పడుతుంటే ఆ కథ అనుకోకుండా
గుర్తొచ్చింది. అందులో ఒక అబ్బాయి.. ఎప్పుడో తన చిన్ననాడే వదిలేసిన తాతగారి
ఊరు చూద్దామని వస్తాడు. అదో అందమైన పల్లెటూరు. అక్కడో బంధువుల
ఇంట్లో ఓ అమ్మాయి. ఆ అమ్మాయి... బంధువుల ఇళ్లకు, తెలిసిన వారి ఇళ్లకు
తీసుకెళ్లి అందరినీ అబ్బాయికి పరిచయం చేస్తుంది.
అలా ఒక్కో ఇంటికీ తీసుకెళ్లడం.. మధ్య మధ్యలో అమ్మాయి మనసులో
అబ్బాయిపై తొలకరి వలపు జల్లు కురియడం. చిలిపి చిలిపి మాటలు
కాలువ గట్లు, కొబ్బరి చెట్లు, మామిడి తోపులు, మధ్యమధ్యలో ఇళ్లు
అమ్మాయి నవ్వులు, అబ్బాయి మచ్చట్లు అన్నట్లు చాలా రసాత్మకంగా
సాగిపోతుంది కధ. చివరికి అమ్మాయి పూర్తిగా
అబ్బాయిని ఇష్టపడుతుంది. అబ్బాయిని బస్సు ఎక్కించడానికి
బస్ స్టాప్ కి తీసుకొస్తుంది. ఆక్కడ.. వీరి కుటుంబం గురించి మొత్తం
తెల్సిన జెట్కా బండి వాడు.. ఎవరీ అబ్బాయి అని.. ఆ అమ్మాయిని
వాకబు చేస్తాడు. ఫలానా వారి అబ్బాయి అని ఆ ఆమ్మాయి ముసి ముసి
నవ్వులు నవ్వతూ.. ఆ అబ్బాయి వంక క్రీగంట చూస్తు
చెప్తుంది. ఒక్క క్షణం ఆ జెట్కావాడు... కళ్లు మూసుకుని
ఆలోచించి... ఓ అమ్మాయి.. ఇతగాడా.. ఇతను నీకు
అన్నయ్యవుతాడు.. తెల్సా అని చెప్పి వెళ్లిపోతాడు
అప్పటి వరకు ఆమె మనసులో వరదగోదారిలా
ప్రవహిస్తున్న వలపు ఆనకట్ట తెగిపడిపోయి
కళ్ల నుంచి నీటి చుక్క రూపంలో పుడమిని
తాకుతుంది. ఇంతలో ఆ అబ్బాయి ఈమెతో
వెళ్లొస్తానని చెప్పి బస్సెక్కుతాడు. మౌనం నుంచి
తేరుకుని.. కంటిచెమ్మ ఆరేలోపే బస్సు వెళ్లిపోతుంది
వలపుల పరిమళాలతో చెదిరిన మనసుని
అంతలోనే వికసించి అంతకన్నా వేగంగా
వాడిపోయిన వలపు పూలను అక్కడే
వదిలేసి భారంగా ఇంటివైపు కదుల్తుంది ఆ చిన్నది
ఈ కథలో ఎంత రొమాంటిసిటీ ఉందో.. కథ చివరికి వచ్చే సరికి
మనసున్న వారినెవ్వరినైనా కదిలించే సున్నితమైన విషాదమూ
ఉంది. వంశీ కథల్లో ఎంతో నవ్యమైన.. తాజాదనంతో కూడి
పల్లెతుమ్మెరలు.. మనసుని ప్రశాంతంగా తాకుతాయి.. లేదా
అలజడులు సృష్టిస్తాయి.


16 జులై, 2012

మన్మధుని కొంప.. ఒక చెంప...


మన్మధుని కొంప ఒక చెంప కనిపింప చీరగట్టి నడియెన్ చిగురుబోడి...

శ్రీనాధుడికున్నంత రసజ్ఞత చాలా మంది మహారచయితల్లోనూ ఉంది
కానీ.. చదివినంతనే మనసుని వేడెక్కించే మధురానూభూతి మాత్రం
శ్రీనాధుడికే సొంతం (ఇది పూర్తిగా నా అభిప్రాయం).
అసలు విషయానికొస్తాను. నా గోలేంటంటే.. చీర స్పర్శ లేక... చిగురుబోడిల 
తనువు విరహిస్తోంది. చీర కూడా విలపిస్తోంది. పైన నేను రాసిన శ్రీనాధుని
కావ్యతునక అర్థాన్ని విడమరచి చెప్పడం భావ్యం కాదు. అది తెలుసుకుంటేనే
కిక్కు. చీరందం ఎంత చెప్పినా తక్కువే. చిరచిరలాడే ఆ చీర.. చీర కాదు. గగన జఘనాల పడచు 
నయాగారాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే ఒడిసి పట్టి
అన్నీ కలగలిపి ఓ చోట కుదిర్చే... శృంగార తెర. ఆ తెర తెరలుతెరలుగా
ఎగిరిపడుతుంటే అందం, కాస్త జారితే... పడుచుదనం,
కుదురుగా కుదిరితే.. అసలుసిసలైన స్త్రీత్వం.

ఏమని వర్ణించను... వదులుగా వదిలిన కురులసిరులు పిల్ల తుమ్మెర తాకి
వయ్యారి గోదారిలా అలలుగా దూకుతుంటే..ఆ కురులతో పమిత పోటీపడితే.
నులివెచ్చని శీతల సాయంత్రాన మల్లెపూల మత్తుల్లో... చిత్తుగా ఓడి..
చీర గట్టిన చెలిచెంత ఉండటం కన్నా గొప్ప అనుభవం... ఇంకేముంది.
ఏదీ ఆ చీరందం.. ఎక్కడుంది.. రసమయ హృదయాలను తట్టిలేపే
మకరంద వీచిక. జిలుగుపైట... అహో.. అదృశ్యమవుతున్నదే

రెండు మూరల మిడ్డీలు... ఒక మూర పైవస్త్రాలతో... అసలు మనసే కదలని
మధ్యమ సంసృతిలో చీర విరహాగ్నితో రగిలిపోతున్నదే. మన్మధుని కొంప
చేరలేక... ఒక చెంప విరహవిషాధకన్నీటి చుక్క రాల్చి... ఇనుపకారాగారం(బీరువా)లో బందీగా మిగిలిపోతున్నదే చిగురుబోడి...





15 జులై, 2012

గురజాడ అడుగు జాడల నీడల్లో నేను.. నా వెధవాయిత్వం


విజయనగరవాసిని కాబట్టి గురజాడంటే మక్కువ
ఆ మక్కువ తక్కువైనా  నా ఊరు అలిగి ఊరుకుంటుంది
అందుకే నా తొలిపలుకులు... మా గురజాడ ఇంటి నుంచి
మొదలుపెడదామని ఇలా... నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో
మా లెక్కల ట్యూషన్ గురజాడ వారి ఇంటికి సరిగ్గా నిమిషం నడక.
మేం అరగంట ముందు నుంచే అక్కడ తచ్చాడేవారం.

ఆ మహానుభావుడి ఇంటి అరుగుపైనే కూర్చుని పిచ్చాపాటి మాటలు
ఆ అరుగు స్పర్శే నాలో సాహిత్యంపై ప్రేమ పెంచిందేమో.

గురజాడ ఇల్లు మీ ఇంటికి దగ్గారా.. అని  హైదరాబాద్ లో అందరూ వింతగా
అడిగేవారు. అప్పుడు చాలా గర్వంగా అనిపించేది. సాహిత్యనిధి,
అక్షరాగారం మా ఊరు గుర్తొచ్చేది.

అదో సాహిత్య సమరాంగణం. అక్షర ప్రాంగణం. అందుకే నా తొలి బ్లాగులో
మా సాహిత్యపు పెద్ద దిక్కు... గురజాడ వారి అడుగు జాడల నీడలతో మొదలు
పెడుతున్నా. ధన్యవాదాలు.


క్షంతవ్యుడను


క్షమించాలి... చాలా రోజులైనందుకు.
కొన్ని అనివార్య కారణాల వల్ల కలవలేకపోయాను
ఇక నుంచి రెగ్యులర్ గా బ్లాగుతాను