Powered By Blogger

20 నవంబర్, 2013

ఆ మనసు లోతెంత...

వెన్నెల్లో ఆడపిల్ల మనసు
సముద్రం కన్నా లోతు
జాబిల కన్నా ఎత్తు...
నా పిచ్చి గాని... వెన్నెల్లో కదా ఆమె ఉండేది....

కనులకు కనిపించే వెన్నెల
వెన్నముద్దలా అందుతుందా
వాకిలి దాటితే పలకరించే జాబిలమ్మ
కొండెక్కి రమ్మంటే వస్తుందా...
మగువ మనసూ అంతేనా...  అందనిదా...

కెరటం తీరాన్ని తాకుతుంది...
అల చిలిపిగా పాదాన్ని ముద్దాడుతుంది
అంతమాత్రాన అల నాదైపోతుందా
నాతో వస్తావా అంటే వస్తుందా
నువ్వే రా.. అంటూ తనలో కలిపేసుకుంటుంది

కానీ... ఏంటో నా పిచ్చి మనసు
ఆమె మనసు తెలుసుకోవాలంటోంది..
మగువ మనసులో ఊసులను అన్వేషిస్తోంది
ఊహల్లో అగాధం తవ్వుతోంది...
ఏమైనా దొరికిందా.. ఆ దొరికింది.. మరికొంత లోతు

ఒక్కోసారి ఆమె కళ్లు మాటాడుతుంటాయి
మరోసారి కనురెప్పలే ఏవో చెప్తుంటాయి
కాలిబొటనవేలు కూడా శృంగారనైషధం రాయగలదు
క్రీగంట చూపు లక్ష చిక్కుముడులు వేయగలదు...
అర్ధాలు వెతకాలని పరుగులు తీశా...
దొరికింది.. ఎప్పటికీ బదులు లేని ఓ చిక్కు ప్రశ్న

విశ్వాంతరాళ అంచుల అంతు తేల్చొచ్చు
ఆ నిశీధిని నిలువునా చీల్చొచ్చు..
ఆమె మనసు పిడికిలి గుట్టు విప్పగలమా
అతి కష్టం మీద విప్పి చూశాను... ఏముంది
అక్కడ మరో అగాధం...
చేతనైతే లోతు కొలవమంటూ వెక్కిరించింది...

తన ప్రేమనంతా నిజంగా పంచాలని వస్తే
తట్టుకునే శక్తి ఈ సృష్టిలో దేనికీ లేదు...
మరి రోజూ కనిపించే ప్రేమేమిటీ... నిజం కాదా
ఏమో... ప్రేమిస్తున్నట్టే ఉంటుంది.. లేనట్టూ ఉంటుంది
ఆ రహస్యం అడిగితే నవ్వేసి వెళ్లిపోతుంది

నవ్వుతూనే విషాదాన్ని భరిస్తుంది
నవ్విస్తూనే దుఃఖాన్ని దిగమింగుతుంది
ఆనందాన్ని మాత్రం మౌనంగా అనుభవిస్తుంది
బాధ లేదూ... అంటే... మరో నవ్వునవ్వి
కన్నీటి చుక్కనొకటి చెక్కిలిపై జార్చింది
పట్టుకునే లోపే... అదీ అగాధంలోకి జారిపోయింది
నా మనసు పట్టుకోలేవని మళ్లీ వెక్కిరించింది.

కలకరిగిపోతే కన్నీరవుతుందా...
మనసుకి ముళ్లగాట్లు చేస్తే కన్నీరు జారుతుందా
లేదా ఆనందం ఎక్కువై పెల్లుబుకిన ఆనవాలా...
ఆ కన్నీటి చుక్కనైనా అడుగుదామంటే.. చేజారిందే
ఆ చుక్క... ఆమెలో ఇన్నాళ్లూ నలిగిపోయిందేమో
నవ్వేేసి... ఆ వివరం అడగొద్దని స్వేచ్ఛగా ఎగిరిపోయింది

నా ఊహకు రెక్కలొస్తే ఆమె మనసు
లోతుల్లో విహారిస్తాను...
ఆలోచన పొరల్లో ఒక్క అణువునైనా పట్టుకుంటాను
నా కళ్లలో ఆమె రూపాన్ని బంధించగలిగాను
కానీ... ఆమే గెలిచింది..
తన మనసు నీడను కూడా తాకలేకపోయాను































19 నవంబర్, 2013

పచ్చిక బయళ్లలో ముత్యాల జల్లు.. కోకిల వేణుగానం

స్వాతిచినుకుకి నమ్మకం
సంద్రం మనసు గెలవగలనని
అందుకే అంత సంద్రాన్నీ ఈదింది
ముత్యపు చిప్పులో ఒదిగి ముత్యమైంది

గడ్డిపరకకు తెలుసు తన బలమెంతో
అంత పెద్ద భూమాత మనసేంటో
అందుకే భూమినే చీల్చుకుని వచ్చింది
భూమాతకు పచ్చదనాల పసిడి చీరకప్పింది

కోకిలకు తెలుసు తన పాటేంటో
నలుపైతేనేం నల్లనయ్య కాదా అనుకుంది
మావిచిగురుతో స్నేహం చేసింది
కూకూ అంటూ సరిగమలకే పాఠాలు నేర్పింది

ఒదగి ఉండలేనే అనుకోలేదు వెదురు
వాయువునే అలింగనం చేసుకుంది
పదహారు వేలమందికి సాధ్యం కానిది... 
వేణువై మాధవుడినే వశం చేసుకుంది