Powered By Blogger

17 ఏప్రిల్, 2013

రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ్ పురస్కారం

అక్షరాలను ఇలా కూడా కూర్చొచ్చుకే.. రావూరి కవితలు కొన్ని.. కవితలను ఇలా కూడా రాయొచ్చు.
నిశీధిలో కూడా వెలుతురు తురుముని కవి గాంచగలడని నిరూపించి
ఎందరికో ఆదర్శప్రాయుడైన గురుసమానులు రావూరి భరద్వాజ.
ఆయన గురించి నేనేవో కవితలు రాసి వర్ణించే కన్నా.. ఆయన రాసిన
అద్భుతాలనే నెమరు వేసుకుంటే మంచిది కదా.. అందుకే ఆయన అక్షరాలతోనే అభినందనలు చెప్పే సాహసం చేస్తున్నాను

ఏదీ నాది కాదు - రావూరి భరద్వాజ

"నీకు సంతృప్తి కావాలా? అసంతృప్తి కావాలా?" అన్నారు ప్రభువు ఉదయపు నడకలో.
"అసంతృప్తి" అన్నాను.
ప్రభువు ఆశ్చర్యంగా చూశాడు నావేపు.
"ఉన్న చోటనే ఉండి పొమ్మంటుంది సంతృప్తి. మునుముదుకు నడిపిస్తుంది అసంతృప్తి" అన్నాను.
ప్రభువు నా వీపు తట్టాడు!
ఎందుకో తెలీదు.
******************************

"నన్ను మండించాలని నీవూ, నిన్ను మసి చేయాలని నేనూ, సహస్ర సహస్రాబ్దాలుగా తంటాలు పడుతున్నాం.
నేను మండిపోనూ లేదు;నీవు మసి కుప్పగానూ మారిపోలేదు.
హోరాహోరీ పోరాటం అనంత కాలాల దాకా, అవిచ్చిన్నంగా
సాగుతూనే ఉంటుంది" అన్నది ఆ అంధకారం, దూరం నించి వస్తోన్న వెలుతురు వేపు చూస్తూ.

******************************

"వూవు నయిపోదామన్న ఉత్సాహంతో తీగ మీద వాలాను.
నేనంటే గిట్టని చివురాకు నన్ను కిందకి తోసేసింది" అన్నదా వాన చినుకు.
దెబ్బ తగిలిందా చిన్నా!" అంటూ ఆ చినుకును మెత్తగా హత్తుకున్నదో మట్టిబెడ్డ.

******************************

"తెల్లగా, చల్లగా, మెల్లగా పోతూపోతూన్నవారు కాస్తా;హఠాత్తుగా
ఆగిపోయారెందుకు? కళ్ళు చికిలించి కిందికి చూస్తున్నారెందుకు?" అన్నదో గోరింక.
"పల్లెకు దూరంగా ఉన్న, ఆ పూరింటి ముందు, ఓ అమ్మాయిగారు, అద్దం
పుచ్చుకొని నుంచున్నారు. అందులో ప్రతిఫలిస్తున్నది నా ముఖమో, అమ్మాయిగారి
ముఖమో తేల్చుకోలేక ఆగిపోయాను" అన్నాడా పున్నమి చంద్రుడు!

*****************************