ఓ అలసిన మనసు
సేద తీర్చేందుకు..
వెన్నెల పరుపు వేశా...
బరువెక్కిన హృదయమో...
అలోచనల బందీనో...
చెంపజారిన కంటతడో....
ఆనంద నందనవనమో...
ఏమో... తెలీదు... ఎవరో
అయినా... వేశాను వెన్నెల పరువు...
అలసిన మనసని అనిపించి...
బహుదూరపు బాటసారి అని...
కనులకు చిక్కని నిశీధి అని...
కలలకు అందని ఊహాఝరి అని...
మౌనాన్ని ప్రేమించే శూన్యమని...
అనుకుంటూ ఉంటాను... కానీ...
మనసు చెప్తుంటుంది... అస్పష్టంగా
అది.. అలిసిన మనసే అని...
మంచుతెరల్లో హిమబిందువులా...
నడిసముద్రంలో నిశ్శబ్దంలా...
జడివానలో ఓ వానచినుకులా...
హోరుగాలిలో ఓ మరీచికలా..
వెతికినా కనిపించదు... కానీ..
మనసు వెతుకుతూనే ఉంది
ఆ మనసు లోతు ఎంతని....
జవాబు లేని ప్రశ్న అని...
జాబు చేరలేని చిరునామా అని...
తీరం చేరని కెరటమని...
అంతూదరీ లేని దూరమని...
మది రొద పెడూతునే ఉంటుంది
కానీ... నా మొండి మనసు వినదు
అన్వేషిస్తూనే ఉంటుంది....
ఆలోచనల తెరలు దొంతరలైనా...
ఆ మనసుది అంతులేని కథే అయినా....
ఆ హిమజ్వాలాంతరాళ వెనుక ఉన్నది
హిమమో, జ్వాలో... వెతుకుతూనే ఉంటుంది... నా మది
ఈ భావాతీతఘర్షణలో... నే గెలిచినా ఓడినా...
అలిసిన మనసది... అందుకే
సేద తీరు అని... వెన్నెల పరుపు వేశా...