Powered By Blogger

25 జులై, 2012

రేయి ఆగిపోనీ... అలా సాగిపోనీ

వెన్నెల్లో పట్టిమంచం... మంచంపై
మెత్తటి దుప్పటి... తలకిందకు తలగడ..
పక్కనే ఫిలిప్స్ రేడియో... సమయం...
రాత్రి 9. అంతకు అరగంట ముందే... వేడివేడి
అన్నం.. అందులో అమ్మచేసిన ఆవకాయ
పెళ్లాం వడ్డింపు.. ఆ కాస్త లాగిస్తే... ముద్దపప్పు
అందులోకీ అవకాయ ఊట తగిలించి లాపింపు..
తర్వాత గుత్తివంకాయ కూర.. వేడి సాంబారు..
పెరుగు... చల్ల మిరపకాయ...
బయట వెన్నెల ఆపై మంచు కురుస్తోంది.
భోజనం రుచి ఇంకా నాలిక మీంచి పోలేదు.
ఏళ్ల తర్వాత సొంత పల్లెటూళ్లో వసారాలో
పట్టి మంచం.. పైన దుప్పటి... తలగడ..
ఫిలిప్స్ రేడియో.. అందులో గుండమ్మ కథ
పాట.. ఆ తర్వాత భలేరాముడులో పాట,
ఆపై తోడికోడళ్లలో కారులో షికారుకెళ్లే పాట.
కాసేపాగి వచ్చింది నా అర్ధాంగి... కాటన్
శారీలో... పల్లెపడుచులా... బ్యాక్ గ్రౌండ్
లో రేడియోలో చిట్టి చెల్లెల్లో ఈ రేయి తీయనిది
పాట.. ఆహా.. మరపురాని ఆ రేయి ఇంత సొగసుగా
సాగిపోయింది. ఆ మధ్య మేము సెలవు పెట్టి
మా పల్లెటూరికి వెళ్ళాం. అక్కడ తాతల కాలం
నాటి మా ఇంట్లో... పేడ కళ్లాపి జల్లిన వసారాలో...
స్వచ్ఛమైన గాలిలో.. వెన్నెల మోములో..
చిరునగవుల జాబిలి రాత్రిలో.. ఆ పూట
అలా ఆగిపోతే బాగుండనిపించింది..
మళ్లీ పట్నం వెళ్లి యంత్రంలా తిరిగే
రంగుల రాట్నంలో ఒకే చోట నుంచి
ఒకే చోటకు ప్రయాణించే జీవితం
నా జోలికి రాకుండా ఉంటే
ఎంత బాగుణ్ణు అనిపించింది...


22 జులై, 2012

అదీ లెక్కంటే...

కాలం.. ఇదో పెద్ద మిస్టరీ. ప్రపంచం మీనమేషాలు
లెక్కపెడుతున్ననాడే... భారతీయులు వాటిని నమిలి మింగేసి
పంచాంగాలు రాసేశారు. మనకు తెలిసింది సెకన్లు, మిల్లిసెకన్లు...
ఇంకా గట్టిగా మాటాడితే నానో సెకన్లు. ఆ అంకెల లంకెలు...
మిగిలిన ప్రపంచాల చరిత్రలు పురుడు పోసుకోకముందే..
వేసేశారు.. మన వాళ్లు. చీకటి గదిలో ఒక సూర్యకిరణం చొరబడిందనుకోండి. అందులో కొన్ని కోట్ల
సూక్ష్మ రేణువులు కనిపిస్తాయి. వాటిలోంచి ఒకేఒక రేణవుని తీసుకుని
తూస్తే... దాని బరువుని త్రస అంటారుట. ఆ త్రసలోనూ ముప్ఫై
పరమాణువులుంటాయని పరమాణువు అంటే ప్రపంచానికి
తెలియని రోజుల్లోనే లెక్కకట్టేసి చేతులు దులిపేసుకున్నారు..
మన ప్రాచీన మేధావులు.

అంతెందుకు మహాభారతాన్నే తీసుకోండి... ఒక రధం, ఒక ఏనుగు, మూడు
గుర్రాలు, ఐదుగురు సైనికులు మొత్తం పదిమంది బృందాన్ని పత్తి అని
అనేవారు. పత్తికి మూడు రెట్లుంటే సేనాముఖం, దానికి మూడురెట్లుంటే
గుల్మం. మూడు గుల్మాలు కలిస్తే ఒక గణం. మూడు గణాలు కలిసి వాహిని.
దానికి మూడింతలు పృతన. దాన్ని మూడుతో గుణిస్తే ఒక చమూ. ముడు
చమూలు ఒక అనీకినీ. దానికి పదిరెట్లు అక్షౌహిణి. కురుక్షేత్రంలో మొత్తం
18 అక్షౌహిణులు. పై లెక్క ప్రకారం ఎంతో లెక్కగట్టండి.
ఇక సంఖ్యామానంలో మనవాళ్లకు తిరుగే లేదు. వెయ్యి కోట్లు దాటాక
ఆ సంఖ్యకు ఒక్కో సున్నా చేర్చుకుంటూ పోతే అర్బుదం, ఖర్వం, పద్మం,
క్షోణి, శంఖం, క్షితి, క్షోభం, నిధి, పరతం, పరార్ధం, అనంతం, సాగరం,
అమృతం, అచింత్యం, మహాభూరి వరకు లెక్కేసేశారు. మహాభూరి అంటే
ఒకటి పక్కన 25 సున్నాలు. ఓ ఆంగ్లం లో చెప్తే గానీ  అర్ధం కాదు కదూ
టెన్ టు ది పవరాఫ్ ట్వంటీ ఫైవ్. ఆ అంకెకు ఆంగ్లంలో ఇప్పటికీ ప్రత్యేకమైన
నామకరణం లేదు.
జీవి పుట్టిన నిమేషం నుంచి ఆయువు ప్రారంభమవుతుందని
శివపురాణం చెప్తోంది. నిమేషం అంటే ఒక్క క్షణం. శివపురాణం
లెక్కలో 15 నిమేషాలు ఒక కాష్ఠ. ముప్ఫై కాష్ఠలు ఒక కళ.
ముప్ఫై కళలు ఒక ముహూర్తం. ముప్ఫై ముహూర్తాలు ఒక ఆహోరాత్రం.
అదే నేడు వ్యవహరిస్తున్న రోజు. ఇవి కాక.. లిప్త, తృటి లాంటి సూక్ష్మ కొలతలెన్నో... ఇప్పుడు
అగ్రరాజ్యాలని మిడిసిపడుతున్న కొన్ని దేశాలు పుట్టక ముందే
విస్తృతంగా భారతదేశంలో వాడకలో ఉన్నాయి. లిప్త అంటే
కనురెప్పపాటు.
తృటి లెక్క బహువిచిత్రం. తామర రేకుల కట్టను.. ఓ పదునైన సూదితో
పొడిస్తే.. ఒక రేకు నుంచి మరో రేకుకి పట్టే సూదిమొన ప్రయాణ
కాలాన్ని లవం అంటారు. అలాంటి లవాలు ముప్పై కలిస్తే.. అది
తృటి. తృటిలో తప్పిన ప్రమాదమంటామే.. ఆ తృటి. ఇప్పటికీ
వాడుకలో ఉంది. ఇంత గొప్ప కాలమానం ఉంటే. మనకు ఆంగ్లజాడ్యం.





ఆకు ముళ్ల మీద పడితే...

అసలు అమ్మాయిలకు బుద్ధి ఉంటోందా..
చదువేస్తే ఉన్న మతి పోయిందట.. విజయనగరం జిల్లాలో
ఓ కాలేజీలో... తమకన్నా అందంగా ఉందని ఓ జూనియర్
గొంతు నులిమేశారు.. సిగ్గు లేని సీనియర్ ఆడబోడెమ్మలు... ర్యాగింగ్ ఆట ఆడుకున్నారు.
ఇప్పుడా అమ్మాయి జీవితం నాశనమైతే హింసించిన పిశాచాలు
రాక్షసానందం పొందుతాయన్నమాట. ఆడదానికే ఆడదాని బాధ
తెలుస్తుందని, ఆడదాని మనసు వెన్న కన్నా సున్నితమన్న
వెధవ ఫిలాసఫీలకు కాలం చెల్లిపోయింది. ఆ బాధ
తెలిస్తే... మరో కన్నతల్లి కంటతడి పెట్టే పనెందుకు చేస్తారు.
కాలేజికి చదువుకోడానికేనా వెళ్లేది.. శుభ్రంగా చదవుకునేవారు
చదువుకుంటూనే ఉన్నారు. మంచి భవిష్యత్తుని సొంతం చేసుకుంటున్నారు
ఈ తేడా ఆడోళ్లే... భ్రష్టు పట్టిస్తున్నారు. ఆడ అనే పదార్ధం అంటేనే అసహ్యం
కలిగేలా చేస్తున్నారు.ఇదేమీ కొత్త సంఘటనేం కాదు. ఆడాళ్ల మధ్య ఉండే ఇగోలు
కొలవడానికి అసలు పరికరాలే లేవు. ఎదుటి ఆడది అందంగా
ఉంటే తట్టుకోలేరు. ఆమెకు మంచి బాయ్ ఫ్రెండ్ ఉంటే జలసీ..
అంతెదుకు పక్కమ్మాయి తని పని తాను చూసుకుంటూ... శుభ్రంగా
చదువుకుంటే చూడలేరు. అంతంత ఇగోలు ఉన్న అమ్మాయిలకు 
కాలేజీలకెందుకు. వంటిళ్లే ఎక్కువ. మగాళ్లపైన ఎలాగు సదాభిప్రాయం లేదు.
అమ్మాయిలు కనిపిస్తే రిమ్మతెగులే. వారిని పూర్తిగా పక్కనపెట్టేద్దాం. మరి అమ్మాయిలు
కూడా అలాంటి అబ్బాయిల్లాగే ప్రవర్తిస్తుంటే... తేడా ఏముంది. అసలు తప్పు ఆ అమ్మయిలది కాదు..  ఆ అమ్మాయిలు వ్యక్తిత్వాలు, వారిలో ఉన్న పైశాచిక గుణాలను గుర్తించలేని తల్లిదండ్రులది. ఇంటి
వాతావరణం బట్టే పిల్లల ప్రవర్తనా ఉంటుంది. ఇది ప్రాథమిక మానసిక
తత్వ సిద్ధాంతం. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చి..
కనిస పర్యవేక్షణ కూడా లేకుండి అచ్చోసి వదిలేస్తున్నారన్నది పచ్చి నిజం.
ముళ్లు వెళ్లి ఆకు మీద పడినా.. ఆకు వెళ్లి ముళ్ల మీద పడినా.. చిరిగేది ఆకే
అని చిరిగిపోయాక.. గానీ.. గ్రహించడం లేదు తల్లిదండ్రులు.
ఏం లాభం. అప్పుడు తెలుసుకుని అబ్బాయిలతో పోటాపోటీగా
అమ్మాయిలు రెచ్చిపోడానికి ఇంత కన్నా కారణం లేదు.
అందంగా ఉన్నావంటూ ఓ అమ్మాయి గొంతు నులపడం.. ఆడ లక్షణమే అని
ఏ ఒక్కరు చెప్పినా.. ఇంత వరకు అన్న మాటలన్నీ
వెనక్కు తీసుకుంటాను. ఆడ పిల్లలంటే అత్యంత
గౌరవాభిమానాలు ఇచ్చిపుచ్చుకునే..  సంప్రదాయ
కుటుంబంలో పెరిగాను. అందుకే ఈ ఆవేదన. ఇదే పని ఏ
మగాడైనా చేస్తే మృగాడు అని హెడ్ లైన్ పెట్టి
రోజంగా న్యూస్. మరి ఇప్పుడు ఈ ఆడోళ్లకేం పేరు పెట్టాలి.
అమ్మయిపై అబ్బాయిలు దాడిచేస్తే.. అప్పటికప్పుడు మహిళా
సంఘాలు పుట్టుకొచ్చేస్తాయి ఇప్పుడు కనపడవేం మహిళా
సంఘాలు. అంటే ఆడదానిపై దాడి చేస్తేనే వస్తారా.
 ఆడది దాడి చేస్తే.. అదీ మరో ఆడదానిపై దాడిచేస్తే..
వ్యతిరేకించరా.. ఇదేం బోడి న్యాయం. మొత్తానికి ఇక ఆడా, మగా అని తేడా
లేదు. ఇద్దరూ ఒకటే. ఇద్దరి పైశాచికత్వాలు ఒకేలా తగలడ్డాయి. ఎవరినీ
అనుకోడానికి లేదు. యువత మానసిక స్థితిలో వస్తున్న పైశాచిక
మార్పులు చూస్తూ అంతా మన ఖర్మ అనుకోడం తప్ప.
నా ఉద్దేశంలో భవిష్యత్తులో ప్రతీ కళాశాలకు ఓ సైక్రియాటిస్టూ,
ఓ పిచ్చాసుపత్రి, ఓ ప్రధమ
చికిత్సాలయం అవసరమేమో.