Powered By Blogger

15 మార్చి, 2014

మౌనవీణ





మాటలు మీటే ఆ మానస వీణ
మూగబోయింది ఎందుకో....
చిలకపలుకుల ఆ జాణ
నిశ్శబ్దాన్ని చేరదీసింది ఎందుకో....

మేఘమాల వర్షించాలనుకుంది
చిరుజల్లుగా చేరాలనుకుంది
ఆమె తుళ్లింత చూడాలనుకుంది
ఆ లావణ్యంతో జతకడదామనుకుంది
కానీ... ఆ మేఘామాలను మౌనం కమ్మేసింది


కాలి మువ్వలు అలికిడి మానేశాయి

ఆమె మాటకు, కాలి మువ్వకు రోజూ పోటీ
ఘల్లుఘల్లుమని ఆ మువ్వ
తుళ్లిపడే నవ్వుతో ఈ సిరిమువ్వ
కానీ... ఆ మువ్వల సవ్వడిని మౌనం మింగేసింది

రోజూ పిల్లతెమ్మెర ఎదురు చూసేది
ఆమెను ఆలింగనంలో ముంచేది
ఆమె మాటనే పాటగా మార్చేది...
ఈసారి మాట లేదు.. తెమ్మెర పాటా లేదు
ఆ మౌనం చూసి చిరుగాలులు భాష్పాలయ్యాయి...

ఆమె మాటలాడితే రోజూ ఆటలే...
ఆ అధారాల లతల జతలకు...
ఆమె నవ్వితే ఇక కేరింతలే
ఆ పెదవులకు పండగే....
ఇప్పడంతా మౌనమే.... ఆధరవిలాపమే...

ఆ మౌనంలోనూ ఎన్నో మాటలు మదిని అడిగితే చెప్తున్నాయి
మనసు అలిసిందో...
మాట సొలసిందో... ఏమో
కానీ... మౌనంలోనూ ఆమె మాట వినిపిస్తోంది....
ఆమె మౌనమూ ముచ్చట్లు  చెబుతోంది...