Powered By Blogger

15 మార్చి, 2014

మౌనవీణ





మాటలు మీటే ఆ మానస వీణ
మూగబోయింది ఎందుకో....
చిలకపలుకుల ఆ జాణ
నిశ్శబ్దాన్ని చేరదీసింది ఎందుకో....

మేఘమాల వర్షించాలనుకుంది
చిరుజల్లుగా చేరాలనుకుంది
ఆమె తుళ్లింత చూడాలనుకుంది
ఆ లావణ్యంతో జతకడదామనుకుంది
కానీ... ఆ మేఘామాలను మౌనం కమ్మేసింది


కాలి మువ్వలు అలికిడి మానేశాయి

ఆమె మాటకు, కాలి మువ్వకు రోజూ పోటీ
ఘల్లుఘల్లుమని ఆ మువ్వ
తుళ్లిపడే నవ్వుతో ఈ సిరిమువ్వ
కానీ... ఆ మువ్వల సవ్వడిని మౌనం మింగేసింది

రోజూ పిల్లతెమ్మెర ఎదురు చూసేది
ఆమెను ఆలింగనంలో ముంచేది
ఆమె మాటనే పాటగా మార్చేది...
ఈసారి మాట లేదు.. తెమ్మెర పాటా లేదు
ఆ మౌనం చూసి చిరుగాలులు భాష్పాలయ్యాయి...

ఆమె మాటలాడితే రోజూ ఆటలే...
ఆ అధారాల లతల జతలకు...
ఆమె నవ్వితే ఇక కేరింతలే
ఆ పెదవులకు పండగే....
ఇప్పడంతా మౌనమే.... ఆధరవిలాపమే...

ఆ మౌనంలోనూ ఎన్నో మాటలు మదిని అడిగితే చెప్తున్నాయి
మనసు అలిసిందో...
మాట సొలసిందో... ఏమో
కానీ... మౌనంలోనూ ఆమె మాట వినిపిస్తోంది....
ఆమె మౌనమూ ముచ్చట్లు  చెబుతోంది... 








10 కామెంట్‌లు:

  1. మొత్తానికి ఆమె మౌనమూ ముచ్చట్లు చెబుతోంది బాగుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మౌనమే ఎక్కువ భాష్యాలు చెప్తుంది శ్రీదేవి గారు. ఒక్కో సారి మౌనం ఎన్ని సంగతులు చెప్తుందో. నా మనసులో ఉన్న ఒక చిన్న భావన, ఆలోచన ఇది. మౌనం ముచ్చట్లు ఎంత బాగుంటాయో... ధన్యవాదాలు... స్పందనకు..

      తొలగించండి
  2. అందమైన ఆ మౌనం వెనుక అలుపెరుగని మూగ బాష,
    అలిగిన మనస్సులో ఎన్ని అంతరంగ అలజడులో,
    మంచు భావుకత, చాలా బాగుంది సతీష్ గారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మెరాజ్ గారు.. ఇక్కడ అలకేం లేదు సుమండి. ఒక్క మౌనమే. ఇది కూడా పూర్తి ఊహాత్మకం భావాత్మకం. ఒక మౌనం నాలో రేపిన అలజడి ఇది. నిశితంగా పరిశీలించి చక్కగా స్పందించినందుకు మీకు ధన్యవాదాలు.

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. కార్తీక్... మీ స్పందనకు ధన్యవాదాలు. మౌన వీణ అని నేను పెట్టిన టైటిల్ కన్నా మీరు పెట్టిన మౌనగీతం అనే పేరు బాగుందండి.

      తొలగించండి
  4. సతీష్ గారూ .. మీ ఆవిడ అలక ని ఇలా కవిత గా రాశారా ఏంటి ? ఒకవేళ అదే నిజమైతే ఆమె పై మీ ప్రేమ అద్భుతం . నా ఊహ నిజం కాకపొయుంటే మీ కవిత ,రచనా శైలి మహాద్భుతం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా భార్యభర్తల మధ్య అలకలుండవండోయ్. ఫటాఫట్ ధనాధన్. ఈ భావంలో నాయిక వేరు లెండి. ఒక మౌనంలో ఎందుకో నాకు ముచ్చట్లు వినిపించాయి. ఆ ముచ్చట్లే ఇవి. ఇంకోటి.. గలగల మాటాడేవాళ్లు ఒక్క రోజు మౌనంగా ఉన్నా ఎందుకో ఏదో వెలితి కదా... అందులోంచి పుట్టిన మౌనవీణే ఇది....

      తొలగించండి
  5. మౌనంలో మాటలు వినిపించాయని, మౌనమూ ముచ్చట్లు చెప్పిందని , ఆ మౌనంలోనూ ఎన్నో మాటలు మదిని అడిగితే చెబుతాయని చెప్పకనే చెప్పిన మీ మౌన వీణ మహత్తు చాలా బాగుంది సార్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ స్పందనకు ప్రతిస్పందన చేసేముందు మీ బ్లాగు చూశాను. చాలా బాగుందండి. అలా ఒక అంశంపై విశ్లేషణలు చాలా ఇష్టం నాకు. చాలా బాగా రాశారండి. మీ స్పందనకు ధన్యవాదాలు.

      తొలగించండి