అవును నేను ప్రియమైన శత్రువుని
నిహారికల్లో నిగూఢంగా దాగిన
మంచుతునకల్లా తాకిన
భావవల్లరుల ప్రేమికుడిని
ఆ తలపులు దోచే ప్రియమైన శత్రువుని
రంగుల ఊహల్లో తడిసి
వర్ణరేఖాచిత్రాల్లో ఒదిగి
హరివిల్లుని జల్లుగా కురిపించిన
కుంచెతో స్నేహించే ప్రియమైన శత్రువుని
కనుల నుంచి జారిన
కన్నిటిని మొత్తం దోచి
కలల వలలు విసిరి
కనికట్టు చేసే ప్రియమైన శత్రువుని
మౌనమేఘాలను కరిగించి
అధరాల మధ్య గొడవ పెట్టి
మాటల మంత్రాలు జల్లి
మాయ చేసే ప్రియమైన శత్రువుని
శశిరేఖల్లో చీకటిని పరిహసించి
శిశిరాన్ని వసంతంతో కప్పేసి
ఆ ఆనందం అందరికీ పంచేయాలన్న
అత్యాశ ఈ ప్రియమైన శత్రువుకి
జాబిలినీ తీయగా మోసం చేసి..
వెన్నెల పువ్వులు దొంగిలించి
అందమైన నవ్వులకు బహుమతి
ఇవ్వాలన్న కోరిక ఈ ప్రియమైన శత్రువుది