ఈ
లోకంలోకి వస్తానని నువ్వనలేదు....
ఈ
లోకం నుంచి వెళ్తాననీ
నువ్వనలేదు.....
మనిషిని
మనిషే పీక్కు తినే లోకంలో....
మతోన్మాదం
మత్తెక్కిన కాలంలో
నువ్వొక
రక్తాశ్రువు.......
ఉగ్రవాద
ఉన్మాద హననంలో.....
మానవత్వం
నశించిన మారణ హోమంలో.....
తుపాకీ
చప్పుళ్ల మధ్య అనాగరిక
నిశ్శబ్దంలో.....
తూట్లు
పడిన పుడమి కన్నీటి సంద్రంలో....
నవ్వొక
రక్తాశ్రువు.......
నీ
మతమేదో నీకే తెలియని వయసు.....
ఉగ్రవాదమన్న
మాటే వినలేదు............
అమ్మ
పరుగులు తీస్తే ఎందుకో అర్థం
కాలేదు......
ఆడుకోడానికే
అనుకున్నావో ఏమో....
బలైపోయావు.......
నువ్వొక
రక్తాశ్రువు.......
నిర్మల
సాగరంలో వటపత్రశాయిలా.....
ఇసుక
తిన్నెల్లో హాయిగా
నిదురిస్తున్నావనుకున్నాను......
తిరిగిరాని
లోకాలకు వెళ్లావా చిన్నారి
నేస్తమా.......
ఉగ్రోన్మాద
వికృత చేష్టకు సమిధవయ్యావా......
అవును....
నువ్వొక
రక్తాశ్రువు
ఇప్పుడెక్కడున్నావు..........?
దేవుడే
ఉంటే ఆ దేవుడి ఒడిలోకి చేరావా?
మానవత్వం
కోసం లోకాలు వెతుకుతున్నావా
?
గుండెపగిలిన
అమ్మ కన్నీటిగా మారావా ?
ఎక్కడున్నా....
మా గుండెల్లో ఎప్పటికీ
నువ్వొక రక్తాశ్రువు....