Powered By Blogger

11 జనవరి, 2014

అనగనగా... ఓ ప్రేమ కథ




కనుల కాటుక రేఖలతో
ఓ ప్రేమ లేఖ రాసిందామె...
అక్షరాలతో కాదు చూపులతోనే...లక్షణాలతోనే చెప్పేసింది ప్రేమని...
మంచు తెరల్లో మునిగిన ఓ సాయంత్రం వేళ....

తనను చూసేందుకు ఒకటే ఉవ్విళ్లు
ఆ వీధిలోకి వెళ్తే ముగ్గు పెడుతూ తను...
దూరంగా కొంటెగా చూస్తూ నేను
చుక్కల ముగ్గుతో చక్కని చుక్క...
రంగవల్లిక అల్లుతుంటే...
ఏమని వర్ణించను ఆ భంగిమను...

ముగ్గుల రంగుల కన్నా..
ఈ చుక్క సిగ్గులే అందం...
నా చూపులు ఆ సిగ్గులు వెతుకుతుంటే..
ఆ చెక్కిళ్లలో ఎర్రదనం.. వర్ణించతరమా
దగ్గరకెళ్లమని మనసు గోలగోల...
వద్దంటూ.. కళ్లతోనే ఆమె చిలిపి సైగ...
ఆ సైగల సిగ్గుల్లో కనిపించింది...అసలు సిసలు వలపు జాడ....

వాల్జడలో మల్లెల గుసగుసలు
అతనిని రానియ్యవే అంటున్నాయి...
కానీ.. ఎవరైనా చూస్తే... అని ఆ అందాల రాక్షసి
కసిరి మల్లెల నొోరునొక్కేసింది
ఆ పెదవుల్లో మాటరాని మౌనాలు...
వలపు సంగతులు దాచుకున్నాయి...
కాలి పట్టీల మువ్వల సవ్వడిలో
ప్రేమ సంగతుల సరిగమలే వినిపించాయి...

లోలాకులు కూడా నా గురించే
తన చెవిలో ఏవో చెప్తున్నాయి....
ఆ చిలిపి కబురుల చక్కిలిగింతలకు
తన అధరాలలో చిరు  మందహాసం
ఆహా ఆ దృశ్యం ప్రకృతి కన్నా అందం

వర్ణాల రంగవల్లిక పూర్తయింది
నుదుటిపై చిరుచెమటలను 
రంగుల చేతులతో తుడుచుకుంది
కుంకుమ రేఖల పక్కనే హరివిల్లులా
ఆమె మోము ఒక రంగవల్లికైంది..
అది చూచి నేను నవ్వాను..
కళ్లు ఎగరేసి అడిగింది.. ఆ నవ్వు ఎందుకని

నేను రంగుల ముగ్గుని చూపించాను
అది నువ్వే అని కళ్లతోనే బదులిచ్చాను...
పరవశించిన ఆ హృదయం
నాకు చిరునవ్వుల బహుమతినిచ్చింది
నా మనసంతా సంక్రాంతి పండగైంది...

చిరుగాలులకు ఆమె పైటంచూ...
అలలా ఎగురుతుంటే... ఇంటిలోకి పరిగెడుతూ
ఆమె... ఒక్కసారి ఆగింది... 
ఒక్క అడుగు వెనక్కు వేసి...
చాటుగా నన్ను చూసింది..
కనులతోనే నవ్వి... వలపు సందేశం పంపింది.

(మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు)
 
 

 
 
 
 

 
 

10 జనవరి, 2014

మౌనం వేసిన ప్రశ్నలు...

ఆశ నిరాశకి ఎంతదూరం
ఒక్క అక్షరమే అని తర్కం చెప్తుంది
ఒక్కోసారి తర్కాన్ని చూస్తే జాలేస్తుంది
అక్షరమే తేడా ఉంటే నిరాశ నీడగా
ఆశే ఉండొచ్చుగా... ఆశావాదంగా

ఆనందానికి విషాదానికి తేడా ఏంటి
ఆనందానికి అగాధం తవ్వితే
విషాద శిధిలాలు గాయం చేస్తాయి
అసలు గోతులే తవ్వుకోకుండా ఉంటే
విషాదానికే విషాదం మిగిల్చేది ఆనందం.

ప్రేమకి, భగ్నప్రేమకి అంతరమేంటి
మనసుకి మనసుకి ముడి ప్రేమ
ఆ ముడి తెగితే భగ్నప్రేమ
భగ్నప్రేమ... ప్రేమ తప్పు కాదు...
భావాలు కలవని మనసుల తప్పు

మాట-మౌనం ఏది మంచిది
మౌనంలో శూన్యం తప్ప ఏముంది
మాటల్లో అపార్ధాలు తప్ప ఇంకేమున్నాయి
మౌనం ఒక రాజీ, మాటల్లో నటన మరో రాజీ
మౌనం మాటగా మారితే సమాజం వెలివేస్తుంది

బంధాల్లో వాస్తవమెంత
బంధనాల్లాంటి బంధాల్లో స్వచ్ఛతేదీ
హిపోక్రసీ ముసుగుల్లో మోసం తప్ప నిజమేది
కష్టం సుడిగుండాలై తాకినపుడు
గుండెబరువు దించే స్వచ్ఛమైన బంధం కన్నీరే...

ఈ మధ్య మరీ ప్రశ్నలెక్కువైపోతున్నాయి
కానీ.. అసలు ప్రశ్నించొద్దు అంటున్నారు
ఇంకొందరు నవ్వుకుంటున్నారు..
ఇవి నా ప్రశ్నలు కానే కావు
ఎన్నో మౌనాలు నన్నడిగిన ప్రశ్నలు