Powered By Blogger

1 మార్చి, 2014

ఓ... అంతులేని అన్వేషణ





ఓ మగువ.... నీ మనసు లోతుని
అన్వేషిస్తున్న బాటసారిని....

నా ప్రయాణంలో ఎన్ని ఓటములో
అన్నే గెలుపులు, మలుపులు

తరుణి మనసు ఓ అంతులేని కథ
ఎన్నిసార్లు ఓడినా అదో తీయని వ్యధ
 
పొగమంచు మేలి ముసుగులో
ఓ మనసా పలకరిస్తావు...

దరిచేరి మసుగు తీసే లోపే కరిగి
నేనొక మాయనని వెక్కిరిస్తావు...

సముద్రాన్ని దాచుకున్నావు...
ఒక్క అలనైనా తాకనీయవు...

ఆకాశంలో సగం నేనేనంటావు
శూన్యం తప్ప ఇంకేదీ కనపడనీయవు

అగాధం అంచున ఉంటానంటావు....
ఆ అగాధానికి అంతేలేదని నువ్వే చెప్తావు....

చిక్కుముడుల చిత్రాన్ని నేనంటావు...
విప్పిన కొద్దీ కొత్త ముడిని చిత్రిస్తూనే ఉంటావు...
 
మనసు పొరలు మరుల తరువంటావు
ఆ పొరల చెరలో కన్నీటి చుక్కనీ నేనే అంటావు

కలల వలలో చిక్కుతావని అంటే...
కనులు మూసుకున్నాను....

ఆ కలల వల నాపైనే విసిరి...
కలత నిదురవై వెళ్లిపోయావు...

ఎట్టకేలకు....
మససు వాకిట నిలబడి తలుపు తడితే...
లక్షప్రశ్నల నిలువెత్తు శిల్పమై మాయమయ్యావు...

అంతులేని కథని అన్వేషిస్తూ....
అంతం తెలియని దూరం ప్రయాణిస్తూ...
చిక్కుప్రశ్నలకు బదులు వెదుకుతూ...
నా... అన్వేషణ సాగుతూనే ఉంది...

వీడని చిక్కుముడి కోసం ఆరాటమెందుకని...
నా పిచ్చి మనసుని చూసి జాలిపడి ..
ఆ మనసు... ఓ నవ్వు నవ్వి....
పొగ మంచు మేలి ముసుగులో కరిగిపోయింది...