Powered By Blogger

1 మార్చి, 2014

ఓ... అంతులేని అన్వేషణ





ఓ మగువ.... నీ మనసు లోతుని
అన్వేషిస్తున్న బాటసారిని....

నా ప్రయాణంలో ఎన్ని ఓటములో
అన్నే గెలుపులు, మలుపులు

తరుణి మనసు ఓ అంతులేని కథ
ఎన్నిసార్లు ఓడినా అదో తీయని వ్యధ
 
పొగమంచు మేలి ముసుగులో
ఓ మనసా పలకరిస్తావు...

దరిచేరి మసుగు తీసే లోపే కరిగి
నేనొక మాయనని వెక్కిరిస్తావు...

సముద్రాన్ని దాచుకున్నావు...
ఒక్క అలనైనా తాకనీయవు...

ఆకాశంలో సగం నేనేనంటావు
శూన్యం తప్ప ఇంకేదీ కనపడనీయవు

అగాధం అంచున ఉంటానంటావు....
ఆ అగాధానికి అంతేలేదని నువ్వే చెప్తావు....

చిక్కుముడుల చిత్రాన్ని నేనంటావు...
విప్పిన కొద్దీ కొత్త ముడిని చిత్రిస్తూనే ఉంటావు...
 
మనసు పొరలు మరుల తరువంటావు
ఆ పొరల చెరలో కన్నీటి చుక్కనీ నేనే అంటావు

కలల వలలో చిక్కుతావని అంటే...
కనులు మూసుకున్నాను....

ఆ కలల వల నాపైనే విసిరి...
కలత నిదురవై వెళ్లిపోయావు...

ఎట్టకేలకు....
మససు వాకిట నిలబడి తలుపు తడితే...
లక్షప్రశ్నల నిలువెత్తు శిల్పమై మాయమయ్యావు...

అంతులేని కథని అన్వేషిస్తూ....
అంతం తెలియని దూరం ప్రయాణిస్తూ...
చిక్కుప్రశ్నలకు బదులు వెదుకుతూ...
నా... అన్వేషణ సాగుతూనే ఉంది...

వీడని చిక్కుముడి కోసం ఆరాటమెందుకని...
నా పిచ్చి మనసుని చూసి జాలిపడి ..
ఆ మనసు... ఓ నవ్వు నవ్వి....
పొగ మంచు మేలి ముసుగులో కరిగిపోయింది... 

 



10 కామెంట్‌లు:

  1. అరరే సతీష్ గారు , మొత్తానికి మీ అన్వేషణ సఫలం కాలేదు మరలా ప్రయత్నించండి...మీ మగువ సహాయం తీసుకోండి...అంతిమ విజయం మీదే .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏ మగువ సహకరించడం లేదండి.. అందుకే ఈ పాట్లు. అసలు అదో మిస్టీరియస్ సబ్జెక్ట్ గా మిగిలిపోయింది. అందుకే నా అన్వేషణకి అంతం లేదు...

      తొలగించండి
  2. కష్టేఫలి అన్నారు. మీ అన్వేషణ ఫలిస్తుంది. కవిత చాలా బాగుంది సతీష్..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు... చాలా మంది అంటున్నారు. ఆడామగ తేడా లేదు. అందరి మనసు తీరు ఒకటేనని.. కాదని నా వాదన. మగువ మనసు ఒక ఆసక్తికరమైన అన్వేషణే అని ప్రగాఢ విశ్వాసం. మీ ప్రశంసకు మరో సారి ధన్యవాదాలు...

      తొలగించండి
  3. అందమైన ఆ భావాల వెనుక దాగిన ప్రేమని తప్పకుండా అర్దం చేసుకుంటుంది లెండి.
    కాకపోతే మగువ కదా కాస్త బెట్టు చేస్తూ ఉండొచ్చు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్యో మెరాజ్ గారు. ఇది ప్రేమ కానేకాదండోయ్. మగువ మనసు లోతుల్లో ఉంటే భావ సంఘర్షణ అన్వేషణ అంతే. మగువ మనసుని విశ్లేషించడం క్లిష్టమైన అంశమని పెద్దపెద్ద మేధావులే అనేశారు. ఔనంటే కాదని, కాదంటే ఔనని పింగళి గారు తేల్చిపారేశారు. కానీ... అంతుచిక్కని ఆ మనోభావాల అన్వేషణలో ఏదో గమ్మత్తుంది. ఆ భావనే ఇది. ధన్యవాదాలు ఫాతిమాగారు.

      తొలగించండి
    2. సతీష్ గారూ ... అన్వేషణ లోనూ .. నిరీక్షణ లోనూ .. ఉన్న ఆనందం అనిర్వచనీయ మయినది . తప్పు లేదు .. అన్వేషణ కొనసాగించండి .. కానీ మీరన్నట్టు మగువ మనసు లోతులను కనిపెట్టగలిగే వారు ఇంకా పుట్టలేదే మోనండి . ఏమయితేనేం మీ కవిత మాత్రం అభిననందనీయం

      తొలగించండి
    3. మగువ మనసు లోతుని కనిపెట్టాలంటే అది మగువ బయటపడితేనే సాధ్యం. ఆమె బయటపడదు కాబట్టి మాకీ కష్టాలు... ధన్యవాదాలు...

      తొలగించండి