నా పేరు అతివ...
కొందరు మగువ అని...
చాలా మంది అబల అని కూడా అంటారు...
కానీ నేనొక భారతీయ స్త్రీని..
నన్ను పూజించిన చోట..
దేవతలు తిరుగుతుంటారని...
పురాణాల్లో ఉందట....
ఏమో నాకు తెలీదు...
ఆ దేవతలను ఎప్పుడూ చూడలేదు..
నేను పూజలూ అందుకోలేదు...
నా స్థానం కొన్నిళ్లలో వంటిల్లే...
మరికొన్నిళ్లల్లో కేవలం నేను
పక్క పంచి.. పిల్లల్ని కనే యంత్రాన్ని...
వాళ్లకేం తెలుసు స్వేచ్ఛ లేని చోట
సుఖం బదులు కంటతడే ఉంటుందని...
ఒక్కోసారి పుట్టగానే నేనుండేది...
ఆస్పత్రి బయట చెత్తకుప్పలో...
అందులో చీమలు, పురుగులకు
నేనే ఆహారం. నా తొలి పుట్టిన రోజు
బహుమతి మృత్యుకౌగిలి.
ఈ కథ వెనుక మరో పెద్ద వ్యధ
ప్రేమంటే నమ్మేస్తాను... అభిమానానికి కరిగిపోతాను
పక్కనే వంచన పొంచి ఉందని తెలుసుకోలేను
మూడు ముళ్లని ఆశపడ్డాను...
అన్ని ముళ్లేనని ఎలా ఊహించగలను...
కడుపులో పడిన దగ్గర నుంచి నాకు భయమే
ఎక్కడ చిదిమేస్తారో అని అదురే
పిండం నుంచే బతుకు గండం...
ఎవరికీ ఉండదేమో ఈ గ్రహణం
బలవంత భ్రూణహత్యా కాండ సమిధను...
మహలక్ష్మిని నేనంటారు...
మహమ్మారిలా ఎందుకు చూస్తారో...
కలికాలంలో ఆటబొమ్మను నేనే...
అర్థరాత్రి నడిరోడ్డున నిలబడటమా... హవ్వ
పట్టపగలే వివస్త్రను చేస్తుంటే..
నడిరోడ్డునే మీదపడి కోరిక తీర్చుకుంటే...
నిట్టనిలువున నలిపి విసిరేస్తుంటే...
శవపంచనామాలో ఎక్కడెక్కడో గాయాలు
చెప్పుకోేలేని చోట కసాయి గాట్లు
యత్ర నార్యంతు పూజ్యంతే....
వినడానికి ఎంత బాగుందో...
కట్నం తేకుంటే కిరోసిన్ తో అగ్నిహూత్రం
వలపు పేరిట ఆమ్లదాడుల రాక్షసకాండం
పెడరెక్కలు విరిచి మరీ కామాంధుల దుర్మార్గం
అడుగడుగునా శీల పరీక్షలే... అవమానాలే
అయినా నా ధైర్యం తరగనిది...
ఎందుకంటే....
నేనెప్పుడూ చావు అంచుల మీద బతుకుతుంటాను...
చావుతోనే న్నేహం చేస్తుంటాను... నాకెందుకు భయం.
నా ప్రయాణంలో ఎన్నో అంతులేని వ్యధలు
తడి ఆరని కన్నీళ్లు, చిక్కటి చిమ్మ చీకట్లు
అడుగడుక్కీ గుచ్చుకునే విషపు ముళ్లు
నా ఈ ప్రయాణంలో... ఓదార్పు ఏమైనా ఉంటే
అది... చిరుదీపంతో కాస్త దారిచూపిన మనసులు...
ముళ్లగాట్లకు రుధిరంతో తడిసిన చేదు జ్ఞాపకాలకు
కన్నీటి లేపనమేసిన మనుషులు....
(ఈ మధ్య కొందరి బ్లాగుల్లో మహిళల మీద జరుగుతున్న అరాచకాల గురించి చాలా మంది బాగా రాశారు. అమాయక ఆడపడుచుల మీద జరుగుతున్న హేయమైన అత్యాచారకాండకు నిరసనే ఇది)