ఓ మనసా....
ఆశలు సమాధి అయ్యాయని చింతించకు
కంటతడి ఆరలేదని కలతచెందకు
బాధకు అంతేలేదని అంతం కాకు
ప్రపంచం పగబట్టిందని అలుసు చేసుకోకు
ఓ మనసా....
గుండెలో బాధ బరువు పెరిగితే
దించేసుకో అని సులువుగా చెప్పలేను
ఒక్క చిరునవ్వుతో చెంపమీద తడి
తుడిచేసుకో అని తెలికగా చెప్పను
ఓ మనసా....
ఓదార్పు కోరే హృదయం విలువ తెలుసు
అంతర్ముఖాన నిరాశ రూపమూ తెలుసు
కాలం గాయం చేస్తే ఆ మనోవ్యధేంతో తెలుసు
కరడు గట్టిన విధి మిగిల్చే గుండెకోతా తెలుసు
ఓ మనసా....
ఎద రొదల రంపపు కోతకు మందేలేదా
చెరలో బందీ అయిన స్వేచ్ఛకు విముక్తి రాదా
ఆలోచనల యుద్ధానికి కన్నీరే శాంతి కాదా
నీకు నువ్వే ఓదార్పు, సాంత్వన కదా...
ఓ మనసా....
అయినా ఏనాడైనా అవకాశం ఇచ్చావా
కుమిలికుమిలి నీలో నువ్వే కన్నీిరయ్యావు
ఆ కన్నీటికే వ్యధను కలిపి సిరా చేశావు
నీ మనసు కాగితంపై మళ్లీ ఆ కన్నీటినే పరిచావు
ఓ మనసా....
నీ మనసుకే మనసు లేదు
అందుకే ఆ అంతులేని కథకు...
అంతం వెదకలేకపోతున్నాను...
కానీ.. ఓ ప్రయత్నం మాత్రం చేశాను
ఓ మనసా....
ఓ సాయంత్రాన.. రుధిరాకాశాన్ని చూస్తూ
నా మనసుని తెల్లకాగితం చేసి..
నా ఆనందాన్ని రంగుల సిరాతో కలిపి
మనసు కథ రాయడం మొదలుపెట్టాను...
ఓ మనసా....
నా కలం నుంచి సిరా రాలేదు
రంగుల బదులు కన్నీరు ఒలికింది
అంతులేని కథకు వ్యధ తోడైంది
కాలమే చెప్పలేనిది చెప్పాలనుకుంటే...
మరో కన్నీటి కాగితం తయారైంది...
రుధిరాకాశం మరింత ఎర్రబడింది...
ఓ మనసా.... నా మనసూ చీకటిలో కలిసిపోయింది