Powered By Blogger

11 జులై, 2014

స్వప్న ప్రవాసం....
















 అవును.. అతనంటే నాకిష్టం...
అతని వాడి చూపులు వెంటపడ్డాయి
ఆ చూపుల్లో... ప్రేమా నిజమే
ఆ చూపుల వెనుక కన్నీటి చారా నిజమే...

ప్రతిరోజూ నా వెనుకే వస్తాడు
చూపులతోనే పలకరిస్తాడు
ఆ చూపుల్లో నవ్వులు నన్ను పిచ్చెక్కించాయి
అయినా... ఏదో జడత్వం నన్నాపేస్తోంది

గత్మస్మృతుల చేదు అనుభవాలు 
నా ముందరి కాళ్లకు బంధాలు
అయినా... ఆ చూపుల గాలాలు
నా మనసుని వెంటాడుతూనే ఉన్నాయి...

ఆ రోజు... అతను రాలేదు...
ఆ చిరునవ్వుల కనులు కనిపించలేదు
మనసు పరిపరి విధాల పలవరించింది
వద్దనుకున్నావు వెదుకులాట ఎందుకు...
అని ఆ మనసే మళ్లీ వెెక్కిరించింది...

ఆ రోజంతా నేను అక్కడే ఉన్నాను
ఆ చూపులు తగలకుండా వెళ్లాలనిపించలేదు
ఎంతసేపైందో.. ఎదురుచూపులే మిగిలాయి
కళ్లుకాయలు కాచి.. ఇక వెనుదిరిగాను...

నిదుర రాలేదు....మనసు కట్టలు తెంచుకుంది...
అతని ఆలోచనలతోనే నిండి పొర్లిపోయింది
ఎందుకో.. ఏమో... నాకే తెలియని స్థితి
కనిపిస్తే.. ఎందుకు రాలేదు అని కడిగేద్దామన్న పరిస్థితి

మనో భారంతో ఆ రాత్రెలాగో గడించింది..
మరునాడు... ఆత్రంగా బయటకొచ్చాను...
నాకిష్టమైన గులాబీ మొక్క ముందో లేఖ
ఆతృతగా తీసి అతని చూపుల భాష వెదికాను
అవును.. అది అతను రాసిన లేఖే...

'మీ స్వప్న ప్రవాసంలో జీవిస్తున్నా
మనసిస్తారా,  నా ప్రాణం రాసిస్తా'
ఆ లేఖలో  ఈ  రెండే వాక్యాలు... 

ఒక్క అక్షరం కూడా బదులివ్వలేను
కానీ... మనసివ్వకుండా ఎలా ఉండగలను....

‍(ఈ చిత్రం చూసి రాయాలనిపించింది....‌)