Powered By Blogger

22 ఫిబ్రవరి, 2014

రెండు గులాబీల ఆత్మకథలు....






దూరంగా రెండు గులాబీలు పడున్నాయి
ఆ గులాబీలు మాటాడుకుంటున్నాయి...
ఒక గులాబీ అడిగింది.. ఇంకో గులాబీని
ఏం ఇక్కడ పడున్నావని....
నా కథెందుకులే ముందు నీ కథ చెప్పు అంది...

ఏం చెప్పను.. ఎలా చెప్పను...
ప్రేమికుల గుర్తులం కదా... నలిగిపోతున్నాం
పోనీ నిజమైన ప్రేమా అంటే కాదే..
ఆ దేవదాసులు, లైలామజ్ఞూల...
ప్రేమ సౌందర్యం చూసినవాళ్లం కదా..
ఇప్పటి ప్రేమను చూస్తే కన్నీళ్లొస్తున్నాయి...
స్వచ్ఛత లేని మనసుల మాలిన్యం కంపు
ఆ కంపుని కప్పేందుకు గులాబీ కావాలి
అవసరాల కౌగిళ్లకు ప్రేమ పేరు పెట్టారు
ఆ కౌగిళ్ల మధ్య మాధుర్యం కాదున్నది
శారీరక అవసరం... ప్రేమంటారా దాన్ని
అందుకు మనమా రాయబారులం...
ఛీఛీ.. వెధవ బతుకు.....
అవసరం తీరాక... కోరిక చల్లారాక...
మరో ప్రేమ కోసం వెదుకులాట...
ఆ క్రమంలో ఓ జంట చేతుల్లో నలిగిపోయాను...
కనీసం... ఆ మురికి కాలవలోనైన పడేయొచ్చుగా
మాలిన్య మనసుల కంపుకన్నా...
గరళమేం కాదు.... ఆ మురికికాలువ..
ప్రేమ పేరుతో నన్ను వంచిస్తున్నారు
ప్రేమ లేని చోట గులాబి ఎలా గుబాళిస్తుంది.
ఇలా వారి చేతుల్లో నలిగి నిట్టూరుస్తూ
ఇలా నడిరోడ్డున పడ్డాను... ప్రేమవిలాప చిహ్నంగా
మరి నీ కథేంటి.... రెండో గులాబీనడిగింది.

ఇంతసేపు రోధిస్తూ కూర్చున్నాను...
నా కన్నా దురదృష్టవంతురాలు లేదని
కానీ... నీ కథ విన్నాక అర్థమైంది...
నేను అదృష్టవంతురాలిని
ఒక అందమైన ప్రేమలేఖలో ఒదిగాను నేను
ఆ లేఖలో అక్షరం అక్షరం నాకు గుర్తే..
వసంతంలో వెన్నెల వాన కురిసినట్టు
అవి అక్షరాలు కావు... స్వచ్ఛమైన ప్రేమ తునకలు
అలాంటి లేఖలు ఎన్నో...
అదిగో దూరంగా విలపిస్తున్నాడే
ఆతను రాసిన లేఖలే అవన్నీ....
ఆ కన్నీటి ధారకు పులకిస్తుంది ఆ సమాధి
ఆ సమాధిలో అతని ప్రేయసి జ్ఞాపకాలు
ఆమె ప్రతి పుట్టిన రోజుకి ప్రేమలేఖలు
ఆ ప్రేమలేఖల్లో నేను... నా గుబాళింపులు
ఆ రోజంతా ఆ సమాధే అతని లోకం
ఇది ప్రేమ కాదు... పిచ్చి అనుకున్నాను 
శవాలదిబ్బపై ఇంత అందగత్తెనైన నన్ను
బహుమతిగా పెడతాడా అని మండిపడ్డాను
కోపంతో ఇదిగో ఇలా లేఖ నుంచి జారిపోయాను
కానీ... నీ కథ విన్నాక ఇప్పుడు విలపిస్తున్నాను
ఆ స్వచ్ఛమైన ప్రేమకు రాయబారిగా లేనే అని..
ఈ ప్రేమికుడి కన్నీటి ధారల్లో తడిసి ముద్దై...
ఆ సందేశాన్ని తన ప్రేయసికి పంపలేకపోయానే అని....

మొదటి గులాబీ రెండో గులాబీతో....
నా ముళ్లు నాకే గుచ్చుకున్నాయి
నా మనసు అనాకారి ప్రేమను చూసి
నిర్జీవమైంది... నిరాకరమైంది...
కానీ... నువ్వు... 
అమరమైన ప్రేమకథలో...
చెదిరిపోని కన్నీటి జ్ఞాపకానివి
స్వచ్ఛమైన మనసుల గుబాళింపువి...

 





 
  

12 కామెంట్‌లు:

  1. సతీష్ గారూ, సుదీర్గమైన మీ పోస్ట్ చదివిన తరవాత నాకు కలిగిన ఫీలింగ్ చెప్పాలని చూశాను, మరి ఎంత వరకు న్యాయం చేశానో..,
    ఓ చిరుగాలి ఆ గులాబీల వ్యధ(కథ) వింటే ఏమంటుందో... చెప్పనా,

    అందమైన మీ దేహాలను గ్నాపకాలకు వాడుకోవటము మీకు నచ్చకపోవచ్చు, కానీ ప్రేమికుల మద్య జరిగే హృదయ స్పందనకు సాక్ష్యంగా నిలిచే నేను, మనిషిలో మార్పును పసిగట్టాను.
    శ్వాసకు ప్రతిశ్వాసగా అనుకొనే ఆ ప్రేమను మీతో పోల్చుకొని,చిరస్తాయిగా నిల్చిపోవాలని అనుకుంటారు, కానీ శ్వాసకూడా ఆగిపోయిన తర్వాత కూడా మిమ్ము తమ ప్రేమకు గుర్తుగా సమాదిపై పెట్టి, మీలో తమ ప్రేమని చూస్తున్నాడు మనిషి . మీ జన్మ ధన్యమే కదా.....,

    సతీష్ గారూ, పుస్తక పొరలలో నలిగి అణిగిన గులాబిరెక్కలు చాలా కథలను వినిపిస్తాయి.(మధురమైన జ్ఞాపకాలకు తెర తీస్తాయి.)

    మీ కవిత చాలా,చాలా బాగుంది, గులాబీల పరిమళం లా....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజాయతీగా ఓ విషయం చెప్పాలి మీతో. నిజానికి మొదటి గులాబి కథ వరకే ఆ రోజు మెదడులో మెదిలింది. టకటకా రాసేశాను. రెండో గులాబీతో ఏం చెప్పించాలో అర్ధం కాలేదు.
      ఆలోచిస్తుండగా చాలా సేపటికి అనిపించింది. నిజాయతీ లేని ప్రేమలో ఎంత మాలిన్యం ఉంటందో, నిజమైన ప్రేమలో స్వచ్ఛమైన పరిమళం కూడా అంతే ఉంటుందన్న కంక్లూజన్ రావాలని ఇలా ముగించాను ఫాతిమా గారు. ఆసాంతం చదివి.. అర్థవంతమైన ముగింపునిచ్చారు మీరు. థాంక్యూ.

      తొలగించండి
  2. సతీష్... మంచి కాన్సెప్ట్

    రిప్లయితొలగించండి
  3. అంతే కదా,వాటి మనసులు కూడా మంచిని చేరుకోవడానికి ఎంత ఆరాటపడతాయో,మలినమైపోతే ఎంత ఆవేదన చెందుతాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు సతీష్ గారు "పుష్ప విలాపం".....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును పుష్ప విలాపం. వాటికీ ప్రాణం ఉంటుంది. హృదల విలాపం ఉంటుంది. అవి కూడా బాధపడతాయి. వాటిని మొక్కనుంచి తుంచినందుకు బాధపడవు. మలినమైన మనసుల్లో కపట ప్రేమకు గుర్తులుగా మిగిలినందుకు బాధపడతాయి. మంచిస్పందనకు ధన్యవాదాలండీ... శ్రీదేవి గారు.

      తొలగించండి
  4. బాగుందండి....... రెండు గులాబీల్లో దాగిన హృదయవేదన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు చాలా మంచి క్రిటిక్. మీ కామెంట్ ఏదైనా సరే ఆహ్వానం. ధన్యవాదాలు.

      తొలగించండి
  5. సతీష్ గారూ ... అద్భుతం అనే మాట చాలదేమో .. అనిపించింది మీ కవిత చదివాక . మీ మనసు లోని లోతైన భావాలని ఇంతలా పదును పెట్టారు . నిజం గా చాలా బావుంది . ప్రేమ పరిమళం నా నాసిక పుటాలకి తగిలినట్లు అనిపించింది . మీలోని కవి ని ఇంకా పదును పెట్టి కలం లో ఇంకు జాలువారనివ్వండి .. మీ కవితా పరిమళం మరింత వ్యాపించనివ్వండి .

    మీ కథ ని radhika.andra@gmail.com కి పంపగలరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా మంచి ప్రశంస. గులాబీల గుబాళింపుల వెనక పుష్పవిలాపాలు ఉంటాయి అలాగే ప్రతీ ప్రేమ వెనుక వాస్తవం, అవాస్తవం ఉంటాయని చెప్పడమే నా ఉద్దేశం. ధన్యవాదాలు రాధిక గారు.

      తొలగించండి
  6. టైటిల్ చూసి - టైం ను బట్టి
    గులాబీ రాజకీయం తాలూకు అనుకున్నాను...
    ప్రస్తుత పరిస్తుతులను బట్టి...

    చక్కగా వ్రాశారు...
    అభినందనలు...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అది కూడా రాస్తానండీ... త్వరలో. కాకపోతే.. ఈ వెధవ మనోభావాలు దెబ్బతినేస్తాయి మరి. నా కలం అలాంటి విషయాల్లో చాలా పదునైంది. మొదట నేను జర్నలిస్టుని కదండి. కంట్రోల్ చేసుకుంటున్నాను. రాస్తా సర్.. అతి త్వరలో...

      తొలగించండి