Powered By Blogger

27 నవంబర్, 2013

ఆ చివరి కన్నీటి చుక్క...



ఆమె కంట కన్నీరు తడి
ఆమెవరో నాకు తెలీదు
అడిగే పరిచయమూ లేదు
కానీ... ఆ కన్నీరు అడగమంటోంది
కొన్నిటికి పరిచయాలక్కర్లేదంది
ఓదార్చే హృదయానికి హద్దులు లేవంది

ఆమె, నేను.. మధ్యలో పదడుగుల దూరం
బయట భోరున వర్షం
ఎవరికెవరో ఈ జీవితంలో
ఓ చిన్న చెట్టు నీడలో మేమిద్దరం
అంత వర్షంలో తడిసినా
నీటికి, కన్నీటికి తేడా తెలుస్తోంది

అటు తిరిగి ఆమె
ఆమె వైపు తిరిగి నేను...
కష్టం తెలుసుకోవా అని వేదనగా...
జాలిగా చూస్తూ బాధతో
ఆ వర్షంలో కలిసిపోయింది కన్నీరు...
నా అసమర్ధతను తిట్టుకుంటూ

రుధిర ధారా ప్రవాహంలా
ఆ కంట కన్నీరు కట్టలు తెంచుకుంటోంది
ఏదో తీరని కష్టమే కలిగింది
నాలో నేను ఏవేవో ఊహించుకున్నాను
వాటితో ఆమె ఏదో ఒక కష్టానికి
సరిపోతుంది అని సరిపెట్టుకున్నాను

నేల జారుతున్న కన్నీటి చుక్కలు
నా వైపు కోపంగా చూస్తూ శిధిలమయ్యాయి
జాలిలేదా అని ప్రశ్నిస్తూ కసురుకున్నాయి
ఒక్క మాట  అడిగితే ఏమైందని విన్నవించాయి
గుండెలోని బాధ చెప్పుకుంటేనే కదా
ఈ కన్నీటి బరువు తగ్గేది.. అని గుర్తుచేశాయి

నా మనసు దిటవు చేసుకున్నాను
పదడుగుల దూరాన్ని సగం చేశాను
ఏమైందీ.. అని మనసడిగింది
నా గొంతు మాత్రం పెగల్లేదు
వర్షం తగ్గింది.. ఆమె వెళ్లిపోియింది

సుదూరంగా ఆమె కనుమరుగైంది
కానీ... తన బాధాతప్త హృదయ రాయబారిగా
చివరి కన్నీటి చుక్క నా వైపే దీనంగా చూస్తూ
బాధ పంచుకోలేని జీవితం..
ఒక జీవితమేనా అని ప్రశ్నిస్తూ
జడివానలో కలిసిపోయింది...

(పై చిత్రం చూసి ఆ  చివరి కన్నీటి చుక్క భావాన్ని రాయలనిపించింది)


7 కామెంట్‌లు:

  1. ప్రతి అక్షరంలో భావాన్ని పలికించారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగారాశానో లేదో నాకే తెలీదు... ఆ క్షణానికి మనసులో తట్టిందిది. మీ స్పందనే
      ప్రామాణికం. ధాంక్యూ పద్మగారు.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. ధన్యవాదాలు తెెలుగుమ్మాయి. మీ బ్లాగు కూడా చూస్తున్నాను. బాగుంటున్నాయి.

      తొలగించండి
  3. అశ్రువును పలకరించటానికి సున్నిత మనస్సు కావాలి, అది వ్యక్తం చేయటాని భావం కావాలి, దానికి బాష కావాలి,
    ఇవన్నీ ఉన్న మీ కవితకు ప్రశంస కావాలి, మంచి స్పందన కావాలి.
    ఎందుకో ఈ రోజంతా మీ బ్లాగ్ చూడాలనిపించింది. చాలా చదివాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓదార్పునివ్వలేని పిరికితనం కన్నీటిని తుడిచే ప్రయత్నం కూడా చేయలేని చేతకానితనం చాలా ప్రమాదకరమైనవి. ఇలాంటి సంఘటన ఒకటి నా స్నేహితుడి జీవితంలో ఓ సారి జరిగింది. ఈ చిత్రం చూడగానే అదే గుర్తొచ్చింది. ఆడపిల్లలు కన్నీరు పెట్టకూడదు.. వారిని కన్నీరు పెట్టించకూడదు అనే నిశ్చితాభిప్రాయం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. అది పాటించేందుకు.. అందరికీ తెలియచేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తుంటాను. ధన్యవాదాలు మీరాజ్ గారు. స్పందించినందుకు.

      తొలగించండి