Powered By Blogger

8 జూన్, 2014

ఒక స్వప్నం...

ఒక స్వప్నం...

సాయంసంధ్యా గీతంలో నేను లీనమైనప్పుడు
సప్తస్వరాల కౌగిలిలో నేనే వాయులీనమైనపుడు 
శృతిలయల జతులతో నేను రమిస్తున్నప్పుడు...
నా మనసులో అలజడి రేపింది... ఓ ప్రణయ మంజరి

సంధ్యాగీతాల వాయులీనాల శృతులు దాటి
ఆ మంజీర నాదానికి మది పరవశించింది...
మేఘమాల పంపిన ముత్యాల జల్లుల్లో
తడిసి ముద్దవుతున్న ఆ ప్రణయ మంజరి
తన్మయ రూప లావణ్యాన్ని వర్ణించేందుకు
అక్షరాలు పోటీపడుతూ యుద్ధం చేశాయి...
ఆ యుద్ధంలో ఎన్నో అక్షరాలు నేలకొరిగాయి... 
చివరికి మిగిలిన కొన్ని అక్షరాలు రాజీపడి...
పదాబృందాలై... ఆ ప్రణయ లాహిరిని 
కవితా వనంలో... కవన ఝరిలో బంధించాయి

అలజడి జడివానలా చుట్టిముట్టింది నన్ను
కవన వనంలో అక్షర బంధితమైన ఆ జవ్వని
నన్ను చూసి... చిరునవ్వు కానుకిచ్చింది..
ఆ నవ్వు నుంచి జారిన కోటి గులాబీ రేకులు
నా తనువుని కౌగిట్లో ముంచి.. ఉక్కిరిబిక్కిరి చేశాయి

నా అందాన్ని బంధించిన ఈ అక్షరాలను 
ఓడిస్తే... నేను నీ సొంతం...అంది.. 
ఆ లలిత జనిత సౌందర్య నాయిక....

సమ్మోహనాక్షరాల కావ్య మాలికలేవో
నా చుట్టూ పరిభ్రమించాయి...
కోరి వచ్చిన కాంతను అక్షర గంధాలతో
కట్టిపడేయవోయీ... అని మనసుతో అన్నాయి..

ఆ కావ్యనాయికను వర్ణించ అక్షర సాధ్యమా...
సృష్టిలోని పూలరేకులన్నీ ఒక రేకుగా మారి
పారిజాత పూల కొమ్మకు ఒక పూవై పూసినా
ఆమె నగుమోముకి సాటిరావే...అమెని ఏమని వర్ణించను... అని దిగాలు

కోటి సుగంధాల లావణ్యాలను రంగరించినా
ఆమె అధరాల మధురం ముందు దిగదిడుపే...
ఆమె నడుము నయగారాన్ని చూసి 
సన్నజాజి పూల లతలు కూడా చిన్నబోతే
ఆమెను నేనేమని వర్ణించగలను...?

వంద శృంగార నైషధాలు పలికించే
ఆ కనుల సోయగాన్ని ఎలా వివరించను ?
సుమాల తాకిడికే కందిపోతున్న
పరువాల కోమలాన్ని ఏ అక్షరంతో బంధించను ?
మాటమాటకు ముత్యాల పోగులు పడుతుంటే
ఆమెను ఏ మాటతో మురిపించగలను..?

ఇక... ఇది ఒక కలగా అనుకుని
నిరాశగా... వెనుదిరిగాను....
కానీ... కళ్ల ముందు ఆ కావ్యనాయకి..
ఆమెను బంధించిన అక్షరాలు
నా ముందు మోకరిల్లాయి...
ఇంతకన్నా ఎవరు వర్ణించగలరు.. అన్నాయి..

దూరంగా... సాయం సంధ్య వెన్నెలను పంపింది
చందమామ నీడలో... చిరుగాలి సవ్వడికి...
నిచ్చెలి కురులు అలలు అలలుగా తాకుతుంటే..
ఆ తెరల మాటున తన ఆధరగంధం 
నా మేను సింధూరమైంది....

తూరుపు సింధూరంతో కనుల కొలనులో
మధుర స్వప్నం చెదిరిపోయింది...
సుమధుర జ్ఞాపకం మిగిలిపోయింది...
అంతా ఒక స్వప్నం....

 


 


 

 

 




 





9 కామెంట్‌లు:

  1. సతీష్ గారూ .. మీ కలల కలం నుండి జాలువారిన ఈ అక్షరాలు కాస్త నన్ను కట్టి పడేశాయి సుమండీ ... మీ ప్రణయ మంజరి అందాన్ని వర్ణించ మీరెంత కష్ట పడ్డారో .. అంత కష్టం గా ఉండండి .. వర్ణించడానికి .. సింపుల్ గా బావుందని చెబితే పాపమే అవుతుంది ... మనసు రెక్కలు తొడిగి కాసేపు మీ కలల వనం లో విహరించి .. మీ మధుర స్వప్నాన్ని మనసారా తిలకించిందని .. ఆ అక్షరాల మధ్య ఉక్కిరి బిక్కిరై మనస్ఫూర్తి గా మిమ్మల్ని అభినందిస్తోందని మాత్రమె చెప్పగలను ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు రాధిక గారు... అసలు మాటాడటం కుదరటం లేదు. మీ బ్లాగ్‌ కూడా చూసి చాలా రోజులే ఆయింది. అందాన్ని వర్ణించడంలో ఉన్న హాయి అంతా ఇంతానా. అందుకే కవిత కూడా అంతపొడగైపోయింది... ధన్యవాదాలు

      తొలగించండి
  2. మీ కలలసౌధామిని సౌందర్యం మీ అక్షరాల అంబుల పొదిలో మరింత పరిమళాలని వెదజల్లిందండి. మీ భావ పటిమా కౌసల్యానికి ప్రణమిల్లుతూ....అభినందనమాల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రణమిల్లడం అనే పెద్ద పదం ఎందుకండి.. నా కవితా నాయిక... సౌందర్యం ఆలాంటిది. నిరక్షరాస్యుడిని కూడా కాళిదాసుని చేయగలదు. ధన్యవాదాలు

      తొలగించండి
  3. సతీష్ కోత్తూరి గారూ
    మీ కవిత "ఒక స్పప్నం" చాలా మంచి భావాలతో అందించారు.

    భాషాన్వేషణ మీ కవసరం లేదు.
    అందుకే మీ రచనల్లో ఓ 'జీల్' ఉంటుంది ఎప్పటికీనూ .

    " మేఘమాల పంపిన ముత్యాల జల్లుల్లో
    తడిసి ముద్దవుతున్న ఆ ప్రణయ మంజరి
    తన్మయ రూప లావణ్యాన్ని వర్ణించేందుకు
    అక్షరాలు పోటీపడుతూ యుద్ధం చేశాయి.. "

    మీ కవితకు ఊపిరినందించిన పలుకులివి .
    అలరించండి మమ్ము ఇలాగే.

    అభినందనలతో,

    మీ
    *శ్రీపాద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ స్పందనకు, నాలో భావానికి మీరిచ్చిన అక్షర కానుకలకు... ధన్యవాదాలు

      తొలగించండి