Powered By Blogger

12 సెప్టెంబర్, 2017

ఈ శ్లోకాలు పిల్లల్లో కాన్ఫిడెన్స్‌ పెంచుతాయి...


పిల్లల తెలివితేటలు పెద్దవాళ్ల తెలివితేటల కన్నా చాలా ఎక్కువ. చిన్న వయసులో వారి grasping power ఊహించని స్థాయిలో ఉంటుంది. ఆ వయసులోనే ఆ మెదడుని సాన పడితే వారు మేధావులవుతారు.. ఇవేవీ పట్టించుకోకపోతే ఏ వీడియో గేమ్‌కో, ఇతరత్రా అనవసర విషయాలకు వారి తెలివితేటలు divert అయిపోతాయి. 5 నుంచి 10 ఏళ్ల వయసు చాలా కీలకం. ఆ వయసులో పిల్లలు ఎలా tune అయితే.. జీవితం అలా ముందుకు సాగుతుంటుంది. ఇక్కడే వారికి మంచి విషయాలు చెప్పాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల గైడెన్స్‌ చాలా ఎక్కువగా ఉండాలి. వారిలో తెలివితేటలు, మేధాశక్తి, జ్ఞాపక శక్తి, ఆత్మస్థైర్యం ఇవన్నీ నింపే మంత్రమే శ్లోకం. ఒక్కో శ్లోకంలో ఉండే కష్టమైన పదాలు పలకడం, ఆ పలకడం వల్ల ఏర్పడే శబ్ద శక్తి వారి మెదడుని చురుగ్గా మారుస్తుంది. అందుకే ఇంతకు ముందు bed time sloka ఇచ్చినట్టే... ఇప్పుడు morning sloka సెట్‌ ఇస్తున్నాం. పొద్దున్నే ఈ శ్లోకాలు వినిపించండి. మీరు నేర్పించకపోయినా వారం రోజుల్లో వారే మీకు పాడి వినిపిస్తారు. తెలివితేటల్లో మార్పు మీరే చూస్తారు. ఇవి పిల్లలు సులువుగా పాడగలిగే రాగాల్లో ప్రత్యేకంగా స్వరపరిచాం.

7 సెప్టెంబర్, 2017

ప్రశాంత నిద్ర కోసం ఈ శ్లోకం

ఈ శ్లోకం చాలా శక్తివంతమైనది. పడుకునే ముందు పిల్లల చేత చదివిస్తే పీడకలలు రావు. ముఖ్యంగా చాలా మంది పిల్లలకు చీకటి అంటే భయం ఉంటుంది. అలాంటి మానసిక భయాలను పోగొట్టే శక్తి ఈ శ్లోకానికి ఉంది. రాముడంటేనే ధైర్యం. హనుమంతుడి బలం రాముడే. అందుకే రాముని శ్లోకాలు పిల్లల్లో ఆంజనేయుడంత బలాన్ని నింపుతాయి. రోజూ పిల్లలతో ఈ శ్లోకాన్ని చదివిస్తే వారిలో ఈ శబ్ద శక్తి ఒక మందులా పనిచేస్తుంది. ఇలాంటి కష్టమైన పదాలను రోజూ పలకడం వల్ల పిల్లల్లో word power కూడా పెరుగుతుంది. ఎలాంటి కష్టమైన పదాలనైనా ఈజీగా పలకగలుతారు. Stage fear పోతుంది. జై శ్రీరాం

5 సెప్టెంబర్, 2017

పలుకే బంగారమాయెనా...

భద్రాచల రామదాసు విరచించిన కీర్తనల్లో పలుకే బంగారమాయెనా కీర్తనలో లోతు వేరు. రాముడిని ఎంతో ఆర్తిగా పిలిచే ఆ కీర్తనలో భక్తికి కొత్త అర్థం చెప్తుంది. తేట తెలుగు తియ్యదనాన్ని రుచి చూపిస్తుంది. ఆ కీర్తనలో మాధుర్యాన్ని నేటి తరానికి అర్థమయ్యే సంగీతంలో అందించేందుకు చేసిన ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. పాడాలన్నఆసక్తి ఉన్నవారి కోసం తెలుగు, ఇంగ్లీష్‌ లిరిక్స్‌ కూడా అందించాం.

27 జనవరి, 2017

'చిదంబర రహస్యం' గుట్టు తెలిసిపోయింది.....

అందరికీ నమస్సులు. 5 వేల ఏళ్ల క్రితమే ఓ తమిళ భక్తుడు చిదంబర రహస్యాల గురించి ఏం రాశాడు..? అసలు చిదంబర రహస్యం అంటే ఏమిటి? కాస్మో ఫిజిక్స్‌ థియరీ ఆధారంగా ఆ ఆలయాన్ని ఎలా నిర్మించారు? ఇవన్నీ ఎన్నో ఏళ్ల నుంచి ఆధ్యాత్మిక ఆసక్తి కలిగిన వారిని వెంటాడుతున్న ప్రశ్నలు. కానీ,ఈ ఆలయ నిర్మాణం వెనుక, ఆలయం అంతరార్థం ఆశ్చర్య పరుస్తుంది. ఈ డాక్యుమెంటరీ చూడండి. మన భారతీయ అద్భుతాలను ఇలాంటి డాక్యమెంటరీలుగా రూపొందిస్తున్నాం. ఇది మా రెండో యూట్యూబ్ ఛానెల్‌. పెద్దలు మిత్రులు తమ subscriptionతో మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం.

21 జనవరి, 2017

శ్రీ చాగంటి వారి జీవిత సత్యాలు | inspiring golden words of sri chaganti ...







శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాల్లోంచి తీసుకున్న అద్భుత వాక్యాలు. ప్రతీ ఒక్కరి జీవితానికి, వారి వ్యక్తిత్వాన్ని నిర్మించుకునేందుకు ఉపయోగపడే పాఠాలివి. ఆయన ప్రతీ ప్రవచనం ఓ అద్భుతం. ఇంటింటా రామాయణం, భారతం, భాగవతం. ఆధ్యాత్మిక చింతన నింపే పారాయణం. ఈ అమృత వాక్కుల దృశ్య మాలికను చూడండి.

20 జనవరి, 2017

ప్రశాంత నిద్ర కోసం...

అందరికీ నమస్సులు. ఇది పిల్లలకు చాలా ముఖ్యమైన శ్లోకం. రాముడు, హనుమంతుడు, గరుత్మంతుడు, భీముడు... వీళ్లంతా భయానికే భయం పుట్టించే ధీరులు. ఆ నలుగురిని స్మరిస్తే నిద్రలో పీడకలలు రావు. ప్రశాంతంగా పిల్లలు నిద్రపోతారు. నిద్రకు ముందు ఈ శ్లోకం పఠిస్తే... మెదడు ఆధ్యాత్మిక చింతనతో నిండుతుంది. పడుకునే ముందు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తే అదే కలగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సైన్స్ చెప్తోంది. మరి ఆధ్యాత్మిక చింతనతో నిద్రపోతే... సైకాలజీ ప్రకారం చెడుకలలు వచ్చే అవకాశం లేదు. ఈ సైకాలజీ... మన పెద్దలకు ఎప్పుడో తెలుసు. అందుకే ఈ శ్లోకాన్ని పిల్లలతో పఠింపచేసి పడుకోమని చెప్తారు. ఈ కాలానికి తగ్గట్టు... పిల్లలకు ఈజీగా అర్థమయ్యేలా తెలుగు, ఇంగ్లీష్ లిరిక్స్ తో రూపొందించాం. వినండి, పిల్లలతో పాడించండి

13 జనవరి, 2017

మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పర్వదినంతో మొదలు ఈ సంవత్సరమంతా అందరి ఇళ్లల్లో క్రాంతులు నిండాలని ఆశిస్తున్నాం. ఆద్య మీడియా న్యూస్, రివ్యూస్‌, వీకెండ్‌ కామెంట్‌, డాంక్యూమెంటరీస్‌, మూవీస్‌ న్యూస్‌తో కూడా మీ ముందుకు త్వరలోనే వస్తోంది. మిత్రులు, పెద్దలు అంతా మా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్‌ చేసి ఆశీర్వదించాలని కోరుతున్నాం.AADYA MEDIA
ఈ లింక్‌పై క్లిక్‌ చేసి subscribe చేసి మీ blessings అందించండి.


12 జనవరి, 2017

ఆనందుని మాటే మా భగవద్గీత...

ఇవాళ స్వామి వివేకానంద 154వ జయంతి. ఆయన జయంతి నాడు జాతీయ యువజన దినంగా జరుపుతున్నాం. దేశాభివృద్ధి అంతా యువశక్తిలోనే ఉందని, యువతలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచిన గొప్ప యోగి ఆనందుడు.
భారతీయ వైదిక ధర్మం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన ఆధునిక ఆది శంకరుడు. యువ చైతన్యాన్ని తట్టిలేపిన తొలి వ్యక్తిత్వ వికాస నిపుణుడు. ఇప్పటికీ యువతకు ఐకాన్ ఆనందుడే. మనది కాని జనవరి 1న యువత చిందులేస్తోంది. మనది కాని ఫిబ్రవరి 14న ప్రేమికుల దినం అంటోంది. మనకు అక్కర్లేని అమ్మదినాలు, నాన్న దినాలు సంగతి చెప్పనే అక్కర్లేదు. కానీ, భారత దేశ ఆధ్యాత్మిక ఆత్మ, యువతకు మార్గదర్శి వివేకానందుడు మాత్రం చాలా మందికి గుర్తే ఉండరు. ఆయన లక్యాలను స్మరించుకుంటూ..... మా ఆద్య మీడియా నుంచి వివేకానందుడి జయంతికి ప్రత్యేక గీతం రూపొందించాం.
చూడండి...

10 జనవరి, 2017

త్యాగరాజ స్వామిని మర్చిపోతున్నాం....

ఏటా శ్రీ త్యాగరాజ స్వామి వర్థంతి రోజున ఆయన సమాధి చెందిన తిరువయ్యూరులో ఆరాధనోత్సవాలు జరుగుతాయని తెలిసిందే. ఈ జనవరి 17న తిరువయ్యూరులో ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. అందుకే త్యాగరాజ స్వామి వారికి మా ఆద్య మీడియా తరపున సంగీత నివాళి. త్యాగరాజ స్వామికి ఎంతో ఇష్టమైన కీర్తనల్లో ఒకటి బంటురీతి కొలువు. మా సంగీత దర్శకుడు మేఘ శ్యామ్... ఈ కీర్తనను గిటార్ పై పలికించారు. గిటార్ పై ఈ స్వరాలు పలికించడం చాలా కష్టమైన ప్రక్రియ. త్యాగరాజ స్వామి... తెలుగువారు. ఆయన కీర్తనల్లో స్వచ్ఛమైన తెలుగు గుబాళిస్తుంది. అయినా... తమిళనాటే వారి కీర్తనలు ఎక్కువ వినిపిస్తాయి. మన తెలుగువారైన త్యాగరాజు కీర్తనలు మన ఇళ్లల్లో సుస్వరాల జల్లు నింపాలని ఆశిస్తున్నాం. ఈ కీర్తనలో త్యాగరాజు... తనకు కామ,క్రోధ మదాదులను కొనగోటితో సంహరించగల బంటురీతి కొలువు (సైనికుడు లాంటి ఉద్యోగం) ఇమ్మని రాముడిని ప్రార్థించాడు.

5 జనవరి, 2017

సీతా కళ్యాణ వైభోగమే...

అందరికీ నమస్సులు. వైవాహిక బంధం అనగానే వెంటనే గుర్తొచ్చేది సీతారాములే.
ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించనంత గొప్పగా అల్లుకున్న భారతీయ వివాహ బంధం ఆదర్శవంతమైనది.
పెళ్లి అంటే మూడు ముళ్లు మాత్రమే కాదు.. సుఖాల్లోనూ, కష్టాల్లోను ఒకరికొకరు తోడుండాలన్న సత్యాన్ని
సీతారాముల కథ చెప్తుంది. అందుకే యుగాలు గడిచినా ఇప్పటికీ వివాహం అంటే సీతారామ కళ్యాణ వైభోగమే.
అలనాటి సీతారాముల కళ్యాణ వైభోగాన్ని త్యాగరాజ స్వామి వారు వర్ణించిన తీరు మహాద్భుతం.
ఏ పెళ్లిలోనైనా ఈ పాట వినిపిస్తేనే నిండుదనం. అందుకే పూర్తి సాహిత్యంతో... సుస్వరాలతో ఈ పాట
మీకోసం. వినండి...  ఎంత కష్టమైనా ఇట్టే తేలికైపోతుంది.

3 జనవరి, 2017

మన హనుమంతుడే సూపర్ మేన్....

ఈ ఆంజనేయ రక్షా శ్లోకాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు పిల్లలకు వినిపించండి. వారికి నేర్పించండి. సైకలాజికల్ గా భయాన్ని హరించే మంత్రమిది. హనుమంతుడుని తలుచుకుంటే భయం పోతుందా౟??.. అవును పోతుంది. నొప్పులకు మందులుంటాయి. అలాగే మనసుని చెదరగొట్టే ఫీలింగ్స్ కి సైకాలజీనే మందు. మన భారతీయ ఆధ్యాత్మికతలో శ్లోకాలన్నిటిలో సైకాలజీ ఉంటుంది. వ్యక్తిత్వ వికాసం ఉంటుంది. కొన్ని మంత్రాలు పఠించడం వల్ల... శరీరంలో కలిగే కదలికలు... నేరుగా మెదడుని, మన భయాలని కంట్రోల్ చేస్తాయి.భయాన్ని పోగొట్టే మందేదీ లేదు. కానీ... ఆంజనేయస్వామిని చూస్తే పిల్లల్లో భయం పోతుంది. అంటే... భయానికి మందు హనుమంతుడే. జై బజరంగ్ భళీ అంటారు. నిజానికి ఇది వజ్రాంగ వళి. వజ్రం లాంటి శరీరం కలవాడని అర్థం. బెంగాలీ వారు వ బదులు బ పలుకుతారు కాబట్టి బజ్రంగ్ అయింది. ఇదే కాన్సెప్ట్ తో హాలీవుడ్ వారు మన హనుమంతుడినే సూపర్ మేన్ అంటే ఐమాక్స్ లో చూస్తాం. గరుత్మండుడి స్టోరీనే బ్యాట్ మేన్ అంటో ఆహో ఓహో అంటాం. కానీ, ఆంజనేయ శ్లోకం చదివితే భయం పోతుందంటే... లాజిక్కులు వెదికే పనిలో పడతారు కొందరు. హనుమంతుడు అంటేనే ధైర్యానికి ప్రతిరూపం. పిల్లల్లో మానసికంగా ధైర్యం నింపే దైవ స్వరూపం ఆంజనేయుడు. మా మీడియా నుంచి వచ్చిన మరో ఆధ్యాత్మిక శ్లోకం ఆంజనేయ రక్షను వినండి.. పఠించండి.

29 డిసెంబర్, 2016

ఈ శ్లోకాలు అద్భుతాలు చేస్తాయి

భారతీయ ఆధ్యాత్మిక చింతనలో ప్రతీ విషయం వెనుక ఒక లాజిక్‌ ఉంటుంది. ఈ శ్లోకాలు కూడా అలాంటివే. శ్లోకం అంటే ఛందోబద్ధమైన కొన్ని పదాలు, అక్షరాల ఈక్వేషన్‌. ఆరోగ్యానికి బూస్ట్‌, హార్లిక్స్‌ అని పిల్లలకు పొద్దున్నేఇస్తాం. అలాగే మానసిక చైతన్యానికి శ్లోకాలు బూస్టర్లు. అందుకే చాలా ఈజీగా ఎవ్వరైనా పాడగలికే స్వరాలతో ఈ శ్లోకాలను రూపొందించాం. ప్రతీ శ్లోకానికి తెలుగు, ఇంగ్లీష్‌ లిరిక్స్‌ అందించాం. ప్రతీ రోజూ ఈ శ్లోకాలు వింటే చాలు, ఓ నెల రోజుల్లో పిల్లలే పాడేస్తారు. ఈ రోజుల్లో వేదికల మీద మాట్లాడే వారే హీరోలు. కాన్ఫిడెన్స్‌, భాష మీద పట్టు ఉంటే తప్ప వేదిక మీద ఆకట్టుకునేలా మాట్లాడడం సాధ్యం కాదు. అలాంటి కాన్ఫిడెన్స్‌, కష్టమైన పదాలను కూడా స్పష్టంగా పలికే శక్తిని శ్లోకాలు ఇస్తాయి. రోజూ ఓ పదినిమిషాలు చాలు వీటి ప్రాక్టీస్‌కి. పెద్దలు కూడా రోజు ఓ పావుగంట, మీ పనులు చేసుకుంటూ వీటిని వింటే బోలెడంత మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఎలాగూ రోజంతా బిజీలు, ఒత్తిళ్లే కదా. వాటిని భరించాలంటే ప్రశాంతత చాలా అవసరం. ఆ ఒత్తిళ్లకు మంచి మందు... ఈ స్వరసహిత శ్లోకాలు.

25 డిసెంబర్, 2016

శ్రీ రామ రామ రామేతి అంటే...?

అందరికీ నమస్సులు...వేద గణితంలో ఒక పద్ధతి ఉంది. క-ట-ప-య పద్ధతి. ఒక్కో అక్షరానికి ఒక్కో అంకెను కోడ్ గా ఇచ్చారు. అలా first digital language సంస్కృతం అయింది. ఆర్యభట తన త్రికోణమితి సిద్ధాంతాలను ఈ పద్ధతితోనే వివరించాడు. ఈశ్వరుడు ప్రవచించిన, విష్ణు సహస్ర నామంలో ప్రసిద్ధమైన ఈ రామస్తోత్రంలో 'సహస్రం' అనే మాటలో రహస్యానికి.. ఈ క-ట-ప-య పద్ధతి సమాధానం చెప్తుంది. ఇందులో .... క-ఖ-గ-ఘ-జ్ఞ-చ-ఛ-జ-ఝ-ఞ.. వరకు 1 నుంచి 0 (అంటే 1 నుంచి 9 ఆ తర్వాత 0) వరకు అంకెలు వేసుకోవాలి. ఉదాహరణకు క-ఖ-గ-ఘ-జ్ఞ-చ-ఛ-జ-ఝ-ఞ అంటే 1-2-3-4-5-6-7-8-9-0. అలా క వరుస, ట వరుస, ప వరుసలో 5 అక్షరాలు. య వరుస వరకు డిజిటల్స్ లోకి మార్చాలి. ఈ లెక్కలో రామ రామ రామ అనే మూడు మాటల విలువ 1000. అంటే సహస్రం.. ఎలాగో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశాం. శాస్త్రీయ సంగీతంలో 72 మేళకర్తలను గుర్తుపెట్టుకునేందుకు ఇప్పటికీ ఈ పద్ధతే ఆధారం. ఇక రాముడికి ఆ పేరు అష్టాక్షరీ, పంచాక్షరీ మంత్రాల ఆధారంగా వశిష్టుడు పెట్టినట్టు రాయాయణంలో ఉంది. అందుకే ఈ మంత్రం అత్యంత శక్తివంతమైంది. మానసిక ప్రశాంతతకు ఈ మంత్రాన్ని మెడిటేషన్ తరహాలో రూపొందించాం. విని.. మీరు స్మరించండి.. జై శ్రీరాం

22 డిసెంబర్, 2016

గంధము పుయ్యరుగా...




మహనీయుడు త్యాగరాజు ఎన్నో గొప్ప కీర్తనలు రాశారు. వాటిలో ప్రతీ ఇంటా వినిపించే కీర్తన గంధము పూయరుగా.. మన ఇంట్లో అన్ని శుభకార్యాల్లో మంగళ హారతిగా పాడడం ఆనవాయితి. ఏ మాత్రం పాడగలిగినా.. ఈ కీర్తనను అందరూ ఆలపించవచ్చు. అంతే కాదు. ఇందులో పదాల్లో స్వచ్ఛమైన  తెలుగు దాగుంది. ఉదాహరణకు.. మాలిమి అంటే వాత్సల్యం, ప్రేమ. 'మాలిమితో గోపాల బాలురతో నాల మేపిన విశాలనయనునికి' అంటే ప్రేమతో పశువులు కాసుకునే గోపాలకులతో ఆడుకున్నావు, వారితో కలిసి 'ఆల' అంటే ఆవులు మేపావు.. నీ అంత గొప్ప వ్యక్తిత్వం ఎవరికైనా ఉంటుందా అంటూ విశాలమైన కళ్లున్నవాడా అని పొగిడారు త్యాగరాజు. శ్రీ కృష్ణుడిని  ఇంత అందంగా వర్ణించిన కీర్తన మరోటి లేదనిపిస్తుంది నాకైతే. 'అందమైన యదునందనుపై కుందరదన లిరవొందగ పరిమళ' అంటాడు త్యాగరాజు. యదునందనుడు  అందమైన వాడు... అలాంటి అందాల కృష్ణుడికి కుందరదన అంటే  మల్లెమొగ్గల్లాంటి తెల్లని పలు  వరుసలతో మెరిసేవాడని అర్థం. అలా వళ్లంతా పూల పరిమళాల  మెరుపులు వచ్చేలా ఆయనకు గంధం పూయండంటాడు. ఎంత అద్భుతమైన వర్ణన. ఇలాంటి మంచి తెలుగుపదాలెన్నో ఉన్నాయి ఇందులో. పిల్లలకు నేర్పిస్తే.. వారిలో గాన మాధుర్యంతో పాటు... మంచి తెలుగు పదాలు తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. అందుకే కీర్తనతో పాటు అందరికీ తెలియాలని సాహిత్యం కూడా అందించాం. ఈ కీర్తనను ఆదరిస్తున్న స్నేహితులు, పెద్దలందరికీ ధన్యవాదాలు. పున్నాగ వరాళి రాగంలో ఈ కీర్తనను స్వరపరిచారు త్యాగరాజు. ఆ రాగంలో శాస్త్రీయంగా గానం చేసి... జనబాహుళ్యంలోకి మరింతగా తీసుకొచ్చిన మరో మహానుభావుడు. కేరళకు చెందిన వాగ్గేయకారుడు రామవర్మ. ఈ వీడియోలో పాట వినడమే  కాదు... నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారు పాడేలా కూడా text వేశాం. అందరూ పాడుకునేలా... సరళమైన స్వరాలతో కీర్తన రూపొందించాం. ఈ కీర్తనను  చూడండి ఓ సారి....

16 డిసెంబర్, 2016

అయిగిరి నందిని.... THE POWER OF WOMEN



ఈ సృష్టికి మూలం స్త్రీ మూర్తి. స్త్రీ లేని ప్రపంచం లేదు. సృష్టిని నిర్మించిన అసలైన దేవతను ఎంత స్మరించినా తక్కువే. ఆ షకాలంలో ప్రపంచాన్ని నడిపించిన స్త్రీలను దేవతలు అన్నాం. దేశ వ్యాప్తంగా 18 చోట్ల వెలిసిన ఆ అమ్మను అష్టాదశ పీఠాలుగా కొలిచాం. కాలంతో పాటు స్త్రీమూర్తి ఏదో ఒక రూపంలో తన శక్తిని చాటుతూనే ఉంది. ఈ ప్రపంచంలో, సృష్టిలో కనిపించే దేవత ఎవరైనా ఉంటే అది అమ్మే. ఆ అమ్మే ఆదిపరాశక్తి. ఆ అమ్మే అయిగిరి నందిని. యుగాలు మారాయి.. శక్తి స్వరూపాలు మారాయి. వేద కాలంలో అగస్త్యుడి ధర్మపత్ని లోపాముద్ర... ఋగ్వేదంలో ఋక్కులు దర్శించిన తొట్ట తొలి మహిళా వేదర్షి. ఆమె స్ఫూర్తిగా వేదంలో చాలా మంది ఋషికలు కనిపిస్తారు. వేదకాలంలో మహిళలకు ప్రాధాన్యత లేదన్నది సుద్ద తప్పు. మహిళా శక్తి ఎంత గొప్పదో సతీ సావిత్రి నిరూపించింది. యముడినే ఓడించి.. భర్తను రక్షించుకుంది. పురాణాల్లో యముడిని ఓడించినవాడు ఒక్కడేై పరమశివుడు. ఆ తర్వాత ఓడించింది కేవలం సావిత్రి మాత్రమే. శివుడంత శక్తి కలిగిన సావిత్రి అపర చండికేగా. సీత... సహనంతో కూడా రాక్షసులను అంతం చేయొచ్చని నిరూపించింది. భార్య, తల్లి ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పింది. అందుకే ఇప్పటికీ సీతను సీతగా కాదు సీతమ్మగా చూస్తాం. అసలు ద్రౌపదే లేకపోతే... ఆధునిక మహిళకు ఇంత శక్తి ఉండేది కాదేమో. స్త్రీ తలుచుకుంటే... స్త్రీ కళ్లెర్రచేస్తే.. యుద్ధాలే జరుగుతాయని నిరూపించింది. మహిళలపై జరుగుతున్న వివక్షలపై యుద్ధం చేసిన తొలి ధీర వనితగా నిలిచింది. గర్భంలో ఉండగానే ఆడపిల్లను చిదిమేస్తున్న రోజులివి. అలాంటిది 13 వ శతాబ్దంలో ఓ వనిత అపర కాళీలా కత్తి పట్టి.. శత్రువులను చీల్చి చెండాడుతుందని ఊహిస్తామా? ఓరుగల్లు ఖిల్లాలో మహిషాసుర మర్ధిని... రుద్రమగా అవతరించింది. కాదనగలమా. చరిత్రలో తొలి మహిళా రణభేరి రుద్రమ. నేటి మహిళల ధైర్యానికి రూపం... రుద్రమ. శత్రువుల మోసానికి చిక్కి భర్త వీర మరణం పొందాడు. తననూ కబళించాలని చూశారు. అప్పుడు భర్తతో పాటు వీరమరణమే సుఖమనుకుంది చిత్తోర్‌ గఢ్‌ మహారాణి పద్మిని. ఆత్మగౌరవంతో ఆత్మార్పణం చేసి... ఇప్పటికీ దేవతగా మన్ననలు అందుకుంటోంది. ఆనాడు మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ వస్తున్నాయంటే... కత్తులు కిందపెట్టి సంధిచేసుకునేవారు. అలాంటి సమయంలోనూ దేశ భక్తే మిన్న అనుకుంది.. గోండ్వానా రాణి దుర్గావతి. అక్బర్‌కి ఎదురెళ్లి ముప్పు తిప్పలు పెట్టింది. ఆమె ధైర్య సాహసాలకు అక్బర్‌కు దిమ్మతిరిగింది. అలా స్వతంత్ర పోరాటాన్ని తొలిసారి పరిచయం చేసిన అపర చండీ... రాణి దుర్గావతి. ముస్లి పాలకుల అరాచకాలకు దేశం బలవుతున్న సమయంలో... దేశాన్ని రక్షించే వీరుడి కోసం భరతమాత ఎదురు చూసింది. ఆ సమయంలో సాక్షాత్తూ ఆ దుర్గమ్మే జిజాబాయిలా అవతరించిందా అనిపిస్తుంది. తన కొడుకు శివాజీని నిప్పులు చిమ్మే ఫిరంగిలా తయారు చేసి... శత్రువులపై అణ్వాయుధంలా వదిలింది. అప్పుడప్పుడే పోర్చుగీసు మ్లేచ్యులు భారత దేశం తీరప్రాంతాల్లో పాగా వేసి... ఆక్రమణ చేస్తున్న సమయం. ఇది రానున్న విపత్తుకి ప్రమాద ఘంటికలా బావించింది మలబార్‌ రాణి అబ్బక్క. మహిళే.. కానీ... చాముండేశ్వరిలా... పోర్చుగీసు వారిని తరిమితరిమి కొట్టింది. ఆమె తొట్టతొలి స్వతంత్ర పోరాట యోధురాలన్న సంగతి మరుగున పడిపోడం బాధాకరం. కర్ణాటక ప్రాంతంలో కిట్టూర్‌ అనే చిన్న రాజ్యానికి రాణి చెన్నమ్మ. తాము స్వతంత్రంగానే ఉంటామని, బ్రిటీష్‌ అరాచకాలు భరించమని తెగేసి చెప్పింది.
యుద్ధం ప్రకటించారు బ్రిటిష్‌ వారు. 50 ఏళ్ల వయసులో కత్తి పట్టింది, గుర్రమెక్కి మూడు సార్లు బ్రిటీష్‌ సేనలను తరిమికొట్టింది. చెన్నమ్మ గుండె ధైర్యం ముందు... బ్రిటీష్‌ ఫిరంగులు పనిచేయలేదు. చెన్నమ్మ స్వతంత్ర స్ఫూర్తి ఇప్పుడెక్కడా వినిపించదు. రామఘర్‌ని పాలించే రాణి... రాణీ అవంతి బాయి లోథీ. బ్రిటిష్‌ సైన్యానికి చుక్కలు చూపించిన అపర కాళీ. ఇప్పటికీ దేశ వ్యాప్తంగా లోథాలు ఆమెను దేవతగా కొలుస్తారు. ఆమె ధైర్య సాహసాలు మహిళా శక్తికి చోదకాలు.1857 తిరుబాటులో వీరులంతా అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. ఝాన్సీలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఆ సయమంలో బ్రిటిష్‌ వారిపై విరుచుకు పడిన చండిక... లక్ష్మీబాయి. ఒకవైపు బిడ్డను పట్టుకుని.. మరోచేత కత్తి పట్టి... శత్రువుల తలలు నరికింది. మాతృత్వం ఒక కోణం, ధైర్యం మరో రూపం అని నిరూపించిన ఆదిశక్తి... లక్ష్మీబాయి. ఈ పోరాటాల స్ఫూర్తి... స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది మహిళలను నడిపించింది. కస్తూర్బా... గాంధీ అడుగుజాడల్లో నడిచి స్వతంత్రం కోసం జీవితాన్నే త్యాగం చేశారు. వంటింటికే పరిమితమైన బాలికలను బయటకు తీసుకొచ్చి... వారికి చదువు అవసరమని భావించి... విద్యాబ్యాసం చేయించిన తొలి మహిళా టీచర్‌ సావిత్రీ బాయి పూలే. ఇప్పటి మహిళలు విద్యలో రాణిస్తున్నారంటే ఆమె వేసిన బాటలే. అక్కడి నుంచి ఎంతో మహిళలు చరిత్రలో నిలిచారు. దేశాన్నేలారు. అత్యంత శక్తివంతమైన నేతలుగా దేశాన్ని నడిపించారు. మాకు సరిహద్దులు లేవంటూ అంతరిక్షంలో అడుగుపెట్టారు. తలుచుకుంటే ఏదైనా చెయ్యగలరు మహిళలు... కుంగిపోని మనస్తత్వం స్త్ర తత్వం. ఒలంపిక్స్‌లో ఇప్పటి వరకు మనకు వచ్చిన పతకాల్లో ఎక్కువగా సాధించింది మహిళలే. ఓ వైపు భ్రూణ హత్యల్లో ఎంతో మంది మహాలక్ష్మలు నలిగిపోతున్నా... అపరి చండికలై ఏదో ఒక రూపంలో తమ శక్తిని చాటుతున్నారు. ఆ నేపథ్యంలో అయిగిరి నందిని... స్తుతిని ఆ కాలం దేవతల నుంచి ఈ కాలం దేవతల వరకు అందరినీ స్మరించదగ్గదిగా భావించాం. మా ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఆల్బం. పిల్లల్లో ఇప్పటి నుంచి మహిళల పట్ల మంచి ఆలోచనలు నేర్పించాలంటే ఇలాంటి ఆల్బంలే దారి. మానసికంగా ఎదుగుదల లేనివారే... యాసిడ్‌ దాడులకు పాల్పడుతున్నారు. అందుకే పాఠశాల విద్యనుంచే ప్రార్థనలో భాగంగా... బాలురకు ప్రత్యేకంగా మరో ప్రతిజ్ఞ చేయించాలి.. అది...

"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంత తత్ర దేవతాః" ధన్యవాదాలు.

15 డిసెంబర్, 2016

గురు బ్రహ్మ గురు విష్ణుః

పిల్లల్లో మానసిక చైతన్యం కేవలం పాఠాలతోనో, పాఠశాలల్లోనో రాదు. గురువుతో వారికున్న అనుబంధం వల్ల వస్తుంది. మంచి గురువు సాన్నిహిత్యంతో నరేంద్రుడు వివేకానందుడయ్యాడు. గురువులో ఉండే శక్తి అలాంటిది. అందుకే... పెద్దలు భగవంతుని తర్వాత స్థానం గురువుకిచ్చారు.


గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః

తల్లిదండ్రుల తర్వాత ప్రత్యక్ష దైవం గురువు. గురువు మీద భక్తి ఉంటేనే చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. గురువుని నమ్మిన వాడు, గురువుని భక్తి, గౌరవాలతో చూసేవాడు ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడు. పిల్లలకు నేర్పించాల్సిన, ప్రతి రోజూ చదివించాల్సిన శ్లోకమిది.

14 డిసెంబర్, 2016

మిత్రులందరికీ ఒక చిన్నమాట....

మిత్రులందరికీ నమస్కారాలు... చాలా రోజులు నేను ఈ బ్లాగు ద్వారా ఏ సమాచారమూ ఇవ్వలేదు. అందుకు కారణం.. మేము కొత్తగా ఒక ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేశాం. ఆ పనులు, ఇతరత్రా కారణాల వల్ల... బ్లాగు వైపు చూడలేదు. ప్రొడక్షన్‌ హౌస్‌లో భాగంగా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించాం. జర్నలిస్ట్‌గా పిల్లల మనస్తత్వాలను నిశితంగా పరిశీలించే అవకాశం నాకు చాలా సార్లు దొరికింది. నాకు తెలిసిి పిల్లలంతా మాస్టర్‌ మైండ్స్‌. వారి ఆలోచనలను ఓ దారిలో పెట్టగలిగితే చాలు. వారు మేధావులవుతారు. ఈ క్రమంలో మేం ఏమైనా చెయ్యగలమా.. వారిలో చిన్ననాటి నుంచే పర్సనాలిటీ డెవల్‌మెంట్‌ ఎలా చెయ్యాలి అనుకున్నప్పుడు... మన భారతదేశం ఆధ్యాత్మిక సంపదే బోలెడన్ని పరిష్కారాలిచ్చింది. వాటిలో ఒకటి శ్లోక పఠనం. శ్లోకం అనేది ఛందోబద్ధమైన ఒక క్లిష్టమైన ఈక్వేషన్‌. పిల్లల్లో పద సంపదని, వేదికలపై మాట్లాడగలిగే ధైర్యాన్ని ఇచ్చేది శ్లోకం. అందుకే మా ఛానెల్‌ ప్రయాణం పిల్లల శ్లోకాలతో ప్రారంభించాం. ఎందుకు శ్లోకాలు చదవాలి అన్న లాజిక్‌ నుంచి... ప్రతి శ్లోకానికి పిల్లలకు అర్థమయ్యేలా చిన్న కథలా అర్థం చెప్తూ మొదలుపెట్టాం. అందుకే ఈ ప్రయత్నం పిల్లలకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ప్రస్తుతం పిల్లలు పలకగలిగే.. వారికి ఆసక్తిని కలిగించే... సులభ శ్లోకాలను ఎంపిక చేసుకున్నాం. పెద్దలు, మిత్రులు తమతమ సలహాలను అందిస్తే... మరింత ముందుకు సాగుతాం. ఈ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్‌ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం... ఇది ఛానెల్‌లో మొదటి వీడియో. ఇకపై ప్రతీ వీడియోని ఇలా మీతో షేర్‌ చేసుకుంటూ ఉంటాను... ధన్యవాదాలు.




అసలు శ్లోకం ఎందుకు పఠించాలి? పఠించడం వల్ల లాభాలేంటి?