Powered By Blogger

20 నవంబర్, 2013

ఆ మనసు లోతెంత...

వెన్నెల్లో ఆడపిల్ల మనసు
సముద్రం కన్నా లోతు
జాబిల కన్నా ఎత్తు...
నా పిచ్చి గాని... వెన్నెల్లో కదా ఆమె ఉండేది....

కనులకు కనిపించే వెన్నెల
వెన్నముద్దలా అందుతుందా
వాకిలి దాటితే పలకరించే జాబిలమ్మ
కొండెక్కి రమ్మంటే వస్తుందా...
మగువ మనసూ అంతేనా...  అందనిదా...

కెరటం తీరాన్ని తాకుతుంది...
అల చిలిపిగా పాదాన్ని ముద్దాడుతుంది
అంతమాత్రాన అల నాదైపోతుందా
నాతో వస్తావా అంటే వస్తుందా
నువ్వే రా.. అంటూ తనలో కలిపేసుకుంటుంది

కానీ... ఏంటో నా పిచ్చి మనసు
ఆమె మనసు తెలుసుకోవాలంటోంది..
మగువ మనసులో ఊసులను అన్వేషిస్తోంది
ఊహల్లో అగాధం తవ్వుతోంది...
ఏమైనా దొరికిందా.. ఆ దొరికింది.. మరికొంత లోతు

ఒక్కోసారి ఆమె కళ్లు మాటాడుతుంటాయి
మరోసారి కనురెప్పలే ఏవో చెప్తుంటాయి
కాలిబొటనవేలు కూడా శృంగారనైషధం రాయగలదు
క్రీగంట చూపు లక్ష చిక్కుముడులు వేయగలదు...
అర్ధాలు వెతకాలని పరుగులు తీశా...
దొరికింది.. ఎప్పటికీ బదులు లేని ఓ చిక్కు ప్రశ్న

విశ్వాంతరాళ అంచుల అంతు తేల్చొచ్చు
ఆ నిశీధిని నిలువునా చీల్చొచ్చు..
ఆమె మనసు పిడికిలి గుట్టు విప్పగలమా
అతి కష్టం మీద విప్పి చూశాను... ఏముంది
అక్కడ మరో అగాధం...
చేతనైతే లోతు కొలవమంటూ వెక్కిరించింది...

తన ప్రేమనంతా నిజంగా పంచాలని వస్తే
తట్టుకునే శక్తి ఈ సృష్టిలో దేనికీ లేదు...
మరి రోజూ కనిపించే ప్రేమేమిటీ... నిజం కాదా
ఏమో... ప్రేమిస్తున్నట్టే ఉంటుంది.. లేనట్టూ ఉంటుంది
ఆ రహస్యం అడిగితే నవ్వేసి వెళ్లిపోతుంది

నవ్వుతూనే విషాదాన్ని భరిస్తుంది
నవ్విస్తూనే దుఃఖాన్ని దిగమింగుతుంది
ఆనందాన్ని మాత్రం మౌనంగా అనుభవిస్తుంది
బాధ లేదూ... అంటే... మరో నవ్వునవ్వి
కన్నీటి చుక్కనొకటి చెక్కిలిపై జార్చింది
పట్టుకునే లోపే... అదీ అగాధంలోకి జారిపోయింది
నా మనసు పట్టుకోలేవని మళ్లీ వెక్కిరించింది.

కలకరిగిపోతే కన్నీరవుతుందా...
మనసుకి ముళ్లగాట్లు చేస్తే కన్నీరు జారుతుందా
లేదా ఆనందం ఎక్కువై పెల్లుబుకిన ఆనవాలా...
ఆ కన్నీటి చుక్కనైనా అడుగుదామంటే.. చేజారిందే
ఆ చుక్క... ఆమెలో ఇన్నాళ్లూ నలిగిపోయిందేమో
నవ్వేేసి... ఆ వివరం అడగొద్దని స్వేచ్ఛగా ఎగిరిపోయింది

నా ఊహకు రెక్కలొస్తే ఆమె మనసు
లోతుల్లో విహారిస్తాను...
ఆలోచన పొరల్లో ఒక్క అణువునైనా పట్టుకుంటాను
నా కళ్లలో ఆమె రూపాన్ని బంధించగలిగాను
కానీ... ఆమే గెలిచింది..
తన మనసు నీడను కూడా తాకలేకపోయాను































19 నవంబర్, 2013

పచ్చిక బయళ్లలో ముత్యాల జల్లు.. కోకిల వేణుగానం

స్వాతిచినుకుకి నమ్మకం
సంద్రం మనసు గెలవగలనని
అందుకే అంత సంద్రాన్నీ ఈదింది
ముత్యపు చిప్పులో ఒదిగి ముత్యమైంది

గడ్డిపరకకు తెలుసు తన బలమెంతో
అంత పెద్ద భూమాత మనసేంటో
అందుకే భూమినే చీల్చుకుని వచ్చింది
భూమాతకు పచ్చదనాల పసిడి చీరకప్పింది

కోకిలకు తెలుసు తన పాటేంటో
నలుపైతేనేం నల్లనయ్య కాదా అనుకుంది
మావిచిగురుతో స్నేహం చేసింది
కూకూ అంటూ సరిగమలకే పాఠాలు నేర్పింది

ఒదగి ఉండలేనే అనుకోలేదు వెదురు
వాయువునే అలింగనం చేసుకుంది
పదహారు వేలమందికి సాధ్యం కానిది... 
వేణువై మాధవుడినే వశం చేసుకుంది





7 నవంబర్, 2013

ఈ ప్రశ్నలకు బదులివ్వొద్దు...

భావోద్వేగాలంటే ఏంటి..
మనోభావాలు అంటే ఏంటి..
అవెందుకు వస్తాయి...
అంసంతృప్తితోనా, విద్వేషంతోనా..

అసంతృప్తికి సంతృప్తి సమాధానం
విద్వేషానికి ప్రేమ సమాధానం
మరి తెలిసీ అవెందుకు వస్తాయి
తెలిసీ తెలియనట్టు నటనలెందుకు వస్తాయి

అసలు శత్రువులెవరు..
మనుషులా... ఆలోచనలా
మనుషులే అయితే ఎలాంటి మనుషులు
ఆలోచనలే అయితే ఎలాంటి ఆలోచనలు


మనుషులు నిలబడేది ఎక్కడ
కూలిపోతే కాలేది ఎక్కడ
మట్టి మనుషులను పెంచలేదా
మరి మనుషులు మట్టిని పంచుకుంటున్నారెందుకు

ప్రాంతాలు పంతాలు పెంచుతాయా
పంతాలు పంపకాలు కోరుతాయా
పంపకాలు మనుషులను విడదీస్తాయా
లేక మనుషులే మనుషులను విడదీస్తున్నారా

కొన్నేళ్లుగా తొలిచేస్తున్న సందేహాలివికొన్నాళ్లుగా  నలిపేస్తున్న ప్రశ్నలివి
కానీ.. సమాధానాలు ఎవరూ చెప్పొద్దు
ప్రశ్నలే బాగున్నాయి... బదుళ్లు మెదళ్లు తొలుస్తాయి

27 ఏప్రిల్, 2013

అష్టవిధనాయికా... బృందావన మరీచిక

నిన్నో మిత్రుడు అష్టవిధనాయికల గురించి అడిగాడు. బిజీబిజీగా పనిచేస్తున్న నాకు.. అష్టవిధనాయికల వైపు దృష్టి వెళ్లిపోయింది. ఆ నాయికలు వారి హావభావాలు సుడిగుండంలా నన్ను చుట్టేసి ఏదో అసువుగా ఓకవితావేశాన్ని సృష్టించేశాయి.


ప్రేయసీ.. ప్రతి రోజూ తొలిరేయనిపించే
ముగ్దమనోహర చంద్రవదన... 
ప్రవరాఖ్యునికే మన్మధ శరమా
నా తలపులలో నీ ఎడబాటు
చూడవలెనని.. తీయని బాధకు
నిను గురిచేయవలెనని కుట్రచేసినానే చెలి
వెన్నెల కురిసిన.. వలపుల వేళ
నీ చెంత చేరక నే జాగు చేసీ.. చేసిన వేళ
ఎదురు చూపుల్లో అలసి సొలసి 
నీ కనులు సోలి... తూలిన వేళ
వచ్చినానే చెలి.. చూశాను నీ భంగిమలో
విరహాగ్నిని... అందున నాపై అసలు వలపుని
విరహోతఖంటిత...!!!

నీపై వలపు జల్లులు కురిపించిన
ఈ మనసు మరో చిన్నదాని వంక
క్రీగంట చూడగనే నీ మదిలో ఎంత కలకలం
ఊరికినే నిన్నుడికించ... నీ కన్నులలో
ప్రేమాగ్రహోదకాన్ని కురిపింపవలెనని
చేసిన కుట్రకు క్షంతవ్యుడను...
ఆ చిగురుబోడితో సరసనాటకమాడితినని
అంతలోనే అలకబూని.. దరిచేరక 
విరహాగ్ని రేపకే... నా ఖండిత నాయిక...!!!

నా గోడు పట్టదని అలకబూనేవు..
నాకు వంత పాడవని నిష్టూరమాడేవు
సత్యభామలా మూతిముడుచుకునేవు
కొంగుపట్టుకు తిరగాలన్న మాట
మదిని దాటనీయలేక... విలవిలలాడేవూ
అంతరార్థమర్ధమైనా.. అర్ధమవనట్టు
నేనుండ... తెగ విసవిసలాడేవూ..
నా ప్రేమ పరవశాన్ని పెనవేసుకునేందుకే
కాదా... నేను మాత్రం... పంతం బట్టేను గానీ
నిను కాదనగలనా... హన్నన్న..
రేయిముసుగులో... పరువాల వాకిట
నీ బానిసనే కాదే... నా స్వాధీన పతిక

అనుక్షణం నీ తపనలతో రగిలిందే
నా మనసు... అక్కడ నీకూ అటులనే కదా
నాకు తెలుసు... విధివశాత్తు నీకు నాకు
నడుమ ఇన్ని రోజుల అగాధమా..
ప్రతీ క్షణమూ యుగమై.. భారమై.. నినునను
విడదీసే శత్రువై... ఓ కాలమా కరిగిపొమ్ము
ఈ విరహవేదన నే జాలలేను... నా సఖిని
ఎడబాటులో బలిచేయలేను.. కనులారా
క్షణాలతో యుద్ధం చేసి.. నిమిషాలను కడతేర్చి
గంటల పనిపట్టి.. రోజులు కరిగించి నా తలపుల్లో
ఇన్నాళ్లు నిరీక్షణ శిక్ష వేసినందుకు... ఓ ప్రోషిత పతిక
వస్తున్నా ఇదిగో... నులివెచ్చని పూలపడకింట.. మరుల గొలుపు
సౌగంధికా... నీ దాసుడను... వేయగలవు.. మధురమైన శిక్ష

అచటిచటెచటంటే అచటకే వచ్చి అచ్చట 
ముచ్చట తీర్చితిని కదే... విరహసరస
అయిన.. అచటకెందుకు రాలేదని
మూతిముడుపెందుకే అలకల చిలక
కాటుక కనులు కలువల మొలక
ఇంతంటే చాలు అంతంత అలిగి
కడివెడు కన్నీళ్లతో నా మనసున
కళ్లాపి చల్లి... విలవిలలాడకే... విప్రలబ్ధ
నీకు తెలుసో లేదో... మనసు పడ్డ
సుందరాంగి.. కొంగు వెంటే మగడుంటాడని
తెలుసుకోవే... రంగవలిక

జామురాతిరి నీవనుకునికి పరపడతిని
బాహువుల బంధించితి... చింతించితి
తప్పు తెలిసి తడబడి ఉరికి ఒక్క చెంగున
ఇంటపడక ముందే నీ కంటపడితి..
అహో నా ఖర్మకాలి... నాపై ఎంత గాఢమైన
ప్రేమ నీకు.. పరస్పర్శా ఊహే నీకు పరమ కంపరము
అసలు కథ చెప్పిన వినకే.. మొదటే అనుమానము
తగదే... అనుమాన వనిత... కలహాంతరిత.
నిజము తెలిసి... అనుమానించితినే అని.. 
బాధపడి.. బెంగ పడి.. వలవల ఏడపెందుకే లలన..
నా అలక తొలగించ నీ కన్నీటికి సాధ్యమాయేనా..
అధరామృతాలను గ్రోవితే గానీ... నా బాధ తీరునా...

ఆహా.. ఏమిది.. పున్నమి జాబిలి నేలకు వచ్చినదా
వెన్నెల ఆకారం దాల్చి నా ముందు నిలిచెనా..
మరులు కూర్చిన మన్మధ శరమా..
నడివచ్చిన శృంగార నైషధమా..
బృందావన మరీచికా.. అభిసారిక..
నీవు వచ్చెవరకు నేను రానని 
పోటీ పెట్టకే సగభాగమా..
కాస్త.. అలకల ఆటలు సాగినా...
ఓటమి ఖాయం.. అందాన్ని బంధింప
నేనే నీ చెంతకు పరుగున వచ్చెద... 

అష్ట విధ నాయికలు, జనార్ధనాష్టకం.. ఈ రెండు పెదబాలశిక్షల్లో ఎప్పుడో చిన్నప్పుడు చదివినపుడు
తెలియలేదు. కానీ.. ఇప్పుడు తెలుస్తోంది. ఆ నాయికలను తలచుకుంటేనే కవితలు ఉప్పొంగుతున్నాయి. మన సాహిత్యం శక్తి అలాంటింది. 

విరహోతఖంటిత
భర్త  చెప్పిన వేలకు రాలేదని ఆలస్యమునకు తహతహలాడి మనసంతా రకరకాల ఆలోచనలతో గడిపే స్త్రీ .

ఖండిత  నాయిక
తన  భర్త రాత్రంతా పర స్త్రీతో సంభోగించి రతి చిహ్నాలతో కనబడిన మగడిని చూసి దుఖించే స్త్రీ.

స్వాధీన  పతిక
తాను  చెప్పినట్లు విని , నడుచు కునే భర్త గల స్త్రీ.

ప్రోషిత  పతిక
దూరం లో ఉన్న భర్తను తలుచుకుంటూ విరహం తో రగిలి పోయే స్త్రీ. వాస్క  సజ్జిత దూరాన ఉన్న భర్త చాలా కాలం తర్వాత వస్తున్నపుడు పడక గదిని అలంకరించి భర్త రాక కోసంవిరహంతో ఎదురు చూసే స్త్రీ.

విప్రలబ్ధ
రమ్మన్న చోటికి ప్రియుడు రాకపోతే విరహం తో బాధ పడే స్త్రీ .

కలహాంతరితభర్త ఎంత చెప్పినా వినకుండా అనుమానించి చివరకు తప్పని తెలుసుకొని భాద పడే స్త్రీ.

అభిసారిక
అందంగా  అలంకరించుకొని ప్రియుడి దగ్గరకు వెళ్ళేది, లేదా తన వద్దకే ప్రియుడిని రప్పించుకోనే స్త్రీ.



23 ఏప్రిల్, 2013

యుగాంత సంకేతాలొస్తున్నాయి....

నా టైటిల్ చూసి... నేను మూర్ఖుడునని భావించొద్దు. ఎందుకంటే కుహనా మేధావులు, నాస్తికవాదులు
భూమికి కోట్ల సంవత్సరాల ఆయుర్ధాయం ఉంది. ఏం కాదు అని చెప్తున్నారు. ఆ విషయం చిన్నపిల్లలకు
కూడా తెలుసు. భూమికి కోట్ల సంవత్సరాల ఆయుష్షు ఉంది. నిజమే కానీ మనిషికి.
ఒక్కసారి మహాభారత యుద్ధానంతర పరిస్థితుల్లోకి వెళ్తాను. పైన చెప్పిన దానికి దీనికి లింకేంటి అంటారా.
ఉంది. ద్వాపర యుగం ముగియడానికి సరిగ్గా సంవత్సరం ఉందనగా... ప్రజల జీవన సరళిలో పెనుమార్పులు.
అప్పటి వరకు రుషులు మునులను ప్రజలు దాదాపు దేవుళ్లగానే చూశారు.. అలాంటి మునొకరొస్తే..
సాంబడు ఆడ వేషం వేసుకుని ఆటపట్టిస్తే... ముసలం పుడుతుందని శపించి వెళ్లిపోతాడా ముని.
ఆ తర్వాత సాంబడు ముసలాన్ని కని చస్తాడు. అప్పుడే ద్వాపర యుగాంత సంకేతాని బలరాముడు
గ్రహిస్తాడు. అంతవరకు నందనవనంలా ఉన్న బృందావనిలో అరాచకరాజ్యాన్ని చూడలేక ఆత్మార్పణ
చేసుకుంటాడు. ఒకనాడు భారత యుద్ధ విజయోత్సాహంలో యాదవులు పండుగ చేసుకుంటారు.
అందులో కౌరవ పక్షం వహించిన కృతవర్మ లాంటి యాదవరాజులను ఆహ్వానిస్తారు. తప్పతాగి
చిందులేస్తున్న సమయంలో... వీరత్వాల మీద మాటమాట పెరిగి యాదవుల మధ్య తగాదా పుడుతుంది.
అది ఒకరి తలలు ఒకరు నరుక్కుని.. ఏకంగా యాదవ రాజ్యమే నశించిపోయే దాక వెళ్తుంది. శ్రీకృష్ణుడు అంటే
రాసలీలలు, వేణుగీతాలు ఇవే కనిపిస్తాయి. కానీ తన జాతంతా ఒకరినొకరు నరుక్కుంటుంటే చూడ్డం తప్ప
అంతటి భగవంతుడే ఏమీ చేయలేకపోయాడు. దైవత్వం లేని ఓ నరుడిలా నిశ్చేష్టగా నిలబడి.. యాదవ
రాజ్యం పతనాన్ని రెండు కళ్లతో చూశాడు. కొంతమందినైనా కాపాడమని అర్జునుడిని బతిమాలుకున్నాడు. ఆ తర్వాత అడవులు పట్టిపోయి... నిర్యాణం కోసం ఎదురుచూశాడు. అంటే దాదాపు ఆత్మహత్య.
ఆ కొంతమందినైనా అర్జునుడు కాపాడగలిగాడా అంటే లేదు. 18 అక్షౌహినుల సైన్యాన్ని చెడుగుడు ఆడిన
అర్జునుడి ధైర్యం.. శ్రీకృష్ణుడిని దైవత్వం త్యజించగానే పోయింది. గాండీవం చచ్చబడింది. దుండగులు
యాదవ వనితలను దోచుకుంటుంటే.. ఆపలేక చేతులెత్తేశాడు. ఇది జరిగిన మర్నాడే ద్వారక సముద్రంలో మునిగింది. బోయవాడి విల్లుకి, బొటనవేలిలో ప్రాణాలు పెట్టుకున్న శాపగ్రస్తుడు శ్రీకృష్ణుడుకి దిక్కులేని మరణం 
సంభవించింది. శ్రీకృష్ణుడి అవతారంలో కలి ప్రవేశించిన అంతిమ క్షణాలు ఒళ్లుగగొర్పుడిచే విధంగా, ఆఖరికి తనవాళ్లకు కనీసం తన పార్ఠీవ దేహం కూడా దక్కని విధంగా అత్యంత దుఃఖభరితంగా ఉంటుంది. ఇదంగా జగన్నాటకమే కావొచ్చు. కానీ నిజం. అలా  ఓ అవతారాన్ని మింగి వచ్చింది కలియుగం. ఇప్పుడు అసలు కథలోకి వస్తాను. యుగాంతం అంటే 2012 సినిమాలో చూపించిన విదంగా భూమి పేలిపోడం కాదు. మనిషి మనిషిని
కబళించిన రోజే యుగాంత సంకేతం. ఒక యాభై ఏళ్ల క్రితం, ఇప్పుడు పోల్చి చూడండి. నేరాల తీవ్రత, స్వభావం ఎలా మారిందో. ఐదేళ్లు నిండని ఓ పసిపాపలో ఏ కామాన్ని వెతుక్కున్నారో... ఆ నీఛులు. ఇంత కన్నా ఏం కావాలి యుగాంత సంకేతాలు. ఆడది కనిపిస్తే కబళిస్తున్నారు. వయసుతో సంబంధం లేని కామోన్మాదం.
మనిషిలో మనిషి చచ్చిన నాడు.. యుగం అంతమైనట్టే. ఇప్పుడా సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ముందు గడిచిన యుగాల్లోనూ రాక్షసులున్నారు. కానీ వారు కూడా కొంత నీతి పాటించారు.
 ఇప్పటి మనిషి రాక్షసుడి కంటే క్రూరుడు. అది ఉన్మాద స్థాయికి చేరింది. లింగ వివక్ష వల్ల అబార్షన్లు అవుతున్నాయి. లక్షల ఆడపిల్లలు భూమ్మీద పడకుండానే గర్భస్త దశలోనే చస్తున్నారు. మొగుళ్లు, అత్తమామలు
చంపుతున్నారు. ఇది ఒక కోణం... ఇప్పుడు మరో కోణం కనిపిస్తోంది. జర్నలిస్టుగా కొందమంది మహిళలతో ముఖతా నేను మాట్లాడాను. అందులో కొందరు గర్భిణిలు ఉన్నారు. వారంతా ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్న వారే. కానీ.. వాళ్లలో తెలియని భయం. ఇప్పుడే ఇలా ఉంటే.. ఓ పదేళ్ల తర్వాత.. సమాజం ఇంకెంత క్రూరంగా ఉంటుందో. ఆడపిల్లలను సురక్షితంగా పెంచే, వారికి ఏ గాయమూ తగలకుండా రక్షించగలమా అనే ఆలోచన. మన దేశం మహిళలకు రక్షణ సున్న అని ఎల్కేజీ పిల్లాడికి కూడా తెలుసు. మరి ఇలాంటి క్రూరమైన మనస్తత్వాలు
పెరుగుతున్నప్పుడు... మనిషి బతకడం కష్టమే. తండ్రి కొడుకులు వావి వరసలు మరిచి మద్యం మత్తులో రక్త
సంబంధాన్ని చెరుస్తున్న రోజులివి. ఢిల్లీ ఘటన తర్వాత.. అత్యాచారాల సంఖ్య మరీ పెరగడం దేనికి సంకేతం.
ఇన్నాళ్లు బయటపడలేదు. మీడియా ఫోకస్ పెరిగాక లెక్కలు తెలుస్తున్నాయన్న మాట సరికాదు. నిజంగానే పెరిగాయి. అసలు ఆడపిల్లే లేకపోతే.. వారిని నిర్ధాక్షిణ్యంగా కడతేరుస్తుంటే.. సృష్టే లేదు. ఇక యుగమో లెక్క.
ఆనాడు ద్వాపర యుగాంత సమయంలో మరీ ఇంత దారుణాలు లేవు.. వాటినే భగవంతుడు ఆపలేక
అడవులు పట్టాడు. ఇప్పుడున్న దారుణమైన పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు కాదు కదా.. ముక్కోటి దేవతలు
ఏకమైనా.. ఈ మనిషిని మార్చలేరు.





17 ఏప్రిల్, 2013

రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ్ పురస్కారం

అక్షరాలను ఇలా కూడా కూర్చొచ్చుకే.. రావూరి కవితలు కొన్ని.. కవితలను ఇలా కూడా రాయొచ్చు.
నిశీధిలో కూడా వెలుతురు తురుముని కవి గాంచగలడని నిరూపించి
ఎందరికో ఆదర్శప్రాయుడైన గురుసమానులు రావూరి భరద్వాజ.
ఆయన గురించి నేనేవో కవితలు రాసి వర్ణించే కన్నా.. ఆయన రాసిన
అద్భుతాలనే నెమరు వేసుకుంటే మంచిది కదా.. అందుకే ఆయన అక్షరాలతోనే అభినందనలు చెప్పే సాహసం చేస్తున్నాను

ఏదీ నాది కాదు - రావూరి భరద్వాజ

"నీకు సంతృప్తి కావాలా? అసంతృప్తి కావాలా?" అన్నారు ప్రభువు ఉదయపు నడకలో.
"అసంతృప్తి" అన్నాను.
ప్రభువు ఆశ్చర్యంగా చూశాడు నావేపు.
"ఉన్న చోటనే ఉండి పొమ్మంటుంది సంతృప్తి. మునుముదుకు నడిపిస్తుంది అసంతృప్తి" అన్నాను.
ప్రభువు నా వీపు తట్టాడు!
ఎందుకో తెలీదు.
******************************

"నన్ను మండించాలని నీవూ, నిన్ను మసి చేయాలని నేనూ, సహస్ర సహస్రాబ్దాలుగా తంటాలు పడుతున్నాం.
నేను మండిపోనూ లేదు;నీవు మసి కుప్పగానూ మారిపోలేదు.
హోరాహోరీ పోరాటం అనంత కాలాల దాకా, అవిచ్చిన్నంగా
సాగుతూనే ఉంటుంది" అన్నది ఆ అంధకారం, దూరం నించి వస్తోన్న వెలుతురు వేపు చూస్తూ.

******************************

"వూవు నయిపోదామన్న ఉత్సాహంతో తీగ మీద వాలాను.
నేనంటే గిట్టని చివురాకు నన్ను కిందకి తోసేసింది" అన్నదా వాన చినుకు.
దెబ్బ తగిలిందా చిన్నా!" అంటూ ఆ చినుకును మెత్తగా హత్తుకున్నదో మట్టిబెడ్డ.

******************************

"తెల్లగా, చల్లగా, మెల్లగా పోతూపోతూన్నవారు కాస్తా;హఠాత్తుగా
ఆగిపోయారెందుకు? కళ్ళు చికిలించి కిందికి చూస్తున్నారెందుకు?" అన్నదో గోరింక.
"పల్లెకు దూరంగా ఉన్న, ఆ పూరింటి ముందు, ఓ అమ్మాయిగారు, అద్దం
పుచ్చుకొని నుంచున్నారు. అందులో ప్రతిఫలిస్తున్నది నా ముఖమో, అమ్మాయిగారి
ముఖమో తేల్చుకోలేక ఆగిపోయాను" అన్నాడా పున్నమి చంద్రుడు!

*****************************