Powered By Blogger

23 ఏప్రిల్, 2013

యుగాంత సంకేతాలొస్తున్నాయి....

నా టైటిల్ చూసి... నేను మూర్ఖుడునని భావించొద్దు. ఎందుకంటే కుహనా మేధావులు, నాస్తికవాదులు
భూమికి కోట్ల సంవత్సరాల ఆయుర్ధాయం ఉంది. ఏం కాదు అని చెప్తున్నారు. ఆ విషయం చిన్నపిల్లలకు
కూడా తెలుసు. భూమికి కోట్ల సంవత్సరాల ఆయుష్షు ఉంది. నిజమే కానీ మనిషికి.
ఒక్కసారి మహాభారత యుద్ధానంతర పరిస్థితుల్లోకి వెళ్తాను. పైన చెప్పిన దానికి దీనికి లింకేంటి అంటారా.
ఉంది. ద్వాపర యుగం ముగియడానికి సరిగ్గా సంవత్సరం ఉందనగా... ప్రజల జీవన సరళిలో పెనుమార్పులు.
అప్పటి వరకు రుషులు మునులను ప్రజలు దాదాపు దేవుళ్లగానే చూశారు.. అలాంటి మునొకరొస్తే..
సాంబడు ఆడ వేషం వేసుకుని ఆటపట్టిస్తే... ముసలం పుడుతుందని శపించి వెళ్లిపోతాడా ముని.
ఆ తర్వాత సాంబడు ముసలాన్ని కని చస్తాడు. అప్పుడే ద్వాపర యుగాంత సంకేతాని బలరాముడు
గ్రహిస్తాడు. అంతవరకు నందనవనంలా ఉన్న బృందావనిలో అరాచకరాజ్యాన్ని చూడలేక ఆత్మార్పణ
చేసుకుంటాడు. ఒకనాడు భారత యుద్ధ విజయోత్సాహంలో యాదవులు పండుగ చేసుకుంటారు.
అందులో కౌరవ పక్షం వహించిన కృతవర్మ లాంటి యాదవరాజులను ఆహ్వానిస్తారు. తప్పతాగి
చిందులేస్తున్న సమయంలో... వీరత్వాల మీద మాటమాట పెరిగి యాదవుల మధ్య తగాదా పుడుతుంది.
అది ఒకరి తలలు ఒకరు నరుక్కుని.. ఏకంగా యాదవ రాజ్యమే నశించిపోయే దాక వెళ్తుంది. శ్రీకృష్ణుడు అంటే
రాసలీలలు, వేణుగీతాలు ఇవే కనిపిస్తాయి. కానీ తన జాతంతా ఒకరినొకరు నరుక్కుంటుంటే చూడ్డం తప్ప
అంతటి భగవంతుడే ఏమీ చేయలేకపోయాడు. దైవత్వం లేని ఓ నరుడిలా నిశ్చేష్టగా నిలబడి.. యాదవ
రాజ్యం పతనాన్ని రెండు కళ్లతో చూశాడు. కొంతమందినైనా కాపాడమని అర్జునుడిని బతిమాలుకున్నాడు. ఆ తర్వాత అడవులు పట్టిపోయి... నిర్యాణం కోసం ఎదురుచూశాడు. అంటే దాదాపు ఆత్మహత్య.
ఆ కొంతమందినైనా అర్జునుడు కాపాడగలిగాడా అంటే లేదు. 18 అక్షౌహినుల సైన్యాన్ని చెడుగుడు ఆడిన
అర్జునుడి ధైర్యం.. శ్రీకృష్ణుడిని దైవత్వం త్యజించగానే పోయింది. గాండీవం చచ్చబడింది. దుండగులు
యాదవ వనితలను దోచుకుంటుంటే.. ఆపలేక చేతులెత్తేశాడు. ఇది జరిగిన మర్నాడే ద్వారక సముద్రంలో మునిగింది. బోయవాడి విల్లుకి, బొటనవేలిలో ప్రాణాలు పెట్టుకున్న శాపగ్రస్తుడు శ్రీకృష్ణుడుకి దిక్కులేని మరణం 
సంభవించింది. శ్రీకృష్ణుడి అవతారంలో కలి ప్రవేశించిన అంతిమ క్షణాలు ఒళ్లుగగొర్పుడిచే విధంగా, ఆఖరికి తనవాళ్లకు కనీసం తన పార్ఠీవ దేహం కూడా దక్కని విధంగా అత్యంత దుఃఖభరితంగా ఉంటుంది. ఇదంగా జగన్నాటకమే కావొచ్చు. కానీ నిజం. అలా  ఓ అవతారాన్ని మింగి వచ్చింది కలియుగం. ఇప్పుడు అసలు కథలోకి వస్తాను. యుగాంతం అంటే 2012 సినిమాలో చూపించిన విదంగా భూమి పేలిపోడం కాదు. మనిషి మనిషిని
కబళించిన రోజే యుగాంత సంకేతం. ఒక యాభై ఏళ్ల క్రితం, ఇప్పుడు పోల్చి చూడండి. నేరాల తీవ్రత, స్వభావం ఎలా మారిందో. ఐదేళ్లు నిండని ఓ పసిపాపలో ఏ కామాన్ని వెతుక్కున్నారో... ఆ నీఛులు. ఇంత కన్నా ఏం కావాలి యుగాంత సంకేతాలు. ఆడది కనిపిస్తే కబళిస్తున్నారు. వయసుతో సంబంధం లేని కామోన్మాదం.
మనిషిలో మనిషి చచ్చిన నాడు.. యుగం అంతమైనట్టే. ఇప్పుడా సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ముందు గడిచిన యుగాల్లోనూ రాక్షసులున్నారు. కానీ వారు కూడా కొంత నీతి పాటించారు.
 ఇప్పటి మనిషి రాక్షసుడి కంటే క్రూరుడు. అది ఉన్మాద స్థాయికి చేరింది. లింగ వివక్ష వల్ల అబార్షన్లు అవుతున్నాయి. లక్షల ఆడపిల్లలు భూమ్మీద పడకుండానే గర్భస్త దశలోనే చస్తున్నారు. మొగుళ్లు, అత్తమామలు
చంపుతున్నారు. ఇది ఒక కోణం... ఇప్పుడు మరో కోణం కనిపిస్తోంది. జర్నలిస్టుగా కొందమంది మహిళలతో ముఖతా నేను మాట్లాడాను. అందులో కొందరు గర్భిణిలు ఉన్నారు. వారంతా ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్న వారే. కానీ.. వాళ్లలో తెలియని భయం. ఇప్పుడే ఇలా ఉంటే.. ఓ పదేళ్ల తర్వాత.. సమాజం ఇంకెంత క్రూరంగా ఉంటుందో. ఆడపిల్లలను సురక్షితంగా పెంచే, వారికి ఏ గాయమూ తగలకుండా రక్షించగలమా అనే ఆలోచన. మన దేశం మహిళలకు రక్షణ సున్న అని ఎల్కేజీ పిల్లాడికి కూడా తెలుసు. మరి ఇలాంటి క్రూరమైన మనస్తత్వాలు
పెరుగుతున్నప్పుడు... మనిషి బతకడం కష్టమే. తండ్రి కొడుకులు వావి వరసలు మరిచి మద్యం మత్తులో రక్త
సంబంధాన్ని చెరుస్తున్న రోజులివి. ఢిల్లీ ఘటన తర్వాత.. అత్యాచారాల సంఖ్య మరీ పెరగడం దేనికి సంకేతం.
ఇన్నాళ్లు బయటపడలేదు. మీడియా ఫోకస్ పెరిగాక లెక్కలు తెలుస్తున్నాయన్న మాట సరికాదు. నిజంగానే పెరిగాయి. అసలు ఆడపిల్లే లేకపోతే.. వారిని నిర్ధాక్షిణ్యంగా కడతేరుస్తుంటే.. సృష్టే లేదు. ఇక యుగమో లెక్క.
ఆనాడు ద్వాపర యుగాంత సమయంలో మరీ ఇంత దారుణాలు లేవు.. వాటినే భగవంతుడు ఆపలేక
అడవులు పట్టాడు. ఇప్పుడున్న దారుణమైన పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు కాదు కదా.. ముక్కోటి దేవతలు
ఏకమైనా.. ఈ మనిషిని మార్చలేరు.





4 కామెంట్‌లు:

  1. "మనిషిలో మనిషి చచ్చిన నాడు.. యుగం అంతమైనట్టే...."
    I AGRRE WITH YOU TOTALLY....

    యుగాంతం రాకున్నా మనమే తెచ్చుకోగలము...

    రిప్లయితొలగించండి
  2. మీ అవేదనతో కూడిన ఆలోచనలో అర్థం ఉంది. కాకపోతే "యుగపురుషుడు" రాకుండానే "యుగం" ఎలా అంతమవుతుంది? మీరు చెప్పే "యుగ సిద్దాంతం" ప్రకారం!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాముడు, శ్రీకృష్ణుడు.. ఎలా పుట్టారో అలాగే... మనిషిలో మనిషి చచ్చినపుడు... దానవుడవుతాడు. దానవ సంహారానికి యుగపురుషుడు.. ఈ సారి ఎక్కడో ఓ చోట కాదు.. దానవులున్నచోటల్లా పుట్టి.. ప్రక్షాళన చేస్తాడు

      తొలగించండి