Powered By Blogger

6 సెప్టెంబర్, 2015

నువ్వొక రక్తాశ్రువు...






                           ఈ లోకంలోకి వస్తానని నువ్వనలేదు....
                           ఈ లోకం నుంచి వెళ్తాననీ నువ్వనలేదు.....
                           మనిషిని మనిషే పీక్కు తినే లోకంలో....
                           మతోన్మాదం మత్తెక్కిన కాలంలో
                                నువ్వొక రక్తాశ్రువు.......

                         ఉగ్రవాద ఉన్మాద హననంలో.....
                         మానవత్వం నశించిన మారణ హోమంలో.....
                         తుపాకీ చప్పుళ్ల మధ్య అనాగరిక నిశ్శబ్దంలో.....
                         తూట్లు పడిన పుడమి కన్నీటి సంద్రంలో....
                                 నవ్వొక రక్తాశ్రువు.......

                        నీ మతమేదో నీకే తెలియని వయసు.....
                        ఉగ్రవాదమన్న మాటే వినలేదు............
                       అమ్మ పరుగులు తీస్తే ఎందుకో అర్థం కాలేదు......
                       ఆడుకోడానికే అనుకున్నావో ఏమో.... బలైపోయావు.......
                                  నువ్వొక రక్తాశ్రువు.......

                       నిర్మల సాగరంలో వటపత్రశాయిలా.....
                       ఇసుక తిన్నెల్లో హాయిగా నిదురిస్తున్నావనుకున్నాను......
                       తిరిగిరాని లోకాలకు వెళ్లావా చిన్నారి నేస్తమా.......
                       ఉగ్రోన్మాద వికృత చేష్టకు సమిధవయ్యావా......
                       అవును.... నువ్వొక రక్తాశ్రువు

                       ఇప్పుడెక్కడున్నావు..........?
                       దేవుడే ఉంటే ఆ దేవుడి ఒడిలోకి చేరావా?
                       మానవత్వం కోసం లోకాలు వెతుకుతున్నావా ?
                       గుండెపగిలిన అమ్మ కన్నీటిగా మారావా ?
                       ఎక్కడున్నా.... మా గుండెల్లో ఎప్పటికీ
                              నువ్వొక రక్తాశ్రువు....




20 ఆగస్టు, 2015

అందరికీ ఇదే ఆహ్వానం






నిన్నటి దారులకు రేపటి వంతెన వేశా
 నేడనే నీడతో బంధాలు పెనవేసి దారి చేశా
ఆశలతో ఊసులాడుతూ ప్రయాణిస్తున్నా
కనులు దాటి వస్తున్న కలలతో పరిగెడుతున్నా

సింధువులో బిందువెలెన్నో ముత్యాలై
నా దారిలో చేరి సుగంధ కుసుమాలై
రెక్కల సవ్వడి చేసుకుంటూ తుమ్మెదలై
నా జీవన పయనంలో వర్ణచిత్రమై కదిలాయి

అత్యాశా వాదినని నన్ను నిందించినా
ఊహాలోక విహారి అని విమర్శించినా
గమ్యం లేని సంచారివని నవ్వుకున్నా
ఆశను బతికించే వైద్యుడనని గర్విస్తున్నా

కథలా కదిలే నా జీవితంలో మలుపులు
సప్తసముద్రల కూడలిలా ఒంపులు
స్వప్నాల దీవిలో స్వర్గాల ద్వారాలు
అందుకే రండి... నా ప్రపంచంలోకి.....

12 ఏప్రిల్, 2015

ఓ జ్ఞాపకం...









ఏనాడో మనసులో మిగిలిన ఓ జ్ఞాపకం

దాదాపుగా మరుపు ఆవహించిన జ్ఞాపకం
కళ్లెదుట నిలిచి గుర్తుచేసిందా జ్ఞాపకం
కాలచక్రాన్ని ఓ పదారేళ్లు వెనక్కు నెట్టిందా జ్ఞాపకం

ఆనాడు తొలిచూపుని ఆకర్షించిన సౌందర్యం
మనసుని మెలిపెట్టి గిలిగింతలు పెట్టిన కోమలం
ప్రతిరోజూ వసంతమే ఆ వదనం
ప్రేమో, వ్యామోహమో.. మొత్తానికి ఓ అనుభవం

వెంటపడిన రోజులు.. క్షణక్షణం మధురం
చిరునవ్వుల బదుళ్లు... పెంచిన విరహం
క్షణమొగ యుగమయ్యే నిరీక్షణల్లో ఏదో మర్మం
యుగమొక క్షణమే ఆమె కనిపించిన తరుణం

ఇరువురికీ తెలియదే.. అది ప్రేమోఏమో
అడిగిన మరుక్షణం ఏదో భయం... కలవరం
నాటి నుంచి నేటి వరకు ఏమైందో ఆ సౌందర్యం
మళ్లీ... కనిపించి మనసుని మెరిపించింది ఆ జ్ఞాపకం

చిరునవ్వులే పలకరింపుగా స్వగతం
కనుచూపులే పరిచయాల ఆలింగనం
చెరో జీవితం.. పక్కనే పేగు బంధం.. 

ఆనాడు ప్రేమో ఏమో... నేడది కచ్చితంగా స్నేహం

జ్ఞాపకాల దొంతరల్లో తిరిగిన కాలచక్రం
ఆనుభవాల ఇరుసుల మీద ఆగని ప్రయాణం
ప్రతి మనసులో ఓ అందమైన  అనుభవం
విజయమో, వైఫల్యమో... అదో తీయని జ్ఞాపకం

‍ 
 

6 సెప్టెంబర్, 2014

ఓ భానూదయాన... చంద్రోదయం


ప్రాతఃకాల సమీర వేళ...
మరీచికా వాయులీనాల శృతిలయ
పురి విప్పిన మయూరిలా...
ఉషాకిరణాల తంత్రులు మీటిన....
ఉదయసంగీత రాగాలాపన...

ఆ సమయంలో...
ఆ నులివెచ్చని  వెలుతురులో...
మరో సౌందర్య భానూదయం...
తడిఆరని కురులు సవరించుకుంటూ
రమణీయ దృశ్య కావ్యం...

కురులు జారిన ఒక్కో నీటి తునక
ప్రభాత సంగమాన  ముత్యాల ముగ్గులే...
ఆ సూర్యుడినీ అడ్డుపెట్టిన నిశీధి కురుల మధ్య
అందమంతా దాచుకుందీ... నా కనులకందకుండా...

పిల్లతెమ్మెరల తాకిడికి రెపరెపలాడి...
కురుల పరదా తొలగినంతనే తొంగి చూశా...
ఆటు సూర్యబింబం... ఇటు పగలే చంద్రబింబం
ఆ వెన్నెల నుదుట మరో అరుణ బింబంలా
ఎర్రాని కుంకుమ బొట్టు... 

ఆ తడిసిన కురుల సుంగంధం...
పరిమళమెంతో మనసుకే తెలుసు...
ఓర చూపున చూస్తున్నాని ఆమెకు తెలుసు..
తెలిసి... తనలో నవ్వుకుని.. అక్కడే ఉండి..
గుండెలు పిండెనే.. ఇది తగునా లలనా...

కురులు పిండిన తడి.. అక్కడక్కడా తగిలి
అక్కడక్కడా తడిసి.. చీర అందం రెట్టింపయ్యే..
ఆ విన్యాసంలో కాస్త వంగి... సిగ్గుతో ఓరకంట..
నను గమనించి... ఠక్కున సవరించుకున్న
సన్నివేశం... మనసుకి రంపపు కోతే...

సవరించుకున్న చీర నడుమున దోపి..
చిరునవ్వులను పెదవి అంచునే దాచి..
చూసి చూడక... ఓరకంట కనిపెట్టి..
సౌందర్యారాధనకు అనుమతిచ్చిన..
ఓ ముగ్దమనోహరా... ధన్యోస్మి...
 
మనసు జంఝాటాలలో 
ఇది తనకో అనుభవం
నా మదికో మధుర సంతకం...




 

4 ఆగస్టు, 2014

నాలో నేను...







నాలో ఉన్న నాలో ఇంకెవరో
ఆ ఇంకెవరిలో ఇంకెందరో...
మనసు పెనవేసిన చిక్కుముడుల..
మనోభావనల సంగమాలలో
ఎందరెందరో... అందరూ కలిస్తే...
మళ్లీ... నేనే... అది నేనే

ఆలోచనల పరవళ్లలో కవిని...
భావావేశాల్లో విప్లవ వీరుడుని..
కదిలిస్తే కలకలం సృష్టించే కలాన్నీ...
స్వప్నంలో బహుదూరపు బాటసారినీ... నేనే

అందాల రాక్షసి ప్రియమైన శత్రువుని
వలపు జల్లుల అల్లరి ప్రేమికుడిని
కన్నీటి తడిని తడిమే స్నేహితుడుని...
మానస వీధుల్లో రాధామాధవుడినీ... నేనే

వెన్నెల జల్లుల్లో వెచ్చని ఒడిని...
వన్నెల ఊసుల్లో నులివెచ్చని తలపుని...
ఒంటరి వ్యాహ్యాళిలో తుంటరి తోడుని...
విషాద లోకంలోనూ చిరునవ్వుని.... నేనే

బంధాల బంధనంలో అనుబంధాన్ని...
పరిచయాల మబ్బుల్లో కరగని జ్ఞాపకాన్ని...
మనసు తెమ్మెరల ఊహల్లో ఊహని...
నీ భావాల విపంచిలో భావాన్వేషిణి... నేనే

నాలో ఇంకెందరో... ఇంకెన్నో...
హరివిల్లు రంగులు, నిశి నీడలు
ఆనందవిషాద భాష్పోత్సేకాలు
అంతంలేని ఆలోచనల చిక్కుముడుల్లో
చిక్కుకున్న నేను... అంతుచిక్కని ప్రవల్హికను...

11 జులై, 2014

స్వప్న ప్రవాసం....
















 అవును.. అతనంటే నాకిష్టం...
అతని వాడి చూపులు వెంటపడ్డాయి
ఆ చూపుల్లో... ప్రేమా నిజమే
ఆ చూపుల వెనుక కన్నీటి చారా నిజమే...

ప్రతిరోజూ నా వెనుకే వస్తాడు
చూపులతోనే పలకరిస్తాడు
ఆ చూపుల్లో నవ్వులు నన్ను పిచ్చెక్కించాయి
అయినా... ఏదో జడత్వం నన్నాపేస్తోంది

గత్మస్మృతుల చేదు అనుభవాలు 
నా ముందరి కాళ్లకు బంధాలు
అయినా... ఆ చూపుల గాలాలు
నా మనసుని వెంటాడుతూనే ఉన్నాయి...

ఆ రోజు... అతను రాలేదు...
ఆ చిరునవ్వుల కనులు కనిపించలేదు
మనసు పరిపరి విధాల పలవరించింది
వద్దనుకున్నావు వెదుకులాట ఎందుకు...
అని ఆ మనసే మళ్లీ వెెక్కిరించింది...

ఆ రోజంతా నేను అక్కడే ఉన్నాను
ఆ చూపులు తగలకుండా వెళ్లాలనిపించలేదు
ఎంతసేపైందో.. ఎదురుచూపులే మిగిలాయి
కళ్లుకాయలు కాచి.. ఇక వెనుదిరిగాను...

నిదుర రాలేదు....మనసు కట్టలు తెంచుకుంది...
అతని ఆలోచనలతోనే నిండి పొర్లిపోయింది
ఎందుకో.. ఏమో... నాకే తెలియని స్థితి
కనిపిస్తే.. ఎందుకు రాలేదు అని కడిగేద్దామన్న పరిస్థితి

మనో భారంతో ఆ రాత్రెలాగో గడించింది..
మరునాడు... ఆత్రంగా బయటకొచ్చాను...
నాకిష్టమైన గులాబీ మొక్క ముందో లేఖ
ఆతృతగా తీసి అతని చూపుల భాష వెదికాను
అవును.. అది అతను రాసిన లేఖే...

'మీ స్వప్న ప్రవాసంలో జీవిస్తున్నా
మనసిస్తారా,  నా ప్రాణం రాసిస్తా'
ఆ లేఖలో  ఈ  రెండే వాక్యాలు... 

ఒక్క అక్షరం కూడా బదులివ్వలేను
కానీ... మనసివ్వకుండా ఎలా ఉండగలను....

‍(ఈ చిత్రం చూసి రాయాలనిపించింది....‌)




8 జూన్, 2014

ఒక స్వప్నం...

ఒక స్వప్నం...

సాయంసంధ్యా గీతంలో నేను లీనమైనప్పుడు
సప్తస్వరాల కౌగిలిలో నేనే వాయులీనమైనపుడు 
శృతిలయల జతులతో నేను రమిస్తున్నప్పుడు...
నా మనసులో అలజడి రేపింది... ఓ ప్రణయ మంజరి

సంధ్యాగీతాల వాయులీనాల శృతులు దాటి
ఆ మంజీర నాదానికి మది పరవశించింది...
మేఘమాల పంపిన ముత్యాల జల్లుల్లో
తడిసి ముద్దవుతున్న ఆ ప్రణయ మంజరి
తన్మయ రూప లావణ్యాన్ని వర్ణించేందుకు
అక్షరాలు పోటీపడుతూ యుద్ధం చేశాయి...
ఆ యుద్ధంలో ఎన్నో అక్షరాలు నేలకొరిగాయి... 
చివరికి మిగిలిన కొన్ని అక్షరాలు రాజీపడి...
పదాబృందాలై... ఆ ప్రణయ లాహిరిని 
కవితా వనంలో... కవన ఝరిలో బంధించాయి

అలజడి జడివానలా చుట్టిముట్టింది నన్ను
కవన వనంలో అక్షర బంధితమైన ఆ జవ్వని
నన్ను చూసి... చిరునవ్వు కానుకిచ్చింది..
ఆ నవ్వు నుంచి జారిన కోటి గులాబీ రేకులు
నా తనువుని కౌగిట్లో ముంచి.. ఉక్కిరిబిక్కిరి చేశాయి

నా అందాన్ని బంధించిన ఈ అక్షరాలను 
ఓడిస్తే... నేను నీ సొంతం...అంది.. 
ఆ లలిత జనిత సౌందర్య నాయిక....

సమ్మోహనాక్షరాల కావ్య మాలికలేవో
నా చుట్టూ పరిభ్రమించాయి...
కోరి వచ్చిన కాంతను అక్షర గంధాలతో
కట్టిపడేయవోయీ... అని మనసుతో అన్నాయి..

ఆ కావ్యనాయికను వర్ణించ అక్షర సాధ్యమా...
సృష్టిలోని పూలరేకులన్నీ ఒక రేకుగా మారి
పారిజాత పూల కొమ్మకు ఒక పూవై పూసినా
ఆమె నగుమోముకి సాటిరావే...అమెని ఏమని వర్ణించను... అని దిగాలు

కోటి సుగంధాల లావణ్యాలను రంగరించినా
ఆమె అధరాల మధురం ముందు దిగదిడుపే...
ఆమె నడుము నయగారాన్ని చూసి 
సన్నజాజి పూల లతలు కూడా చిన్నబోతే
ఆమెను నేనేమని వర్ణించగలను...?

వంద శృంగార నైషధాలు పలికించే
ఆ కనుల సోయగాన్ని ఎలా వివరించను ?
సుమాల తాకిడికే కందిపోతున్న
పరువాల కోమలాన్ని ఏ అక్షరంతో బంధించను ?
మాటమాటకు ముత్యాల పోగులు పడుతుంటే
ఆమెను ఏ మాటతో మురిపించగలను..?

ఇక... ఇది ఒక కలగా అనుకుని
నిరాశగా... వెనుదిరిగాను....
కానీ... కళ్ల ముందు ఆ కావ్యనాయకి..
ఆమెను బంధించిన అక్షరాలు
నా ముందు మోకరిల్లాయి...
ఇంతకన్నా ఎవరు వర్ణించగలరు.. అన్నాయి..

దూరంగా... సాయం సంధ్య వెన్నెలను పంపింది
చందమామ నీడలో... చిరుగాలి సవ్వడికి...
నిచ్చెలి కురులు అలలు అలలుగా తాకుతుంటే..
ఆ తెరల మాటున తన ఆధరగంధం 
నా మేను సింధూరమైంది....

తూరుపు సింధూరంతో కనుల కొలనులో
మధుర స్వప్నం చెదిరిపోయింది...
సుమధుర జ్ఞాపకం మిగిలిపోయింది...
అంతా ఒక స్వప్నం....