Powered By Blogger

22 నవంబర్, 2012

ద్రౌపది మనసు... సముద్రం కన్నా లోతు

అలా మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని దక్కించుకున్నది
అర్జునుడే అని ద్రుపదుడికి తెలిసి సంతోషిస్తాడు. మిగిలిన
కార్యక్రమాల కోసం ఆయన కూడా ఏకచక్రపురానికి వచ్చేందుకు
సిద్ధమవుతాడు. ఈ లోపు లాంఛనంగా సోదర సమేతంగా ఆమెను
తీసుకుని ఏకచక్రపురానికి వస్తాడు.అర్జునుడినే మనసులో
దాచుకున్న ద్రౌపది నిజానికి ఎన్నోకలలతో మెట్టినింటికి వస్తుంది.
కుంతీకి వచ్చింది ద్రౌపది అని ముందే తెలుసు. తెలిసే..
తెచ్చిందేదైనా ఐదుగురూ పంచుకోండని అర్జునుడికి
చెప్తుంది. ఆ మాటకు నిర్ఘాంతపోయిన అర్జునుడి ద్రౌపదిని
చూపిస్తాడు. కానీ.. తల్లి మాటను శిరసా వహించేందుకు
సిద్ధపడతాడు. ద్రుపదుడు మాత్రం మొదట అంగీకరించలేకపోతాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి... వారు పంచపాండవులైనా.. గత జన్మలో
గందర్వులని... ఒక్కొక్కరు ఒక్కో లక్షణం కలిగినవారని.. ఆ లక్షణాలన్నీ
కలిపితే పంచపాండవులు వేరు కారని.. ఒకటేనని... కాబట్టి చింతలేకుండా
ఐదుగురికీ భార్యగా చేయమని కృష్ణుడు ద్రుపదునికి చెప్తాడు. 
అప్పుడే వచ్చిన వ్యాసుడు కూడా పాండవుల గత జన్మ వృత్తాంతం చెప్పి
దృపదుని ఒప్పిస్తాడు. ఇక్కడ గమనించాల్సిందేంటంటే... ఒక్కరు కూడా
ద్రౌపది అభిప్రాయం అడగరు. వ్యాసుడు ఈ విషయాన్ని ప్రత్యేకంగా
ప్రస్తావించాడు. అందరికీ తెలియని మరో విషయం కూడా వ్యాసుడు
రాశాడు. ఏంటంటే.. అర్జునుడు కార్యార్ధియై వెళ్లి ద్రౌపదిని పొందినా..
అమెపై మిగిలిన నలుగురూ ఇష్టపడతారు. కుంతి భయపడుతుంది.
ద్రౌపది కోసం పాండవులు తమలో తాము కలహించుకుంటారేమో అని.
భారతంలో ఈ ప్రస్తావన ఉండటం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.
ద్రౌపది ఇష్ట పూర్వకంగా ఐదుగురిని స్వీకరించలేదు అనేది
స్పష్టం. కుంతీ నిర్ణయం మేరకు ఐదుగురికి భార్య కావాల్సి వచ్చింది
అనేది వాస్తవం. ద్రౌపది మానసిక స్థితిని పెద్దగా వర్ణించకపోయినా
ఆమె ఐదుగురికి ఇచ్చిన ప్రయార్టీల బట్టి.. అసలు భర్తగా ఎవరిని
చూసిందనేది స్పష్టమవుతుంది. ధర్మరాజుని ఆమె ఎప్పుడూ రాజులానే
చూసింది.. భీముడిని ఆప్తుడిగా చూసింది.. నకుల సహదేవులు
బిడ్డల్లా చూసుకుంది. కేవలం అర్జునిడి మాత్రమే ప్రేమికుడిగా
ఆరాధించింది. నిజమైన భర్తగా అర్జునిడిని మాత్రమే చూసిందని
వ్యాస భారతంలో స్పష్టంగా ఉంది. ఇలా ద్రౌపది జీవితమంతా కడగండ్లమయం. పంచకన్యల్లో ఒకరైన పాంచాలి
నిజమైన పతివ్రత. భార్య ఎలా ఉండాలో రుక్మిణి ద్రౌపది దగ్గర నేర్చుకుంటుంది.
మరో విషయం ద్రౌపది తన ఆరో భర్తగా కర్ణుడిని కూడా కోరుకుందని అంటారు
అందుకు ఆధారాలు లేనేలేవు. పైగా మత్స్య యంత్ర ఛేదన సమయంలో
శూతుడని కర్ణుని నిరాకరించింది. ఆ పగని మనసులో పెట్టుకుని
అలాగే సభా పర్వంలో ద్రౌపది వలువలు ఊడదీయమని సుయోధనుని
ప్రోత్సహించిందీ కర్ణుడే. అలాంటప్పుడు ద్రౌపది కర్ణుని ఆరోభర్తగా
కోరిందనడం.. అలాంటి ప్రచురణల్లో వాస్తవం లేదని భావించొచ్చు.
ద్రౌపది వ్యక్తిత్వంపై చాలా పుస్తకాలొచ్చాయి. కాని వాటిలో
ద్రౌవది వ్యక్తిత్వాన్ని వక్రీకరించిన పదప్రయోగాలే ఎక్కువ.
నా అభిప్రాయంలో పాతివ్రత్యంలో ద్రౌపది తర్వాతే ఎవరైనా.
ద్రౌపది అన్ని రకాల ఎమోషన్స్ కలబోసిన అత్యంత సౌందర్యరాశి
అభిమానవతి. భారతంలో మరిన్ని విషయాలు మరో బ్లాగులో...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి