ఈ కథ అనువాద లహరి అని ఒక బ్లాగులో దొరికింది. ఎన్ వీ మూర్తిగారు
అద్భుతంగా అనువదించారు. మానవ సంబంధాలను చాలాబాగా
ఆవిష్కరించిన ఫ్రెంచి కథ. దయచేసి మన భారతీయతకు
అనుసంధానించుకోవద్దు. కథను కథగానే చూడాలని మనవి.
హెచ్చరిక:
గుండెదిటవు లేనివాళ్ళు ఈ కథని దయచేసి చదవ వద్దు. అలా చదివినపుడు వచ్చే సమస్యలకి అనువాదకుడు బాధ్యుడు కాడు.
.
ఈ కథ ఉత్తమపురుషలో పురుషుడు చెప్పిన కథ
అయినప్పటికీ, దీనిని స్త్రీ చెప్పినట్టు ఊహించినా, ఇందులోని సౌందర్యం
ఎంతమాత్రం తగ్గదు. చెడదు. (శ్మశానంలో రాత్రిగడపటం అన్నది కథకుడికి కూడ
suspension of disbelief క్రింద ఇచ్చే రాయితీయే గనుక). అసలు విషయం,
బలహీనతలనీ, గొప్పదనాలనీ తులనాత్మకంగా పరిశీలించి ఇవ్వవలసినవాటికి
ఇవ్వవలసినంత విలువ ఇవ్వలేని మనబలహీనత వల్ల, వ్యక్తులకి (బ్రతికి ఉన్నప్పుడూ
పోయిన తర్వాతా కూడా) ఎక్కువగా ప్రేమించడమో ద్వేషించడమో చేస్తుంటాం.
మనకిష్టమైన వాళ్ల వ్యక్తిత్వాలచుట్టూ ఒక మార్మికత సృష్టించుకుంటాం. నమ్మకం
బలంగా ఉన్నంతకాలమూ, మన నమ్మకాలకి ఆఘాతం కలిగించే విషయాలు తెలిసినా అంత
గుడ్దిగానూ త్రోసిపుచ్చుతూ ఆ భ్రమలోనే బ్రతుకుతాం. కానీ ఎప్పుడైనా మన
విశ్వాసాన్ని సడలించే ఋజువులు కనిపించినప్పుడు (బ్రతికున్నప్పుడు కూడా) అంత
గౌరవప్రదమైన వ్యక్తినీ ఒక్కసారిగా పలచనచేసి వాళ్ళు మిగతా ఎన్ని మంచిపనులు
చేసినా వాటికి విలువ ఇవ్వం. వ్యక్తిత్వాలని de-mystify చేసి, వ్యక్తుల్ని
మంచిచెడుల సంగమంగా గ్రహించి, బలహీనతలను సానుభూతితో అర్థంచేసుకుని, వాళ్ళు
పాటించిన మానవీయమైన విలువలకు, విలువ ఇవ్వడం మరిచిపోకూడదు. Demystification
of such myth around people we love ఈ కథలోని సందేశం.)
*
ఆమెని నేను పిచ్చిగా ప్రేమించాను.
మనిషి ఎందుకు ప్రేమిస్తాడు? అసలు, మనిషి
ఎందుకు ప్రేమిస్తాడు? చూడ్డానికి ఎంత చిత్రంగా ఉంటుందోకదా … ఈ ప్రపంచంలో
ఒకే వ్యక్తిని చూసి ప్రేమించడం, ఆ ఒక్కరే తన ఆలోచనలలో వ్యాపించి, మనసులో
ఒకే ఒక్క కోరిక, పెదవిమీద ఎప్పుడూ ఒకటే నామం… ఆ పేరే నిరంతరం, అగాధమైన
హృదయపులోతులనుండి పెదాలపైకి ఊటలాగ సదా ఉబుకుతూ, ఆ నామాన్నే పదే పదే సమయం
సందర్భం మరిచి ఏదో ప్రార్థన చేసుకుంటున్నట్టు స్మరిస్తూ, జపించడం?
నేను మా కథే చెబుతాను, ఎందుకంటే ప్రేమ
ఒక్కటే. ఆ అనుభూతి అందరికీ ఒక్కలాగే ఉంటుంది. నేను ఆమెని కలిసి, ఆమె
దయమీద, ఆమె లాలింపులమీద, ఆమె కౌగిలిలో, ఆమె మాటల్లో, ఎంతగా ఒదిగిపోయానంటే,
ఆమెనుండి ఏది వచ్చినా దానిలో ఎంతగా మైమరచిపోయేవాడినంటే, అది రాత్రో పగలో
లక్ష్యపెట్టలేనంతగా; ఈ పురాతన విశ్వంలో అసలు నేను బ్రతికే ఉన్నానో
మరణించానో గుర్తించలేనంతగా.
అటువంటి సమయంలో ఆమె మరణించింది. ఎలాగ?
నాకు తెలియదు; నాకసలు ఏమయిందో తెలీనే తెలీదు. ఒక రోజు సాయంత్రం ఇంటికి
తడిసి ముద్దైపోయి వచ్చింది, ఎందుకంటే ఆరోజు వర్షం తెగకురిసింది; రెండో రోజు
దగ్గుపట్టుకుంది, ఒక వారం రోజులు అలా దగ్గుతూనే ఉంది, తర్వాత మంచం
పట్టింది. తర్వాతేమయిందో నాకిప్పుడు గుర్తులేదు. కానీ, డాక్టర్లు వచ్చేరు,
మందులు రాసి వెళ్ళిపోయేరు. మందులు వచ్చేయి, కొందరు ఆడవాళ్ళు ఆమెచేత
మందులు తాగించేరు కూడా. ఆమె చేతులు వేడిగా ఉండేవి, నుదురు కాలిపోతుండేది,
కళ్లు మాత్రం మెరుస్తున్నా ఎంతో విచారంగా ఉండేవి. నేను ఆమెతో మాటాడేను,
ఆమె సమాధానం చెప్పింది కానీ, ఇప్పుడు అవేవీ గుర్తులేవు. నేను అన్నీ
మరిచిపోయాను. సర్వం! ప్రతీదీ! ఆమె మరణించింది. నాకిప్పడికీ గుర్తుంది ఆమె
నీరసంగా విడిచిన చివరిశ్వాస. నర్సు “ఆ!” అని అంది. నాకు అర్థం అయిపోయింది.
దాంతో నాకంతా అర్థం అయిపోయింది.
అంతకుమించి నాకేం తెలీదు. ఏమీ. ఒక ఫాదిరీ
వచ్చి అడిగేడు: “అమె నీతో ఉంటోందా?” అని అడిగేడు. అతని మాటల్లో ఆమెపట్ల
న్యూనతాభావం కనిపించింది. ఆమె ఇప్పుడు లేదు గాబట్టి ఎవరికీ ఆమెని
అవమానకరంగా మాటాడే హక్కులేదు. దానితో అతన్ని తగిలేసేను. మరొకతను వచ్చేడు.
అతనెంతో ఆత్మీయంగా మాటాడేడు. నాకు ఏడుపు వచ్చింది. అన్ని విషయాలూ అతనికి
చెప్పేను.
వాళ్ళు ఆమె అంత్యక్రియలగురించి నన్ను
సంప్రదించేరు గాని, వాళ్ళేం అడిగేరో గుర్తులేదు; గుర్తున్నదొక్కటే, ఆమె
శరీరాన్ని సమాధిలోకి దించేముందు శవపేటిక కప్పు మూస్తున్నపుడు మేకులు కొడుతూ
సుత్తి చేసిన చప్పుడు. ఓహ్! భగవంతుడా!భగవంతుడా!
ఆమెని సమాధిచేసేరు. సమాధిచేసేసేరు! ఆమెని!
గోతిలో! కొందరు వచ్చేరు… ఆమె మహిళా స్నేహితులు. నేను వాళ్లని
తప్పించుకుందికి బయటకి పారిపోయాను. అలా పరిగెత్తి పరిపోయి, వీధుల
వెంబడి తిరిగి తిరిగి, చివరికి ఇల్లు చేరుకున్నాను. మరుచటిరోజే ఊరువదలి
వెళిపోయాను…
***
నిన్ననే నేను పారిస్ తిరిగి వచ్చేను.
వచ్చి మరొకసారి నా గది … మా గది, మా పడక మంచం, మా ఫర్నిచరు, మనిషి పోయిన
తర్వాత ఆ మనిషి జీవితానికి చెందిన అవశేషాలు … అన్నీ చూసిన తర్వాత, మళ్ళీ
మరొక తెర ఎంత దుఃఖం పొంగుకొచ్చిందంటే, కిటికీ తలుపులు తెరిచి అందులోంచి
బయటకు వీధిలోకి దూకేద్దామనిపించింది. ఇక ఈ గదిలో ఎంతమాత్రం ఉండలేను, తనకి
ఆశ్రయమిచ్చి ఉంచిన ఈ గది నాలుగు గోడలూ, కనిపించని మూల మూలలూ ఆమెకు చెందిన
వేలకొద్దీ వస్తువుల్నీ, ఆమె శరీరాన్నీ, ఆమె శ్వాసనీ ఇంకా పట్టే ఉన్నాయి.
అక్కడనుండి తప్పించుకుపోదామని నా టోపీ తీసుకుని తలుపు దగ్గరకి వెళ్ళేలోపు
హాలులో పెద్ద అద్దాన్ని సమీపించేను… తనే అక్కడ ఆ అద్దాన్ని పెట్టించింది,
రోజూ తను బయటకు వెళ్ళే ముందు ఆపాద మస్తకమూ పరీక్షించుకుని, ఏ చిన్నపొరపాటూ
లేకుండాతన అలంకరణా, దుస్తులూ, అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో సరిచూసుకుందికి.
ఆ అద్దాన్ని చూడగానే ఆగిపోయాను… ఆమె
అందాన్ని అది ఎన్నోసార్లు ప్రతిబింబించింది, ఎన్నిసార్లంటే, బహుశా ఆ
రూపాన్ని అది తనదగ్గరే ఉంచేసుకుందేమో అనుకునేంత. ఖాళీగా, గంభీరంగా,
నిస్తేజంగా కనిపిస్తున్న ఆ అద్దం వైపు గుడ్లప్పగించి చూస్తూ, అలా వణుకుతూ
నిలుచున్నాను… నేనూ, నా రాగరంజితమైన కళ్లూ పొదువుకున్నట్టు గానే, ఆ
అద్దంకూడా ఆమెని తనలో ఇముడ్చుకుని, దాచుకుంది. నేను ఆ అద్దాన్ని ఆప్యాయంగా
తాకేను దాన్ని ప్రేమిస్తున్నానేమోన్నంతగా. దాన్ని తాకగానే అది చేతికి
చల్లగా తగిలింది, నిర్వికారంగా. ఓహ్, ఎంత బాధాకరమైన జ్ఞాపకం! దుఃఖిస్తున్న
అద్దం, ప్రేమతో రగిలిపోతున్న అద్దం, దారుణమైన అద్దం, మనుషుల్ని ఎలాంటి
బాధలకు గురిచేస్తుంది! అద్దం తనలో దాచుకున్న ప్రతిదాన్నీ, దాని ముందునుండి
నడచివెళ్లిన ప్రతివస్తువునీ, దానిలో తన ప్రతిబింబాన్ని చూసుకున్న వాళ్లనీ,
ప్రేమగా అది ప్రతిబింబించిన వ్యక్తుల్నీ ఎవడైతే మరిచిపోగలడో, ఆ మనిషి చాలా
చాలా అదృష్టవంతుడు. నేనిపుడు ఎంత బాధపడుతున్నాను!
నాకు తెలియకుండానే, నేననుకోకుండానే, నా
కాళ్లు ఆమె సమాధివైపు దారి తీసాయి. చాలా సాదా సీదాగా ఉన్న ఆమె సమాధి వెంటనే
పోల్చుకున్నాను. .. ఒక తెల్ల పాలరాతి శిలువగుర్తూ, ఫలకం మీద క్లుప్తంగా
నాలుగు మాటలూ:
“ఆమె ప్రేమించింది, ప్రేమించబడింది, మరణించింది.”
ఆమె ఆ సమాధిలో ఉంది… శిధిలమైపోతూ! ఎంత
దారుణం! నా నుదురు నేలకి ఆన్చి వెక్కి వెక్కి ఏడ్చాను; అక్కడే, అక్కడే అలా
చాల సెపు ఉండిపోయాను. చీకటిపడడం గమనించాను; అప్పుడు నాకొక వింత ఆలోచన,
ఆపుకోలేని కోరిక, నిరాశకుగురైన ప్రేమికుడికి కలిగే ఆకాంక్ష ముప్పిరిగొంది: ఆ
రాత్రి, నా చివరి రాత్రి, ఎలాగైనా ఆమె సమాధిప్రక్కనే శోకిస్తూ గడపాలని.
కాని, నన్ను ఎవరైనా చూస్తే అక్కడనుండి తరిమేస్తారు. మరి నా ఆలోచన అమలుపరిచే
మార్గం ఎలా? అవసరానికి తగిన ఉపాయం ఆలోచించగల సమర్థత నాకుంది. అందుకని,
వెంటనే అక్కడనుండి లేచాను. ఆ మృతనగరిలో సంచారం ప్రారంభించాను. నడుస్తూ,
నడుస్తూ, నడుస్తూనే ఉన్నాను. మనం నివసిస్తున్న నగరాలతో పోలిస్తే, ఈ నగరం
ఎంత చిన్నది! నిజానికి చనిపోయిన వారిసంఖ్య బ్రతికున్న వారికంటే ఎన్నో
రెట్లు ఎక్కువగదా! మనకయితే ఎత్తైన భవంతులూ, విశాలమైన రోడ్లూ, ఏకకాలంలో
నాలుగుతరాలకి కావలసినంత గాలీ వెలుతురూ వచ్చేలా పెద్ద పెద్ద గదులూ, వాటితో
పాటే, నిత్యం స్వచ్ఛమైన చెలమల్లోని నీళ్ళూ, ద్రాక్షతోటలనుండి సారాయీ,
మైదానాలనుండి తినడానికి మంచి రొట్టే ఇవన్నీ కావాలి.
ఇన్ని తరాల మృతులకీ, మనదాక కొనసాగిన ఆ
మహామానవ సోపానానికి, పాపం, ఏమీ లేవు! బొటాబొటీగా కూడ ఏవీలేవు! అన్నీ భూమి
తిరిగి తీసుకుంటుంది; విస్మృతి వాళ్ల ఉనికిని చెరిపేస్తుంది… కడపటి
వీడ్కోలు చెబుతూ…
నే నా శ్మశానం ఒక మూలకి చెరేసరికి
ఒక్కసారిగా గమనించేను… అది అన్నిటిలోకీ పాతజాగా. అక్కడి సమాధులలోనివాళ్ళు
ఎప్పుడో మట్టిలో కలిసిపోయారు… అక్కడి శిలువలే శిధిలమై జీర్ణావస్థకి
చేరుకున్నాయి. బహుశా రేపు రాబోయేవారికి అక్కడ ఆశ్రయం కల్పించవచ్చు. అక్కడ
సంరక్షణలేని గులాబి చెట్లూ, నల్లగా ఏపుగా పెరిగిన సైప్రస్ చెట్లూ,
మానవశరీరాలు ఎరువుగా పెరిగి నిర్లక్ష్యంగా వదిలేసిన అందమైన తోటా ఉన్నాయి.
ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. ఒకే
ఒక్కడిని నిస్సందేహంగా. బాగా దట్టంగా గుబురుగా పెరిగిన చెట్టుచూసి దాని
ఆకుల నల్లని నీడలో ఎందుకైనా మంచిదని నక్కి కూర్చున్నాను… పడవమునిగినపుడు
ఆధారంగా దొరికిన బల్లచెక్కను మనిషి ఎంత ఆత్రంగా పట్టుకుంటాడో, అంత ఆత్రంగా ఆ
చెట్టు మొదలు పట్టుకుని.
బాగా చీకటి పడనిచ్చి, నా స్థావరాన్ని
వదిలి నడవడం ప్రారంభించాను… ఆ మృతులతో నిండిన ఆ నేలమీద నెమ్మదిగా, మెత్తగా
అడుగులో అడుగు వేసుకుంటూ. చాలా సేపు తిరిగేను గాని ఆమె సమాధి ఎక్కడుందో
మళ్ళీ గుర్తుపట్టలేకపోయాను. రెండు చేతులు జాచీ, సమాధుల్ని చేతులతో,
కాళ్లతో, ముణుకులతో, గుండెతో, చివరికి నా తలతో, తడుముతూ, తన్నేసుకుంటూ,
తొట్రుపడుతూ… అయినా ఆమె సమాధిని కనుక్కోలేకపోయాను. గుడ్డివాడు తోవకోసం
తడుముకున్న చందంలో తిరిగేను గాని, నాకు రాళ్ళూ, శిలువలూ, ఇనప కంచెలూ, లోహపు
దండలూ, కొత్తగా ఉంచిన పూలమాలలే తగిలేయి. నా చేతివేళ్లను సమాధిపలకలమీద రాసి
ఉన్న అక్షరాలమీదనుండి పోనిచ్చి అక్కడి అక్షరాలను చదివేను. అబ్బ! ఏమి
చీకటి! ఎంతప్రయత్నించినా ఆమె సమాధి జాడ కనిపెట్టలేకపోయాను.
చంద్రోదయం అవలేదు. ఏమి కాళరాత్రి అది!
నాకు భయం వేసింది, గోరీలమధ్య సన్నగా ఇరుకుగా ఉన్న త్రోవలో నడవడానికి చాలా
భయం వేసింది. సమాధులు! సమాధులు!! సమాధులు!!! సమాధులు తప్ప మరేమీ లేవు! నాకు
కుడిప్రక్క, ఎడం ప్రక్క, ముందూ, ఎక్కడపడితే అక్కడ సమాధులే! చివరికి ఇక
నడవలేక, ఒక సమాధిమీద చతికిలబడ్డాను. కాళ్లలో సత్తువ సన్నగిల్లిపోయింది. నా
గుండెకొట్టుకోవడం నాకు స్పష్టంగా వినిపిస్తోంది. ఇంతలో నాకు ఇంకేదో
చప్పుడు కూడా వినిపించింది. ఏమిటది? ఇది ఇది అనిచెప్పలేని,
గగుర్పాటుకలిగించే చప్పుడది. ఆ చప్పుడు నా బుర్రలోంచి వస్తోందా, అగోచరమైన ఈ
నిశీధిలోనుండా, లేక శవాలతో కప్పబడిన నిగూఢమైన ఈ నేలక్రింది నుండా? నా
చుట్టూ చూశాను. నే నలా ఎంతసేపు ఉన్నానో చెప్పలేనుగాని, భయంతో నా శరీరం
చచ్చుపడిపోయింది, భయంతో చెమటలు పట్టేసేయి, ఏ క్షణంలోనైనా స్పృహ కోల్పోవడమో,
మరణించడమో నిశ్చయం అన్నట్టుంది నా స్థితి.
అకస్మాత్తుగా, నాకు నేను కూర్చున్న
సమాధిపలకే కదులుతున్నట్టనిపించింది. సందేహం లేదు, నిజంగానే అది కదులుతోంది,
క్రిందనుండి ఎవరో పైకి లేపుతున్నట్టు. ఒక్క ఉదుకున పక్కనే ఉన్న మరో
సమాధిమీదకి ఉరికేను; అప్పుడు చూశాను, చాలా స్పష్టంగా చూసేను, అప్పటివరకూ
నేను కూర్చున్న సమాధిరాయి పూర్తిగా పైకి లేవడం. అందులోనుండి చనిపోయిన
వ్యక్తి, నగ్నంగా ఉన్న ఒక అస్థిపంజరం, బయటకు వచ్చి, వంచిన తన నడుముతో
సమాధిపలకని మరికొంచెం వెనక్కి తొయ్యడం గమనించేను. ఆ స్మృతిఫలకం మీద రాసి
ఉన్నది నేనిప్పుడు స్పష్టంగా చదవగలుగుతున్నాను:
“ఇది తన యాభై
ఒకటవఏట మరణించిన జాక్ ఒలివెంట్ సమాధి. అతను తన కుటుంబాన్ని అమితంగా
ప్రేమించాడు, చాలా కరుణాళువు, గౌరవప్రదమైన వ్యక్తీను. భగవంతుని అనుగ్రహంతో
అతనిలో లీనమైనాడు.“
ఆ చనిపోయిన వ్యక్తికూడా చదివేడు
స్మృతిఫలకం మీద ఏమి చెక్కి ఉందో; వెంటనే దారిపక్కన పడి ఉన్న ఒక చిన్న రాయి,
కొంచెం సూదిగా ఉన్నది, తీసుకుని అక్కడి అక్షరాలను జాగ్రత్తగా చెరపడం
ప్రారంభించేడు. నెమ్మదిగా అన్ని అక్షరాలనీ చెరిపేసి, అతని కళ్ళగుంటలతో
అక్షరాలు చెక్కిన చోటుని జాగ్రత్తగా పరిశీలించేడు. అపుడు ఒకప్పటి తన
చూపుడువేలి ఎముక కొనతో వెలుగుతున్న అక్షరాలతో రాయడం ప్రారంభించేడు… అవి
కుర్రాళ్లు గోడలమీద అగ్గిపుల్లలతో రాసినట్టున్నాది:
“ఇది తన యాభై ఒకటవఏట మరణించిన జాక్
ఒలివెంట్ సమాధి. అతను తన వారసత్వపు ఆస్థి అనుభవించడం కోసం నిర్దాక్షిణ్యంగా
ప్రవర్తించి తండ్రి తొందరగా మరణించడానికి కారకుడయ్యాడు; భార్యను
చిత్రహింసలుపెట్టి, పిల్లలని హింసించేడు, అతని పొరుగువాళ్లని మోసం చేసేడు,
ఎంతమందిని దోచుకోగలడో అంతమందినీ దోచుకుని, చివరకి నీచమైన చావు చచ్చేడు.“
అతని రాత పూర్తయిన తర్వాత, తను రాసినది
చదువుతూ చలనం లేకుండా ఉండిపోయాడు. నేను నాలుగుపక్కలా పరికించి చూతును గదా…
అన్ని సమాధులూ తెరువబడి ఉన్నాయి; మృతులందరూ వారి వారి సమాధుల్లోంచి బయటకు
వచ్చి వాళ్ల స్మృతిఫలకాలపై బంధువులు చెక్కించిన అక్షరాలను చెరిపేసి
యదార్థమైన విషయాన్ని తిరిగి రాయడం ప్రారంభించేరు. నేను చదివినదేమిటంటే ఈ
గొప్పగొప్ప తండ్రులూ, విశ్వాసముగల భార్యలూ, భక్తిగల కొడుకులూ, నిష్కళంకులైన
కూతుళ్ళూ, నిజాయితీగల వ్యాపారులూ, అకళంకులని చెప్పబడ్డ వీరందరిలో ప్రతి
ఒక్కరూ, ద్రోహులూ, మోసగాళ్ళూ, కపటులూ, అబధ్ధాలకోరులూ, దొంగలూ, పరులని
నిష్కారణంగా నిందించినవాళ్ళూ, అసూయాపరులూ, నీతిబాహ్యమని చెప్పే ప్రతి
పనినీ చేసినవారే. వాళ్ళందరూ ఏక కాలంలో, వాళ్ల శాశ్వతమైన ఇంటిగుమ్మాలముందర,
సత్యాల్ని, ఎవరికీ తెలియనివీ, తెలిసినా వాళ్ళు బ్రతికున్నప్పుడు
ఉపేక్షించినవీ, భయంకరమైన సత్యాలని రాయసాగేరు.
నాకప్పుడు అనిపించింది, ఆమె కూడా తన
సమాధిమీద ఏదో ఒకటి రాస్తూ ఉండాలి ఇప్పుడు అని; సగం తెరిచి ఉన్న శవపేటికల
మధ్యనుండీ, శవాలమధ్యనుండీ, అస్థిపంజరాలమధ్యనుండీ ఇప్పుడు ఏమాత్రం భయం
లేకుండా ఆమె కోసం పరిగెత్తేను… ఇప్పుడైతే ఆమెని తప్పకుండా పట్టుకోగలనన్న
ధైర్యంతో. అనుకున్నట్టుగానే, ఆమె ముఖం చూడకుండానే పోల్చుకోగలిగేను, తనని
చుట్టిన వస్త్రాన్ని బట్టీ, అంతకుముందే పాలరాతిసమాధిఫలకం మీద ఆమె స్మృతిలో
వ్రాసిన ఈ అక్షరాలను బట్టీ:
“ఆమె ప్రేమించింది, ప్రేమించబడింది, మరణించింది.”
ఇప్పుడక్కడ ఇలా రాసి ఉంది:
“ఒకరోజు ఆమె తనప్రియుణ్ణి మోసగించడానికి వర్షంలో బయటకు వెళ్ళి, జలుబుపట్టి చనిపోయింది.“
***
వాళ్ళు ఆ సమాధిమీద స్పృహతప్పి పడిపోయిన నన్ను మరుచటిరోజు ఉదయం తెల్లవారేక చూసేరనుకుంటాను…..
***
గై ద మొపాసా
ఫ్రెంచి కథా రచయిత
heart touching story.
రిప్లయితొలగించండిమీ బ్లాగు చూశాను.. చాలా బాగున్నాయి... మీ కవితా సంకలనం.
తొలగించండిఆపకండి... రాస్తూనే ఉండండి. రాత లేక.. తలరాత బాగోలేక..
చిక్కిపోతున్న మన చక్కదనాల తెలుగు చిక్కదనాన్ని
చిక్కుపట్టి మరీ చూపించేందుకైన రాస్తూనే ఉండాలి. ధన్యవాదాలు
సతీశ్ గారూ కథ చాలా గొప్పగా ఉంది. మీ అనువాదం కూడా దీటైన స్థాయిలో ఉంది. అనువందించిన మూర్తి గారికి...ఇక్కడ ఉంచిన మీకు ధన్యవాదాలు. మీ బ్లాగ్ ఇవాళే చూడడం. బాగుంది. విజయవంతంగా కొనసాగించాలని కోరకుంటూ... చందు తులసి
రిప్లయితొలగించండిచందు, తులసి.. ఎలా ఉన్నారు... చాలా రోజులకు. మీ అభిప్రాయాలకు
తొలగించండిధన్యవాదాలు... భారతం గురించి విశ్లేషిస్తూ.. వక్రీకరణకు గురైన
కొన్ని అద్భుత గాధల అసలు కథను రాసే ప్రయత్నం చేస్తున్నాను
కొన్నైనా ముందరి తరాలకు తెలియాలి కదా