Powered By Blogger

17 ఏప్రిల్, 2013

రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ్ పురస్కారం

అక్షరాలను ఇలా కూడా కూర్చొచ్చుకే.. రావూరి కవితలు కొన్ని.. కవితలను ఇలా కూడా రాయొచ్చు.
నిశీధిలో కూడా వెలుతురు తురుముని కవి గాంచగలడని నిరూపించి
ఎందరికో ఆదర్శప్రాయుడైన గురుసమానులు రావూరి భరద్వాజ.
ఆయన గురించి నేనేవో కవితలు రాసి వర్ణించే కన్నా.. ఆయన రాసిన
అద్భుతాలనే నెమరు వేసుకుంటే మంచిది కదా.. అందుకే ఆయన అక్షరాలతోనే అభినందనలు చెప్పే సాహసం చేస్తున్నాను

ఏదీ నాది కాదు - రావూరి భరద్వాజ

"నీకు సంతృప్తి కావాలా? అసంతృప్తి కావాలా?" అన్నారు ప్రభువు ఉదయపు నడకలో.
"అసంతృప్తి" అన్నాను.
ప్రభువు ఆశ్చర్యంగా చూశాడు నావేపు.
"ఉన్న చోటనే ఉండి పొమ్మంటుంది సంతృప్తి. మునుముదుకు నడిపిస్తుంది అసంతృప్తి" అన్నాను.
ప్రభువు నా వీపు తట్టాడు!
ఎందుకో తెలీదు.
******************************

"నన్ను మండించాలని నీవూ, నిన్ను మసి చేయాలని నేనూ, సహస్ర సహస్రాబ్దాలుగా తంటాలు పడుతున్నాం.
నేను మండిపోనూ లేదు;నీవు మసి కుప్పగానూ మారిపోలేదు.
హోరాహోరీ పోరాటం అనంత కాలాల దాకా, అవిచ్చిన్నంగా
సాగుతూనే ఉంటుంది" అన్నది ఆ అంధకారం, దూరం నించి వస్తోన్న వెలుతురు వేపు చూస్తూ.

******************************

"వూవు నయిపోదామన్న ఉత్సాహంతో తీగ మీద వాలాను.
నేనంటే గిట్టని చివురాకు నన్ను కిందకి తోసేసింది" అన్నదా వాన చినుకు.
దెబ్బ తగిలిందా చిన్నా!" అంటూ ఆ చినుకును మెత్తగా హత్తుకున్నదో మట్టిబెడ్డ.

******************************

"తెల్లగా, చల్లగా, మెల్లగా పోతూపోతూన్నవారు కాస్తా;హఠాత్తుగా
ఆగిపోయారెందుకు? కళ్ళు చికిలించి కిందికి చూస్తున్నారెందుకు?" అన్నదో గోరింక.
"పల్లెకు దూరంగా ఉన్న, ఆ పూరింటి ముందు, ఓ అమ్మాయిగారు, అద్దం
పుచ్చుకొని నుంచున్నారు. అందులో ప్రతిఫలిస్తున్నది నా ముఖమో, అమ్మాయిగారి
ముఖమో తేల్చుకోలేక ఆగిపోయాను" అన్నాడా పున్నమి చంద్రుడు!

*****************************






9 ఫిబ్రవరి, 2013

కాసేపు.. ఉన్నదున్నట్టు మాటాడుకుందాం....

ఇన్నాళ్ళూ ఏం రాయాలో అర్థం కాలేదు. ఏదో ఒకటి రాయడం.. చిట్ చాట్ చేయడం అస్సలు రాదు.
ఏదైనా వివరం.. ఆ వివరం సవివరంగా ఉండాలి. అందుకే రాయలేకపోయాను అని నిజాయతీగా
ఒప్పుకోడం మంచిది. ఈ మధ్యకాలంలో నేను పనిఒత్తిడిలో మునిగిపోయాను. తీరిక లేదని
ఎవరైనా అంటే నాకే నచ్చదు. కనుక.. తీరిక చేసుకోడం నాకే చేతకాలేదు. కానీ... ఇన్నాళ్లకు
మళ్లీ చేయికదిలింది. ఇప్పుడు కూడా ఏం రాయాలో ప్రత్యేకంగా ఎజెండా లేదు. ఏదో ఒకటి రాద్దామని
అనుకుంటున్నా.. ఆ ఏదో ఒకటి ఎలా ఉంటుందో ఏమో..
విశ్వరూపం సినిమా చూశా. ఉగ్రవాద భీభత్సాన్నే చూశాం... ఉగ్రవాదుల ఇళ్ళు ఎలా ఉంటాయో
బహుశా ఎవరికీ తెలీదు.. వారి సంసారాల్లో ఏముంటుందో ఒక్క శాతం మందికి కూడా తెలీదు.
కానీ... ఆ ఇళ్ళల్లో ఆడవాళ్లను.. అక్కడి పిల్లల దురవస్థను.. వారిలో చదువుకోవాలన్న
తపనని చూపించి... అక్కడ ప్రతీ వీధిలోనూ మలాలాలు అడుగడుగునా ఉన్నారన్న
వాస్తవాన్ని చూపించే ధైర్యం ఎంత మందికుంటుంది... బహుశా భారత దేశంలో కమల్ కి తప్ప
మరొకరికి అది అసాధ్యం. ఇందులో ముస్లి సోదరులకు జరిగిన ఘోర అవమానమేంటో నాకైతే
అర్థం కాలేదు. ఇది ముస్లింలకు సంబంధించి సినిమా కాదు. ఉగ్రవాద వ్యతిరేక సినిమా.
ఈ చిత్రాన్ని ఆపడం ద్వారా.. ఆ ఆపిన వారు ఉగ్రవాదాన్ని సమర్ధించాలనుకుంటున్నారా.
నాకైతే అలానే అనిపిస్తోంది. కళకు ఇలాంటివి కళంకాలు. కాబట్టి పట్టించుకోకుండా ఉంటేనే మంచిది.
నాకైతే ఒక అద్భుతమైన చిత్రం చాన్నాళ్ల తర్వాత చూశాననిపించింది. ఆఫ్గనిస్థాన్, రష్యా-అమెరికా
ఆధిపత్య పోరు, అమెరికా ఉగ్రవాదాన్ని పాలుపోసి పెంచిన కథలు తెలుసుకాబట్టి... నాకా
చిత్రం బాగా నచ్చింది. మనది లౌకిక రాజ్యం. కానీ.. లౌకికం మరీ ఎక్కువైపోయింది. అతి సర్వత్రా
వర్జయేత్. ఏ మతానికైనా. మందు మనిషి.. తర్వాతే మతమైనా, కులమైనా అనే ధృక్కోణం చదువుకున్న
వాళ్లలోనే కనిపించడం లేదు. ఓటురాజకీయాలకు కులమతాలు పాశుపత బ్రహ్మాస్త్రాలుగా మారిపోయాయి.
దేశం అంటే కులమతాలేనా. ఇంకేమీ లేవా. ఆకలి కులమేది... మట్టి మతమేది.
ఒక చిన్న కథ. వేదాల్లో బృహదారణ్యకంలో ఉంది. ఒక కుర్రాడు. అతను ఎక్కడెక్కడో పనిచేసే
ఒక పరిచారికకు దొరికితే పెంచుకుంటుంది. అతనికి యుక్తవయసొస్తుంది. తల్లి దగ్గరికి వెళ్లి నేను విద్యాభ్యాసం చేయాలి పండితుల వద్దకు వెళ్లాలి.. కనుక కులం, గోత్రం చెప్పమంటాడు. ఆ తల్లి నాయనా.. నేను ఎక్కడెక్కడో
పనిచేసే పరిచారికను. చిన్నప్పుడు నువు నాకు లభించావు. నీ కులం, గోత్రం నాకు తెలియవు. నా పేరులో సగం జాబాలి. అదే నీపేరు అంటుంది. సరే అని వేదవేదాలు చదివిన ఓ పండితుని దగ్గరకు వెళ్లి... అయ్యా నాకు విద్య
నేర్పు అంటాడు. నీ కులం, గోత్రం చెప్పు అంటాడాయన. అప్పుడు తల్లి చెప్పిన వృత్తాంతం అంతా ముక్క
పొల్లుపోకుండా చెప్తాడు. అతని సత్య నిష్టకు మెచ్చి.. ఉన్నదున్నట్టు సత్యనిష్టతో చెప్పాడు కాబట్టి... ఇతను
కచ్చితంగా బ్రాహ్మణుడే. అని విద్యాబోధకు అంగీకరిస్తాడు. ఇక్కడ రెండు విషయాలు చర్చించాలి. జాబాలి గుణంతో బ్రాహ్మణుడయ్యాడు.. సత్య నిష్ట కలిగిన వారెవరైన బ్రాహ్మణులే.. అసత్య నిష్ట కలిగినవారెవరైన నీఛులే. కులాలు మతాలు ఎప్పుడూ లేవు. గుణాలను బట్టి కులాలు పుట్టాయి, మనిషి అబిమతాలను బట్టి మతం పుట్టింది.
ఇవి పుట్టుకతో రావు... పుట్టిన తర్వాత మన నడివడికననుసరించి వచ్చేవి. మనతో పాటే వస్తాయి.. కానీ
మనవి కావు. సంస్కారం, సంస్కృతి ఇవే మనవి.. కడవరకు వచ్చేవి. ఇది వేద సారం. కాదనడానికి మనమెవరం.    

31 డిసెంబర్, 2012

ఇది తాజాగా కౌముదిలో గొల్లపూడి మారుతిరావు గారి రాసిన 
వ్యాఖ్యానం... అందరూ చదవాలని పోస్ట్ చేస్తున్నా... 

మానవత్వమా! ఎక్కడ నువ్వు ?
 ఆడవారికి స్వాతంత్య్రం వచ్చిందని భుజాలు చరుచుకుంటున్న రోజులివి. కాని ఆడవారి స్వేచ్ఛని ఆరోగ్యకరమైన దృష్టితో చూడడం చేతకాని పశువులున్న రోజులు కూడా ఇవే.
వాళ్లు చిన్న కుటుంబాలకు చెందినవాళ్లు. కార్లలో డ్రైవర్లతో తిరిగే స్తోమతు చాలని వాళ్లు. తప్పనిసరిగా బస్సుల్ని నమ్ముకోవలసినవాళ్లు. వాళ్లు పడే కష్టాలు, అవమానాలూ ఇళ్లలో చెప్పుకుంటే ఆ చదువుకొనే అవకాశం పోతుందేమోనని గుండెల్లోనే మంటల్ని దాచుకునేవాళ్లు. జీవితంలో ఏ కాస్త అవకాశాన్నయినా అందిపుచ్చుకుని ఆ మేరకి, తమ, తమ కుటుంబాలకి ఆసరా కావాలనే కలలు కనేవాళ్లు.
ఈ ఈమెయిల్‌ నాకు ఓ అరవైయేళ్ల ముసలాయన పంపిస్తూ -దయచేసి కాలమ్‌ రాయమని అర్థించాడు. మొన్న ఆదివారం ఢిల్లీలో జరిగిన అనర్థం తరువాత రెయిన్‌ ట్రీ ఫిలింస్‌ డైరెక్టర్‌ నిష్తా జైన్‌ 'ఫేస్‌ బుక్‌'లో రాసిన ఉదంతం ఇది.
''ఢిల్లీ మారిందంటారు. అవును. మారింది. మరింత అధ్వాన్నమయింది. కార్లూ డ్రైవర్లూ నోచుకోని మధ్యతరగతి ఆడపిల్ల నిస్సహాయంగా వీధిన పడింది. ప్రతీరోజూ కాలేజీకి, యూనివర్సిటీకి వెళ్లే ఆడపిల్లలు రద్దీగా ఉన్న బస్సుల్లో ప్రయాణం చెయ్యడం తప్పనిసరి. కావాలని దొమ్మీలో నిలబడి, శరీరాలకు రాసుకుంటూ -ఆడపిల్లల పిర్రలూ, తొడలూ నొక్కి, గిల్లి, వేళ్లతో పొడిచి -కోపంగా చూస్తే 'ఏం చేస్తావన్న'ట్టు ధీమాగా చూస్తూ స్థనాలపై కొట్టే పోకిరీరాయుళ్లు పెచ్చురేగిపోతున్న రోజులివి. వాళ్ల ముఖాలు ఆడపిల్లలకి తెలుసు. వీళ్లేమీ చెయ్యలేరని ఆ దౌర్భాగ్యులకి తెలుసు. ఇది దైనందిన విలాసం. ఆడపిల్లకి దిన దిన గండం. ఆ దౌర్భాగ్యుడు ఆ పనికే ఒరుసుకుంటున్నాడని తెలుసు. తప్పించుకునే మార్గం లేదు. కండక్టర్లకీ తెలుసు. వారూ చిలిపిగా నవ్వుకుంటారు. కొందరు నిస్సహాయంగా తలతిప్పుకుంటారు. చాందినీచౌక్‌, కరోల్‌ భాగ్‌ వంటి చోట్లకి వెళ్లి మతిచెడి ఇంటికి చేరిన సందర్భాలు బోలెడు. కొంత పెద్దదాన్నయాక నామీద చెయ్యేసిన మగాడిని తిప్పికొట్టిన సందర్భాలున్నాయి. ఆ మగాడు సిగ్గుపడకుండా ఈసారి తెలిసేటట్టు స్థనాల మీద బలంగా కొడతాడు. బస్సులో అందరికీ ఇది కనిపిస్తూనే ఉంటుంది. కాని ఆ క్షణాన ఆ పని తనకు జరగలేదని ఊపిరి పీల్చుకుంటారు. ఇది మధ్యతరగతి పలాయనవాదం. ఢిల్లీలో రాత్రి తొమ్మిది దాటాక బస్సుల్లో ఆడపిల్ల ప్రయాణం చేస్తే -ఆమె వ్యభిచారి కిందే లెక్క. ఆమెని ఎవరయినా ఏదయినా చెయ్యవచ్చు. ఇది నేను చెప్తున్నమాట కాదు. తాగిన ఒక మగాడు నాకు చెప్పినమాట. డిటిసి బస్సులో ప్రయాణం చేస్తున్న నా తొడమీద తాగిన మగాడు వచ్చి కూచున్నాడు. బస్సు కండక్టరు చూస్తున్నాడు. ఎదిరించబోయాను. బస్సు కండక్టరు అన్నాడు కదా: 'తొమ్మిది తర్వాత బయటికి రావడం నీదీ తప్పు'! అని''
ఇవి నిష్తా జైన్‌ మాటలు. ఇదీ మన దేశం. మన నీతి. మన మగతనం. మన మహిళ పరిస్థితి. 23 ఏళ్ల వైద్య డిగ్రీ చదువుతున్న ఆడపిల్ల ఢిల్లీలో ఒక మగాడితో ప్రయాణం చేస్తూంటే నడుస్తున్న బస్సులోనే ఏడుగురు కొట్టి మానభంగం చేసి, అడ్డుపడిన మగాడిని ఇనుప వూచలతో చావబాది నడుస్తున్న బస్సులోంచి బయటికి తోసేసిన గుండెనిబ్బరాన్నిచ్చిన రాజధాని మనది.
బిడ్డని చదివించుకోడానికి ఉపాధి చాలని తల్లీదండ్రీ ఉప్పు, రొట్టె తిని -కడుపుకట్టుకుని చదివించుకుంటున్నారు. ఆ అమ్మాయికి డాక్టరు కావాలని కల. కాని బతుకుమీద ఆశకూడాలేని దశలో పేషెంటు అయింది. తల్లిదండ్రులు బిక్కచచ్చిపోయారు. ''నేనెవరినీ నిందించను. ఇలాంటి ఘోరం మరో ఆడపిల్లకు జరగకూడదు'' అన్నాడు ఆమె తండ్రి తడి ఆరిపోయిన కళ్లతో.
దేశమంతా ఒక్కటయి ఈ సంఘటనని గర్హించింది. ''నేను చేసింది పరమ ఘోరం. నన్ను ఉరి తీయండి'' అన్నాడట -ఈ ఘోరాన్ని చేసిన ఒక నీచుడు. సోనియాగాంధీ, స్పీకర్‌ మీరాకుమార్‌ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వచ్చారు. ప్రధాని ఈ సంఘటనని గర్హించారు.
నాకు హింస మీదా, ప్రతీకారం మీదా, పగ మీదా, రక్తపాతం మీదా నమ్మకం లేదు. కాని ఈ దేశంలో ఇలాంటి పశువుల్ని నలుగురిమధ్యా నిలబెట్టి కాల్చి చంపాల్సిన సమయం వచ్చిందని నాకనిపిస్తుంది. సిద్ధాంతాల కోసమో, రాజకీయ కారణాలకో చైనాలో తినామన్‌స్క్వేర్‌ దగ్గర వేలమంది యువకుల్ని చంపి రక్తపు మరకల్ని చెరిపేసింది ప్రభుత్వం. ఇలాంటి వారిని అతి ఉదారంగా ఆ పని చేసి -రక్తపు మరకల్ని అలాగే ఉంచాలని నా ఉద్దేశం.
ఇంత దారుణమైన నైచ్యానికి ఈ దేశంలో అతి భయంకరమైన 'ఆంక్ష' లేకపోవడం దయనీయమైన పరిస్థితి.
సోనియాగాంధీ, జయాబచ్చన్‌ వంటి వారి సానుభూతి ''అమ్మా, నాకింకా బతకాలని ఉంది'' అని ఆక్రోశించిన ఆ అమ్మాయికి ప్రాణం పోయదు. కాని మరో అమ్మాయికి ఇలాంటి దుస్థితి రాకుండా చూడవలసిన చర్య -మూగగా, నిస్సహాయంగా, నిశ్శబ్దంగా రంపపుకోతని అనుభవిస్తున్న నిష్తా జైన్‌ వంటి ఎందరో ఆడపిల్లల మనసుల్లో ఏ కాస్తో 'ఆశ'ని నింపుతుంది.
ఈ ఆడపిల్లకి జరిగిన అత్యాచారం కంటే 'ఉరిశిక్ష' అమానుషమయినదా? మానవహక్కుల సంఘాల వారు అవసరమైన సమయాల్లో నోరు విప్పరేం! అన్యాయం జరిగిందని గొంతులు చించుకునేవారు, జరగకముందు ఇలాంటి ఘోరాల్ని గర్హించరేం? ఆత్మవంచనకు అద్దం పట్టే ఈ 'హక్కుల' హక్కుదారులు ఏ మానవుల గురించి మాట్లాడుతారో ఆ భగవంతుడికే తెలియాలి.
వారందరికీ ఈ 23 ఏళ్ల అమ్మాయి ఫొటో, సామూహిక మానభంగం జరిగిన అమ్మాయిని హోటల్‌కి పిలిచి రేప్‌ చేసిన పోలీసు ఉద్యోగి ఫొటోని, ఈస్ట్‌ ఢిల్లీలో న్యూ అశోక్‌నగర్‌ కాలనీలో నవంబర్‌ 28న 20 ఏళ్ల అమ్మాయిని రేప్‌ చేసిన పొరుగింటి ప్రబుద్ధుడి ఫొటోని, కొన్ని పువ్వుల్ని ఇచ్చి -వాళ్ల కాళ్ల ఫొటోల్ని పేపర్లో వేయించండి. నోరెత్తని వారి మానవీయతకి మురిసిపోయి ఇక్కడి నుంచే మేం దండం పెట్టుకుంటాం. 

16 డిసెంబర్, 2012

ఆనందుని బాట...ఆధునిక భగవద్గీత

ఒకసారి వివేకానందుడికి, ఓ రాజుకి మధ్య ఓ చర్చ వచ్చింది. 
భారతీయులు విగ్రహాలను పూజిస్తారు. మూర్ఖులు. రాళ్లల్లో
ఏముంది, దేవుడి చిత్రపటాల్లో ఏముంది.. అంతా
మూఢనమ్మకం కాకపోతే అన్నాడట... ఆ రాజు. 
వివేకానందుడు అంతా మౌనంగా విన్నాడు. అప్పుడన్నాడు.
రాజా మనం మీ ఉద్యానవనానికి వెళ్దామా అని. అదేం భాగ్యం పదండి అన్నాడు
రాజు. ఉద్యానవనంలో రాజు గారి తండ్రి, తాత, ముత్తాతల విగ్రహాలు
వరుసగా ఉన్నాయి.వాటికి నమస్కరించుకుంటూ వెళ్తున్నాడు రాజు. వివేకానందుడు
ఒక విగ్రహం ముందు ఉమ్మేశాడు. వెంటనే ఆ రాజు... స్వామీ
మీరు చాలా విజ్ఞులునుకున్నాను.. ఇలా మా పూజ్యులైన
పూర్వీకుల విగ్రహం ముందు ఇలా ఉమ్మి వేయడం భావ్యమా
అని అడిగాడు. దానికి వివేకానందుడు.. అదేంటి రాజా.. మాట తప్పుతున్నారు.
పది నిమిషాల క్రితం మీరే కదా.. విగ్రహారధన మూర్ఖత్వం అన్నారు.
అందుకే నాకు జ్ఞానోదయమై ఇలా చేశాను. నేను ఉమ్మింది మీ
తాతగారి మీద కాదే... ఉట్టి రాయి మీద అన్నాడు. రాజుకి అర్థమైంది.. వివేకానందుని క్షమించమన్నాడు. అప్పుడాయన..
రాజా... విగ్రహారాధనలో నువ్వు రాయిని చూస్తున్నావు. అందుకే
అది రాయిలానే కనిపిస్తోంది. కానీ నేను జ్ఞానాన్ని చూస్తున్నాను.
అందుకే నాకు దేవుడు కనిపిస్తాడు. దృక్కోణం ముఖ్యం. రాయారప్పా
అన్నది కాదు.అధ్యాత్మక చింతనకి ఏకాగ్రత కలిగించే విగ్రహమైనా, మనోవిగ్రహమైనా
ఏదైనా... స్వాంతన కల్గించేదే. ఇదే ఉపనిషత్ సారం. గ్రహించు. అని చెప్పాడట.
లేని నీ తాత విగ్రహాన్ని అవమాన పరిస్తేనే ఆగ్రహం వచ్చిందే. జగమంతా
వ్యాపించి ఉన్న దేవుని విగ్రహాన్ని పూజిస్తే తప్పేంటి అన్నాడట. పాజిటివ్ థింకింగ్ అంటే ఇది. మరి కొద్ది రోజుల్లో.. ఆనందుడి 150వ
జయంతి. యువతకు మార్గదర్శకుడైన ఆయన సందేశం.. భారతీయ
యువతకు ఆధునిక భగవద్గీత లాంటిది.

25 నవంబర్, 2012

ముందు బ్లాగుకి కొనసాగింపు

మరి ఐదుగురు భర్తలు కదా.. ద్రౌపది ఎలా నెట్టుకొచ్చిందీ అనే సందేహం
అందరికీ వస్తుంటుంది. దానికి పాండవులు ఒక పద్ధతి పెట్టుకున్నారు.
సంవత్సరానికి ఒకరి ఇంట ద్రౌపది ఉంటుంది. ఈ సంవత్సరంలో
మిగిలిన వారు ఆ ఇంటివైపు వెళ్లకూడదు. ఒక వేళ వెళితే..
ఆ సోదరుడు ఆరునెలల పాటు పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలి.
ఒక సారి ధర్మరాజు, ద్రౌపది ఆయుధాగారాన్ని వీక్షించేందుకు
వెళ్లారు. అదే సమయం అర్జునుడికి అటువైపు పని పడింది.
అక్కడే ధర్మరాజు, ద్రౌపది ఉన్నారన్న విషయం అర్జునుడికి
తెలియదు. అలా వెళ్లిన అర్జునుడు ధర్మరాజు, ద్రౌపదిలను చూస్తాడు.
నిజానికి అదేం తప్పు కాకపోయినా.. పద్ధతి మీరకూడదన్న నియమంతో
అర్జునుడు ఆరునెలలు పుణ్యక్షేత్రాలకు వెళ్లాడు.