Powered By Blogger

31 మార్చి, 2013

అందం చీరలోనా... చీర కట్టిన చిన్నదానిలోనా


పొద్దున్నే అలా వస్తుంటే.. ఎక్కడ నుంచి వస్తున్నారో 18 నుంచి 22 ఏళ్ల మధ్య అమ్మాయిలు.. అచ్చ తెలుగు
అందాలు... చీరల్లో కనిపించారు. ఏదో పూలవనాన్ని చూసినట్టు.. అందాల పరిమళాలు మనసుని తాకినట్టు
ఝల్లుమంది. ఇదే విషయాన్ని మా ఆవిడకి చెప్పాను. కొరకొరగా చూసి... చీరల్లో నన్నెపుడూ ఇలా పొగడలేదే
అని కళ్లు చిట్లించింది. వాళ్ల అందం కాబట్టి మాటల్లో చెప్పగలిగాను.. నీ అందానికి మాటలు చాలొద్దూ.. అని
అప్పటికైతే తప్పించుకున్నాను గానీ.. మళ్లీ ఎందుకో చీర గురించి చిన్నపాటి గ్రంధమే రాయచ్చనిపించింది.
జిగిబిగి చీర ఎంత కొంటెదంటే.. ఎక్కడ ఏది దాయాలో.. ఎక్కడ గుట్టు విప్పాలో దానికే తెలుసు. అందాలన్నిటినీ చుట్టగా చుట్టేసి.. కుచ్చెళ్లలో దాచేసీ... భావాలెన్నో పలికించే.. ఊరించే చీర  కన్నా.. వాత్స్యాయనుడు ఏం గొప్పా.. ? నల్లంచు తెల్లచీరైనా.. తెల్లంచు నల్లచీరైనా... పైటంచు రెపరెపలకి.. గాలివాటానికి పోటీ పడితే... శ్రీనాధుడైనా కలం వదిలి కళ్లప్పగించాల్సిందే. కరిమబ్బుల్లో చందమామ దాపరికం ఎంత సేపూ...  మబ్బు తొలగగానే వెన్నెల మత్తు. చీర తెరలలో వయసు పున్నమి ఊసులు వెన్నెల కన్నా మత్తు. నచ్చిన నిచ్చెలి చీర కడితే బంధనంలో ఉండలేక బయట పడుతూ... మన్మధుని విల్లు కన్నా ఒంపులు పోయే నడుము... చెలికాడుకి సిగ్గుల నజారానా మరి. ఇంతకూ అందం చీరలో ఉందా... చీర కట్టిన చిన్నదానిలో ఉందా ? శ్రీనాధుడు ఓ రసభావోద్వేగంలో పేర్చిన ఓ అక్షరమాల గుర్తొస్తోంది. "మన్మధుని కొంప ఒక చెంప కనిపింప చీర కట్టి నడియెన్ చిగురుబోడి" అని తేల్చి చీర, చిన్నది రెండూ ఒకదానికొకటి పోటీనే అని చెప్పకనే చెప్పాడు. ప్రకృతిని ఒడిసి పడితే చీరలో చిన్నదాని ముందు చిన్నబోతుందేమో. అసలు అందం చూసే కళ్లను బట్టి ఉంటుందంటాడు జాన్ కీట్స్ మహాశయుడు. నిజమే.. పల్లెటూరి గట్లలో పడుచుల చీరకట్టులో పచ్చిక బయళ్లంత స్వచ్ఛమైన అందం. ఆలయంలో పడతి చీరకట్టు నైవేద్యం అంత పవిత్రం. పెళ్లి చూపుల్లో నులి సిగ్గుల్లో చీర చూపేది... బాపూ బొమ్మలోని రమణీయం. సుందర కావ్యం. తొలిరాత్రి వేళ చీర పెంచే గుండెవేగం... కాంతి వేగాన్ని మించిన ప్రేమోద్వేగం. ఎంతని చెప్పనూ.. ఏమని వర్ణించనూ.. సౌందర్య భావన మీదే ఎడతెగని గౌరవం పెంచే మన తెలుగు చీర ప్రపంచానికే కట్టూ బొట్టూ నేర్పిందంటే... అంతకు మించిన సౌందర్యం లేకనే కదా. చూడగానే చేతులెత్తి నమస్కరించే సంస్కారం నేర్పేదీ చీరే... మదిలో కొంటెకలల అలల అలజడి రేపేదీ చీరే.. అహో ఒక్క చీరతో ఎంత మాయ చేశావయా బ్రహ్మయ్యా. కాస్త కొంటెతనం... ఇంకాస్త చిలిపితనం... వద్దన్నా వినని అల్లరితనం... వీటన్నిటితో కలగలిసిన అందం... మొత్తంగా
కలిపితే చీరందం.





  
 
 

8 కామెంట్‌లు:

  1. అందం చీరలోనా... చీర కట్టిన చిన్నదానిలోనా

    రెండింటిని మించి, చూసే కను దోయి లో నండోయ్ !!

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. మీ మాటల్లోని చక్కదనంతో చీర మరింత అందమైనదిగా అనిపించింది. నిజంగా అద్భుతంగా వర్ణించారు. మరింతమంది చీరలోని అందాన్ని తెలుసుకుంటారేమో మీరు రాసింది చదివి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు... అది తెలుగుదనం మహత్యం.. మీ పొగడ్తలు నాకు కాదండోయ్ చీర సొగసుకే చెందుతుంది.

      తొలగించండి
  3. నేను జిలేబీ గారితో ఏకీభవిస్తున్నాను......అందం చూసేకనులదే
    ఏ చీరకట్టినా ఎంతందంగా ఉన్నా ఎవరూ చుడకపోతే ఏంచేస్తాం:-)
    అందంగాలేనా అసలేంబాలేనా అని అడిగి మరీ మెప్పించుకుంటాం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చూసి తరించిపోయే నాలాంటి వాళ్లుంటారు కదండీ... మీరు బొత్తిగా నిరాశావాది

      తొలగించండి
  4. యావండి సతీశ్ గారు..బావున్నారా.? ఆయ్ బాబోయ్ మీలో ఇంతటి భావుకత్వం ఉందాండి. యామైనా మీరు బయటకు కనిపించరు గానీ గొప్ప భావకవులన్న మాట.


    చివరగా నాది చిన్న అభ్యంతరం...

    అందం చూసే కళ్లదే ఐతే....ఉత్త చీర చూసినా అందంగా కనిపించాలి కదా....

    కానీ చీరకు కట్టుతోనే అంతులేని అందం వస్తుంది కదా...!

    కనుక ఉత్త కళ్లు, చీరలు ఉంటే సరిపోవండీ బాబూ..."అందమైన" వాళ్లు కూడా ఉండాలి మరి...యావంటారు...? ఉంటానండీ...చందు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును చీరకి కట్టు.. ఆ కట్టుకి బొట్టు.. ఈ రెంటికీ సొగసైన చిన్నది... ఈ మూడు ఉంటేనే కంటికి
      ఇంపు. చూసే కళ్లను బట్టి అందం. ఎలా ఉన్నారు.. చందూ.. తులసీ. నేను మొదట భావుకుడినే
      ఆ తర్వాతే జర్నలిస్టుని...

      తొలగించండి